
ఆ ఎస్సై తప్పేం లేదు : ఐజీ
ఒంగోలు టౌన్ : గిద్దలూరులో వైఎస్సార్ సీపీ నేత వైజా భాస్కర్‌రెడ్డి పట్ల అనుచితంగా ప్రవర్తించి ఆయన మరణానికి కారణమైన ఎస్సై వై.శ్రీనివాసరావును గుంటూరు రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్ వెనకేసుకొచ్చారు. ఆ ఘటనలో ఎస్సై ఎలాంటి పొరపాటు చేయలేదని చెప్పుకొచ్చారు.
బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్‌తో కలిసి ఐజీ సునీల్‌కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గిద్దలూరు ఘటనకు సంబంధించి ఆయన మాట్లాడారు. గిద్దలూరులో రెండు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా అందుకు కారణమైన ఎస్సైని వెనకేసుకురావటంలో ఐజీ ఏ మాత్రం సంకోచించలేదు. మహిళా సిబ్బంది లేకుండా డాక్టర్ భార్యను ఎస్సై తన జీపులో పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లడాన్ని ఐజీ కనీసం ప్రస్తావించలేదు.
వైజా భాస్కర్‌రెడ్డి అనారోగ్యం వల్లే మృతి చెందాడని, ఆయన్ను ఎస్సై కొట్టలేదని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం, శాంతిభద్రతలను ఉల్లంఘించటం సరైన పద్ధతి కాదన్నారు. భాస్కర్‌రెడ్డి మృతిపై పోస్టుమార్టం నివేదిక తెప్పించామని, మృతుడి శరీరంపై కనపడే దెబ్బలు లేవని నివేదికలో ఉన్నట్లు ప్రస్తావించారు. భాస్కర్‌రెడ్డి మృతి తర్వాత దుండగులు కొందరు గిద్దలూరు-కలశపాడు రోడ్డులో పోలీస్ జీపును తగులబెట్టారని, ఎంవీ సుబ్బారావు హీరోహోండా షోరూం వద్దకు వెళ్లి సామగ్రిని ధ్వంసం చేశారని చెప్పారు.
డాక్టర్ హరనాథరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వై.శ్రీనివాసరావు మీద కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై నెల్లూరు రూరల్ డీఎస్పీని విచారణాధికారిగా నియమించామన్నారు. అన్ని కేసులను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఐజీ వివరించారు.