పట్టణాల్లో ‘పాదచారుల మార్కెట్లు’ | There will be new style of markets in cities and towns in AP | Sakshi
Sakshi News home page

పట్టణాల్లో ‘పాదచారుల మార్కెట్లు’

Published Sat, Jun 20 2020 4:54 AM | Last Updated on Sat, Jun 20 2020 4:54 AM

There will be new style of markets in cities and towns in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో ఇక ప్రత్యేకంగా పాదచారుల మార్కెట్లు రానున్నాయి. అంటే పాదచారులకు మాత్రమే అనుమతిస్తూ కొన్ని మార్కెట్లను ప్రత్యేకంగా గుర్తించనున్నారు. వీటిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితమే నిర్ణయించింది. ఇటీవల ముఖ్యమంత్రి ఆమోదించిన పులివెందుల మోడల్‌ సిటీ ప్రణాళికలోనే ఈ ప్రతిపాదనను చేర్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా వీటిని ఏర్పాటు చేయాలంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సిన ఆవశ్యకత పెరగడంతో ప్రత్యేకంగా పాదచారుల మార్కెట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిపై రాష్ట్ర పురపాలక శాఖ ఇప్పటికే కార్యాచరణకు ఉపక్రమించింది. 

ఇదీ విధానం 
► జనసాంద్రత, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే నగరాలు, పట్టణాల్లో పాదచారులకు మాత్రమే ప్రవేశం కల్పించేలా కొన్ని మార్కెట్లను గుర్తిస్తారు.  
► ఆ మార్కెట్లలోకి ద్విచక్ర వాహనాలతోపాటు ఎలాంటి వాహనాలను అనుమతించరు. నడచుకుంటూనే వెళ్లి షాపింగ్‌ చేయాలి.  

ఇవీ లక్ష్యాలు
► ట్రాఫిక్‌ సమస్య తగ్గడమే కాకుండా కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుంది.  
► కొనుగోలుదారులు భౌతికదూరం పాటిస్తూ షాపింగ్‌ చేయొచ్చు.  

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవే 
► అన్ని నగరాలు, పట్టణాల్లో  పురపాలక శాఖ పర్యవేక్షణలో ఏర్పాటు చేయాలి. 
► 10 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న నగరాల్లో కనీసం మూడు మార్కెట్లను, అంతకంటే తక్కువ జనాభా ఉన్న నగరాలు పట్టణాల్లో కనీసం ఒక మార్కెట్‌ను ఏర్పాటు చేయలి.  
► మార్కెట్లలో రోడ్లు, ఫుట్‌పాత్‌లు, గార్బేజ్‌ కలెక్షన్‌ పాయింట్లు, టాయిలెట్లు ఏర్పాటు చేయాలి.  
► ఈ మార్కెట్ల ప్రాథమిక ఎంపిక జూన్‌ 30కి పూర్తి చేయాలి. సెప్టెంబర్‌ 30 కల్లా ప్రణాళిక ఖరారు చేసి నవంబర్‌ 30నాటికి ప్రారంభించాలి.  
► చెన్నై, పూణేల్లోని పాదచారుల మార్కెట్లను మోడల్‌గా తీసుకోవాలి.  

ప్రభుత్వం ఇలా చేయనుంది... 
► అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక్కో మార్కెట్‌ను గుర్తించనున్నారు. హా    విజయవాడలో బీసెంట్‌ రోడ్డును ‘పాదచారుల మార్కెట్‌’గా చేయాలని నిర్ణయించారు.  
► విశాఖపట్నంలో పూర్ణా మార్కెట్‌తోపాటు మరొకటి, తిరుపతిలో కేటీ రోడ్డులో మార్కెట్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. 
► పులివెందుల మోడల్‌ సిటీపై రూపొందించిన ప్రణాళికలో ఈ ప్రతిపాదన చేర్చగా సీఎం ఆమోదముద్ర వేశారు. 

జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు
పాదచారుల మార్కెట్లను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ కొన్ని నెలల క్రితమే నిర్ణయించింది. విజయవాడ, విశాఖపట్నంతోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తాం.’ 
–విజయ్‌కుమార్, రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్‌–డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement