థర్మల్ ప్లాంటు రద్దు చేయండయ్యా... | Thermal plant Termination | Sakshi
Sakshi News home page

థర్మల్ ప్లాంటు రద్దు చేయండయ్యా...

Published Sun, Jul 26 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM

థర్మల్ ప్లాంటు  రద్దు చేయండయ్యా...

థర్మల్ ప్లాంటు రద్దు చేయండయ్యా...

అప్పిలేట్ అథారిటీకి మొరపెట్టుకున్న పోరాట కమిటీ నాయకులు
{పమాదమని తెలిసినా... నిర్మాణం న్యాయమా?: ఓ మహిళ వేడుకోలు
క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన ఎన్విరాన్‌మెంట్ అప్పిలేట్ సబ్ కమిటీ
పాత పరిశీలనల మాదిరిగా చేయొద్దని స్థానికుల వినతి

 
‘థర్మల్ ప్లాంటువల్ల ప్రమాదం ఉందని తెలిసినా ఇక్కడ నిర్మాణం ఎలా చేపడుతున్నారు... మాకు జీవనోపాధి లేకుండా మా పొట్టలు కొట్టడం ఎంతవరకు సబబు’ అని కారుణ్య రమణమ్మ అనే మత్స్యకార మహిళ వేడుకోలు. ’ఈ ప్లాంటు వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ఏటా మా పొలాలు ముంపుబారిన పడతాయి. కాలుష్యంతో ఈ ప్రాంతం సర్వనాశనమవుతుంది. ప్లాంటు రద్దు చేస్తే మేమంతా సంతోషంగా బతుకుతాం’ ఇది పోరాట కమిటీ నాయకుల డిమాండ్ ఇలా అడుగడుగునా ఈస్టుకోస్ట్ థర్మల్ ప్లాంటు యాజమాన్యం తవ్విన కాలువ పరిశీలనకు వచ్చిన జాతీయ పర్యావరణ అప్పిలేట్ అథారిటీ సబ్‌కమిటీకి స్థానికులు మొరపెట్టుకున్నారు.
 
సంతబొమ్మాళి : మండలంలోని కాకరాపల్లి పరిసర ప్రాంతాల్లో ఈస్టుకోస్టు థర్మల్ ప్లాంటు యాజమాన్యం తవ్విన కాలువను జాతీయ పర్యావరణ అప్పిలేట్ అథారిటీ సబ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ సి.ఆర్.బాబు ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం క్షేత్ర స్థాయిలో శనివారం పరిశీలించింది. తొలుత వడ్డితాండ్ర వద్ద థర్మల్ ప్లాంటుకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి మత్స్యకారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కారుణ్య రమణమ్మ అనే మత్స్యకార మహిళ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ థర్మల్ ప్లాంటు వలన ప్రమాదమని తెలిసినప్పటికీ ఇక్కడ నిర్మాణం చేపట్టి  జీవనోపాధి లేకుండా పొట్టలను కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దశలో ప్లాంటుకు వ్యతిరేకంగా మత్స్యకారులు థర్మల్ వద్దంటూ నినాదాలు చేశారు. దీనిపై కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్ జోక్యం చేసుకుని వారించడంతో నినాదాలను విరమించారు. అక్కడినుంచి కమిటీ థర్మల్ ప్లాంటు మెయిన్ గేటు నుంచి లోపలికి వెళ్లింది. రైతులు, పోరాట కమిటీ నాయకులను లోనికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఇది గ్రహించిన కమిటీ సభ్యులు ప్లాంటు నుంచి బయటకు వచ్చేశారు. అక్కడి నుంచి కాలువ పొడవునా మూడు గంటల పాటు కాలి నడకనే తిరిగి స్థానికులు, థర్మల్ యాజమాన్యం నుంచి పూర్తి వివరాలను సేకరించారు. థర్మల్ యాజమాన్యం నిర్మించిన కాలువ నీరు ఎక్కడ సముద్రంలో కలపాలనుకున్నారో మ్యాప్‌లో చూపించాలని కమిటీ చైర్మన్ సి.ఆర్.బాబు ప్రశ్నించడంతో ఇరిగేషన్ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. అసంతృప్తి వ్యక్తం చేసిన చైర్మన్ కాలువ ఎక్కడ అంతం అవుతుందో నీరు ఎలా సముద్రంలో కలుస్తుందో తాను తప్పక చూడాల్సిందేనని పట్టుపట్టారు. గత్యంతరం లేక అన్ని శాఖల అధికారులు ఆయన వెంట వెళ్లారు. కానీ కాలువ ఎక్కడా కలిపినట్లు కనిపించక పోవడం, వెడల్పు కూడా తక్కువగా ఉండడాన్ని కమిటీ గుర్తించింది. వెంటనే కాలువ వెడల్పు చేసి దేశగెడ్డకు కలపాల్సి ఉంటుందని చెర్మైన్ బాబు థర్మల్ యాజమాన్యానికి సూచించారు.

ఈ సందర్భంగా థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ అనంతు హన్నూరావు ఆధ్వర్యంలో రైతులు, మత్స్యకారులు పోరాట కమిటీ నాయకులు అప్పిలేట్ థారిటీకి తమ వేదన తెలియజేశారు. తంపర చుట్టూ తవ్విన కాలువ వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని, ప్లాంటు అవసరాలకే కాలువను తవ్వుకున్నారని వివరించారు. ప్లాంటు చుట్టూ ఎత్తై గట్టు వేయడం, గోడ కట్టడం వల్ల వరదనీరు వెళ్లే దారిలేక ఏటా పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. సముద్ర మట్టానికి జీరో లెవల్‌లో కాలువ ఉండడం వల్ల సముద్రపు నీరు కాలువలోకి వచ్చి పంట పొలాలు ఉప్పు భూములుగా మారే అవకాశముందని అన్నారు. ప్లాంటు నిర్మాణం వల్ల ఏటా సుమారు 30 వేల ఎకరాలు మునిగిపోతున్నాయని చెప్పారు. గత కమిటీల మాదిరిగా వాస్తవాలు బుట్టదాఖలు చేయకుండా న్యాయంచేయాలనికోరారు. పర్యటనలో కమిటీ సభ్యులు డాక్టర్ పి.కె.థార్, పి.డి.స్వాయ్, డి.బి.బామన్, ఎం.రమేష్, టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వరరావు, మత్స్యశాఖ డీడీ యాకూబ్‌భాషా, తహశీల్దార్ బి.రామారావు, ఇరిగేషన్ అధికారులు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరితేజేశ్వరరావు, పోరాట కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement