సాక్షి, నిజామాబాద్: జిల్లాలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలనే అంశం మరోమారు తెరపైకి వచ్చింది. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో భవిష్యత్‌లో విద్యుత్ కొరతను అధిగమించేందుకు 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు ప్లాంట్లను జిల్లాలో నెలకొల్పాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ జిల్లా శాఖ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులను కలిసి వారిపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ రూపొందించింది.
జిల్లాలో థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు అంశంపై గతంలో కూడా కసరత్తు జరిగింది. జిల్లా పరిధిలోని గోదావరి పరీవాహక ప్రాంతం నవీపేట్ మండలం కందకుర్తి వద్ద 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం గతంలో సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు 2009లో జిల్లా నుంచి ప్రతిపాదనలు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ వరకు వెళ్లాయి. ఈ ప్రాజెక్టు సర్వే కోసం రాష్ట్ర సర్కారు బడ్జెట్ అలాట్‌మెంట్‌కు కూడా అంగీకారం తెలిపింది. కానీ అప్పటి జిల్లా ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా ఈ అంశం కొన్నేళ్లుగా మరుగున పడినట్లయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. జిల్లా విద్యుత్ అవసరాలు, ప్రస్తుత సరఫరా, కనెక్షన్లు వంటి అంశాలతో కూడిన నివేదికను సిద్ధం చేసిన విద్యుత్ జేఏసీ ఈ మేరకు కార్యాచరణ చేపట్టింది.
విద్యుత్ ఉత్పత్తి అనివార్యం
జిల్లాలో 1,500 మెగావాట్ల విద్యుత్ లోడ్ ఉంటుంది. ఇందులో ఎక్కువ విద్యుత్ వ్యవసాయ అవసరాలకే వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2.35 లక్షల పంపుసెట్లు ఉన్నాయి. ప్రతినెల జిల్లాలో సుమారు 180 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. ఇందులో ఒక్క వ్యవసాయానికే 110 మిలియన్ యూనిట్లు ఖర్చవుతోంది. కాగా తెలంగాణ ఏర్పడితే సుమారు 40 శాతం విద్యుత్ కొరత వస్తుందనే అంచనా ఉంది. దీన్ని అధిగమించేందుకు తెలంగాణాలోని పది జిల్లాల పరిధిలో కనీసం 4,000 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో 1,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసిన పక్షంలో జిల్లా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుంది.
ఏర్పాటుకు అనువైన ప్రదేశం...
థర్మల్‌ప్లాంట్ ఏర్పాటుకు జిల్లాలో ఎంతో అనువైన వాతావరణం ఉంది. ఈ ప్లాంట్లు నిర్మాణానికి నవీపేట మండలం కందకుర్తి వద్ద గోదావరి పరీవాహక ప్రాంతం అనువైందని భావిస్తున్నారు. ఇక్కడ నదీ జలాలు అందుబాటులో ఉండటమే కాకుండా, విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును రవాణా చేసేందుకు రైల్వే ట్రాక్ అందుబాటులో ఉంది. సింగరేణి బొగ్గు గనులున్న శ్రీరాంపూర్ (మంచిర్యాల) రామగుండం కోల్‌మైన్లు సుమారు 200 కిలోమీటర్ల దూరం ఉంటాయి. పైగా జిల్లాలో విద్యుత్ డిస్ట్రిబ్యూషన్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు దాదాపు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. డిచ్‌పల్లి వద్ద 400 కేవీ సబ్‌స్టేషన్ ఉంది. పలుచోట్ల 220 కేవీ, 132కేవీ, 33 కేవీ సబ్‌స్టేషన్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ. 7,500 కోట్లు ఉంటుందని జేఏసీ అంచనాకొచ్చింది. ఈ కేంద్రం ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఐదు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయని భావిస్తున్నారు.
తెలంగాణ మంత్రుల సారథ్య బృందానికి వినతి
జిల్లాలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ హైదరాబాద్‌కు వెళ్లి తెలంగాణ మంత్రుల సారథ్య బృందానికి వినతిపత్రం అందజేస్తామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లక్ష్మణ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే సోమవారం జిల్లా మంత్రి పి.సుదర్శన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశామన్నారు.
మళ్లీ తెరపైకి థర్మల్ ప్రాజెక్టు!
Published Tue, Oct 29 2013 6:26 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement