thermal project
-
బంగ్లాదేశ్ ప్రాజెక్టును పూర్తి చేసిన బీహెచ్ఈఎల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్ కంపెనీ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) బంగ్లాదేశ్‌లో నెలకొల్పిన మైత్రీ సూపర్ థర్మల్ పవర్‌ప్రాజెక్టులో యూనిట్–2ను పూర్తి చేసింది. 660 మెగావాట్ల సామర్థ్యంగల యూనిట్–2లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్టు బుధవారం ప్రకటించింది. బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డ్, ఎన్టీపీసీల సంయుక్త భాగస్వామ్య కంపెనీ అయిన బంగ్లాదేశ్–ఇండియా ఫ్రెండ్షిప్ పవర్ కంపెనీ కోసం బీహెచ్ఈఎల్ ఈ ప్రాజెక్టును చేపట్టింది. -
బ్యాంకుల చేతికి 9 విద్యుత్ ప్లాంట్లు!
మొండిబకాయిలుగా మారిన థర్మల్ ప్రాజెక్టుల టేకోవర్‌కు సన్నాహాలు ♦ నిర్వహణ ఎన్టీపీసీకి అప్పగించే అవకాశం... ♦ జాబితాలో ల్యాంకో ఇన్ఫ్రా బాబంధ్ ప్రాజెక్టు కూడా... న్యూఢిల్లీ: మొండిబకాయిల వసూళ్లపై తీవ్రంగా దృష్టిపెట్టిన బ్యాంకులు... విద్యుత్ రంగ ప్రాజెక్టులను దక్కించుకునే పనిలోపడ్డాయి. ప్రధానంగా తమకు రావలసిన బకాయిల మొత్తానికి సంబంధించి ఆయా ప్రాజెక్టుల్లో వాటాను టేకోవర్ చేసుకునేందుకు చకచకా పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 9 థర్మల్ పవర్ ప్రాజెక్టులను షార్ట్‌లిస్ట్ చేసినట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఎన్పీఏ సమస్య పరిష్కారానికి తాజాగా ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారీగా రుణాలను ఎగవేసిన సుమారు 12 కంపెనీలపై దివాలా చట్టాన్ని ప్రయోగించాలని కూడా ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించడం... ఆ మేరకు కొన్ని కంపెనీలపై బ్యాంకులు చర్యలు చేపట్టడం కూడా జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో పేరుకుపోయిన ఎన్‌పీఏల్లో ఈ 12 ఖాతాలకు సంబంధించినవే 25 శాతం(దాదాపు రూ.2 లక్షల కోట్లు) కావడం గమనార్హం.బ్యాంకులు షార్ట్‌లిస్ట్ చేసిన తొమ్మిది ప్రాజెక్టుల్లో జిందాల్ ఇండియా థర్మల్ పవర్(జేఐటీపీఎల్)కు చెందిన డేరంగ్ ప్రాజెక్టు(ఒడిశాలో ఉంది. దీని సామర్థ్యం 1,200 మెగావాట్లు), రాటన్ఇండియా పవర్ ప్లాంట్(మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉంది. సామర్థ్యం 1,350 మెగావాట్లు), లాంకో ఇన్‌ఫ్రాటెక్‌కు చెందిన బాబంధ్(ఒడిశా, 1,320 మెగావాట్లు) ప్రధానమైనవని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ 9 ప్రాజెక్టుల మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం సుమారు 25 వేల మెగావాట్లుగా అంచనా. రుణాలు ఎగ్గొట్టిన కంపెనీల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం నిర్ధేశించడంతో మంత్రిత్వ శాఖలు కూడా దీనిపై దృష్టిపెడుతున్నాయి. ఎన్పీఏలుగా మారిన విద్యుత్ ప్రాజెక్టుల టేకోవర్‌కు బ్యాంకులు అంగీకరించినట్లు విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ ఇటీవలే వెల్లడించారు. ప్రాజెక్టులన్నీ చిక్కుల్లోనే... వాటా తీసుకోవడం కోసం బ్యాంకులు చురుగ్గా పరిశీలిస్తున్న మూడు ప్రధాన పవర్ ప్లాంట్లను విక్రయించేందుకు ఏడాదిగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ... ఎవరూ ముందుకురాలేదు. జేఐటీపీఎల్ డేరంగ్ ప్లాంట్, ల్యాంకో ఇన్ఫ్రా బాబంధ్ ప్లాంట్లు తీవ్రమైన బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. వీటికి కేటాయించిన బొగ్గు గనులు బొగ్గు స్కామ్‌లో చిక్కుకోవడంతో 2014లో సుప్రీం కోర్టు రద్దు చేయడంతో ఇంధన సరఫరా సమస్యల్లో చిక్కుకున్నాయి. ఇక రాటన్ఇండియా నాసిక్ యూనిట్ విద్యుత్‌కొనుగోలు ఒప్పందాలు లేక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఇక రాటన్ ఇండియా నాసిక్ యూనిట్ 2016–17లో రూ.215 కోట్ల నష్టాన్ని చవిచూసింది. మొండిబకాయిల సమస్యను ఎదుర్కొంటున్న ప్రాజెక్టులను నడిపించేందుకు కంపెనీలు సిద్ధంగానే ఉన్నప్పటికీ.. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యుత్ పంపిణీ కంపెనీలేవీ అదనంగా విద్యుత్ కొనుగోళ్లకు టెండర్లను నిర్వహించకపోవడంతో సమస్యలు తీవ్రతరమవుతున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోపక్క, ఎన్పీఏలపై బ్యాంకుల నుంచి ఒత్తిడి అంతకంతకూ పెరిగిపోతోంది. విద్యుత్‌కు డిమాండ్ మందగించడంతో చాలా ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతోందని.. 2022 వరకూ ఈ రంగంలో కొత్తగా ప్రైవేటు పెట్టుబడులు ఉండకపోవచ్చనేది విద్యుత్ రంగ నిపుణుల అభిప్రాయం. రంగంలోకి ఎన్టీపీసీ...! బ్యాంకులు చేజిక్కించుకునే థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్వహణను ప్రభుత్వరంగంలోని ఎన్టీపీసీకి అప్పగించేందుకు విద్యుత్ శాఖ కూడా సుముఖంగానే ఉంది. ఈ విషయాన్ని గోయల్ కూడా వెల్లడించారు. అయితే, ఈ ప్లాంట్లలో ఎన్టీపీసీ పెట్టుబడులు పెట్టే అవకాశం లేదని.. నిర్వహణకు మాత్రమే పరిమితమవుతుందని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరోపక్క, ఈ ప్రాజెక్టుల్లో కొంత ఈక్విటీ వాటాను తీసుకునే అవకాశాన్ని ఎన్టీపీ పరిశీలిస్తున్నట్లు కంపెనీ వర్గాల సమాచారం. ‘ఈ ప్లాంట్ల కార్యకలాపాలను నిర్వహించేందుకు తాము బ్యాంకుల నుంచి కొంత ఫీజును తీసుకుంటాం ఒకవేళ వీటిలో 3–4 శాతం వాటా గనుక బ్యాంకులు తమకు ఇస్తే... ఫీజును చెల్లించాల్సిన అవసరం ఉండదు’ అని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
ఉపాధి కల్పించని ప్రాజెక్టులెందుకు?
ఎన్‌సీసీపీపీఎల్ ఎదుట మండపం వాసులు ఆందోళన సమస్యల విషయంపై నేడు చర్చలకు యాజమాన్యం సంసిద్ధత తోటపల్లిగూడూరు :ఉపాధి అవకాశాలను కల్పిస్తామని కల్లిబొల్లి మాటలు చెప్పిన కంపెనీ యాజమాన్యాలు మాట మార్చి స్థానికులకు అన్యాయం చేస్తే సహించేది లేదని మండపం పంచాయతీ సర్పంచ్ కాల్తిరెడ్డి సుబ్బారావు హెచ్చరించారు. ఉపాధి కల్పనలో జరుగుతున్న అన్యాయంపై మండపం పంచాయతీలోని పలు గ్రామాలకు చెందిన స్థానికులు బుధవారం అనంతపురంలో ఉన్న ఎన్‌సీసీపీపీఎల్ విద్యుత్ ప్రాజెక్ట్ ఎదుట ఆందోళన చేశారు. సర్పంచ్ సుబ్బారావు మాట్లాడుతూ స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పించే విషయంలో ఎన్‌సీసీపీపీఎల్ విద్యుత్ ప్రాజెక్ట్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఉపాధి అవకాశాలను కల్పిస్తామని స్థానికుల భూముల్లో కంపెనీ ఏర్పాటు చేసి, ఇప్పుడు మాటమార్చి వారి పొట్టకొట్టే ఆలోచన చేస్తుండటం సమంజసం కాదన్నారు. ఎన్సీసీ నిర్మాణ సమయంలో గ్రీన్‌బెల్ట్ కింద, కంపెనీ కార్యనిర్వాహక కార్యాలయాల్లో స్థానిక గ్రామాలకు చెందిన సుమారు 180 మంది మహిళలకు రోజువారి కూలితో ఉపా«ధి కల్పించారన్నారు. అయితే లేనిపోని కొర్రీలుపెడుతూ ఇటీవల కాలంలో 100 మంది మహిళా కార్మికులను తొలగించారన్నారు. విడతల వారీగా ఒక్కొక్కరిని తొలగించేందుకు కంపెనీ యాజమాన్యం చర్యలు తీసుకుందన్నారు. తక్కువ వేతనంతో పని చేస్తున్నప్పటికీ స్థానికులను పని నుంచి తొలగించడంలో కంపెనీ యాజమాన్యం ఆంతర్యమేంటని సర్పంచ్ సుబ్బారావు ప్రశ్నించారు. కంపెనీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న స్థానికులైన వాహనాలను సైతం పక్కన పెట్టి స్థానికుల పొట్ట కొట్టిందన్నారు. ఈ రకంగా స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్న కంపెనీపై పోరాడుతామన్నారు. సమస్యలపై చర్చలకు యాజమాన్యం సంసిద్ధం స్థానికుల ఆందోళన నేపథ్యంలో సమస్యలపై చర్చించేందుకు కంపెనీ యాజమాన్యం ముందుకు వచ్చింది. స్థానికులు బుధవారం కంపెనీ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతతకు దారి తీస్తుండటంతో బందోబస్తుకు వచ్చిన కృష్ణపట్నం పోర్ట్ ఎస్ఐ విశ్వనాథరెడ్డి ఆందోళనకారులతో మాట్లాడి వారిని శాంతిప జేశారు. ఎస్ఐ ఆందోళనకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులతో చర్చించేందుకు ఆయన కంపెనీ యాజమాన్యాన్ని ఒప్పించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చలు జరిగేలా అంగీకరింప చేశారు. గురువారం జరిగే ఈ చర్చల ద్వారా తమ న్యాయం జరగకపోతే కంపెనీ ఎదుట ఆమరణ దీక్షలకు దిగతామని సర్పంచ్ సుబ్బారావు హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎండికళ్ల దయాకర్, ఉప సర్పంచ్ వాంకిల ప్రవీణ్, వెంకటేశ్వర్లు, సుధీర్, హరి, గోపి, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
రూ.2,524 కోట్ల థర్మల్ దోపిడీ!
- కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ టెండర్లు ఖరారు - సర్కారు అండతో ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థల మాయ - పెంచింది రూ.2,680 కోట్లు... తగ్గించింది రూ.156 కోట్లు - ప్రభుత్వాధినేతకు రూ.వెయ్యి కోట్ల వాటా? - అర్ధరాత్రి జెన్కో బోర్డు భేటీ.. ఒక్క రోజులోనే ఎల్వోఐ సాక్షి, హైదరాబాద్ : అవినీతి ఆరోపణలున్నా లెక్కచేయకుండా ప్రభుత్వం కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ ప్రాజెక్టుల కాంట్రాక్టులను అడ్డగోలుగా ఖరారు చేసింది. మంగళవారం రాత్రి జెన్కో బోర్డు సమావేశమై టెండర్లను ఆమోదించింది. బుధవారం ఏకంగా లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) కూడా ఇచ్చేసింది. ఒకవైపు విపక్షాలు నిరసన తెలిపినా, ఇంకోవైపు టెండర్లపై న్యాయస్థానంలో కేసులున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రెండు కాంట్రాక్టు పనులను రూ.2,524 కోట్ల ఎక్సెస్‌కు కట్టబెట్టడం గమనార్హం. ప్రతిఫలంగా ప్రభుత్వాధినేతకు దాదాపు రూ.వెయ్యి కోట్లు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అవినీతి తంతును ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో నిలదీశారు. సీబీఐ విచారణకు పట్టుబట్టారు. ఇరుకున పడ్డ ప్రభుత్వం ఆ కాంట్రాక్టులను ఆమోదించనే లేదని చెప్పింది. అవినీతి జరిగినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తామని సీఎం ప్రకటించారు. కాంట్రాక్టులపై ఏపీ జెన్కో నియమించిన నిపుణుల కమిటీ కూడా టెండర్లు 30 శాతం ఎక్కువని తేల్చింది. కాంట్రాక్టర్లతో కుమ్మక్కయిన ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు. పెంచింది బారెడు... తగ్గించింది మూరెడు! ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వ పెద్దల అండతో బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ (బీవోపీ) కాంట్రాక్టు పనులను దక్కించుకున్నారు. కృష్ణపట్నంలో టాటా సంస్థ రూ.2,736 కోట్లు కోట్ చేస్తే... ఇబ్రహీంపట్నంలో బీజీఆర్ పవర్స్ సంస్థ రూ.2,376 కోట్లు కోట్ చేసింది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ జెన్కో నిర్మించే ప్రాజెక్టులతో పోలిస్తే... కృష్ణపట్నంలో టాటా సంస్థ రూ.1,520 కోట్లు, ఇబ్రహీంపట్నంలో బీజీఆర్ సంస్థ రూ.1,160 కోట్లు ఎక్కువ కోట్ చేశాయి. రెండు చోట్ల కలిపి రూ.2,680 కోట్లు ఎక్కువగా కోట్ చేశాయి. సంప్రదింపుల హైడ్రామా తర్వాత తాజాగా రెండు సంస్థలు కలిపి 156 కోట్లు తగ్గించాయి. అంటే రూ.2,680 కోట్లు పెంచిన కాంట్రాక్టు సంస్థలు సంప్రదింపుల తర్వాత కేవలం రూ.156 కోట్లు తగ్గించాయి. అయినప్పటికీ తెలంగాణ కాంట్రాక్టులతో పోలిస్తే ఇది ఇంకా రూ.2,524 కోట్లు ఎక్కువ. దీన్నిబట్టి ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది. రూ.156 కోట్లు తగ్గించుకోవడం అంటే ఇంత మొత్తమైనా ఎక్కువ కోట్ చేసినట్టేగా? 30 శాతం ఎక్సెస్ ఉన్నట్టు నిపుణులే చెబితే అవినీతి జరిగినట్టు కాదా? ఏమిటీ కాంట్రాక్టులు? కొత్తగా రెండు థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ఏపీ జెన్కో గతేడాదే నిర్ణయించింది. 800 మెగావాట్ల సామర్థ్యంతో కృష్ణపట్నంలో ఒకటి, విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద ఇంతే సామర్థ్యంతో మరొకటి ప్రతిపాదించింది. నిర్మాణ పనులను రెండు కాంట్రాక్టులుగా విభజించి టెండర్ల ప్రక్రియను పూర్తిచేశారు. బాయిలర్, టర్బైన్, జనరేటర్ (బీటీజీ) కాంట్రాక్టును ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ దక్కించుకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో మరో భాగమైన బీవోపీ కాంట్రాక్టులు కృష్ణపట్నంలో టాటాకు, ఇబ్రహీంపట్నంలో బీజీఆర్‌కు దక్కాయి. ఆ కంపెనీతో ముందే కుమ్మక్కు? పేరుకు గ్లోబల్ టెండర్లు పిలిచినా... కేవలం ఆ రెండు ప్రైవేట్ కంపెనీలు అర్హత సాధించేలా ప్రభుత్వం అర్హత నిబంధనలను విధించింది. దేశంలో అన్ని సంస్థలూ ఎన్టీపీసీ నియామావళిని అనుసరిస్తుంటే... జెన్కో మాత్రం ఈ కాంట్రాక్టుల విషయంలో వాటి జోలికే వెళ్లలేదు. ప్రభుత్వం విధించిన అర్హత నిబంధనలన్నీ బీహెచ్ఈఎల్, టాటా, బీజీఆర్‌కు తప్ప మరో సంస్థకు లేకపోవడంతో, పోటీ లేకుండానే కాంట్రాక్టులన్నీ వాటికే దక్కాయి. ప్రభుత్వ పెద్దలు ప్రైవేట్ కంపెనీలతో ముందే కుమ్మక్కు కావడం వల్లే వాటికి కాంట్రాక్టులు దక్కినట్లు ఆరోపణలున్నాయి. సీఎం కనుసన్నల్లోనే జరిగిందా? బీజీఆర్ సంస్థ తప్పుడు అర్హతలను చూపుతోందని ఢిల్లీకి చెందిన మౌలిక్ భారత్ అనే స్వచ్ఛంద సంస్థ సాక్షాత్తూ సీఎం చంద్రబాబు నాయుడికే ఫిర్యాదు చేసింది. టెండర్లు తెరవకముందే ముఖ్యమంత్రికి లేఖ రాసింది. ఏపీ జెన్కో ప్రాజెక్టు టెండర్ల ఖరారులో అవకతవకలు జరుగుతున్నాయని ఆయన దృష్టికి తెచ్చింది. ఈ ఆరోపణలపై ప్రభుత్వం కనీసం విచారణ కూడా జరపకుండానే టెండర్లు కట్టబెట్టడాన్ని బట్టి, ఇదంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరిగి ందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లలో రూ.వేల కోట్ల అవినీతి ‘‘థర్మల్ ప్రాజెక్టుల టెండర్లలో రూ.వేల కోట్ల అవినీతి జరిగింది. పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం తక్కువకు కాంట్రాక్టులు ఇస్తే... ఇక్కడ(ఏపీలో) ప్రైవేట్ సంస్థలకు రూ.వేల కోట్లు దోచిపెడుతున్నారు. ఇది మామూలు దోపిడీ కాదు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలి’’. - గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి -
మళ్లీ తెరపైకి థర్మల్ ప్రాజెక్టు!
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలనే అంశం మరోమారు తెరపైకి వచ్చింది. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో భవిష్యత్‌లో విద్యుత్ కొరతను అధిగమించేందుకు 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు ప్లాంట్లను జిల్లాలో నెలకొల్పాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ జిల్లా శాఖ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులను కలిసి వారిపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ రూపొందించింది. జిల్లాలో థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు అంశంపై గతంలో కూడా కసరత్తు జరిగింది. జిల్లా పరిధిలోని గోదావరి పరీవాహక ప్రాంతం నవీపేట్ మండలం కందకుర్తి వద్ద 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం గతంలో సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు 2009లో జిల్లా నుంచి ప్రతిపాదనలు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ వరకు వెళ్లాయి. ఈ ప్రాజెక్టు సర్వే కోసం రాష్ట్ర సర్కారు బడ్జెట్ అలాట్‌మెంట్‌కు కూడా అంగీకారం తెలిపింది. కానీ అప్పటి జిల్లా ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా ఈ అంశం కొన్నేళ్లుగా మరుగున పడినట్లయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. జిల్లా విద్యుత్ అవసరాలు, ప్రస్తుత సరఫరా, కనెక్షన్లు వంటి అంశాలతో కూడిన నివేదికను సిద్ధం చేసిన విద్యుత్ జేఏసీ ఈ మేరకు కార్యాచరణ చేపట్టింది. విద్యుత్ ఉత్పత్తి అనివార్యం జిల్లాలో 1,500 మెగావాట్ల విద్యుత్ లోడ్ ఉంటుంది. ఇందులో ఎక్కువ విద్యుత్ వ్యవసాయ అవసరాలకే వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2.35 లక్షల పంపుసెట్లు ఉన్నాయి. ప్రతినెల జిల్లాలో సుమారు 180 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. ఇందులో ఒక్క వ్యవసాయానికే 110 మిలియన్ యూనిట్లు ఖర్చవుతోంది. కాగా తెలంగాణ ఏర్పడితే సుమారు 40 శాతం విద్యుత్ కొరత వస్తుందనే అంచనా ఉంది. దీన్ని అధిగమించేందుకు తెలంగాణాలోని పది జిల్లాల పరిధిలో కనీసం 4,000 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో 1,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసిన పక్షంలో జిల్లా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుంది. ఏర్పాటుకు అనువైన ప్రదేశం... థర్మల్‌ప్లాంట్ ఏర్పాటుకు జిల్లాలో ఎంతో అనువైన వాతావరణం ఉంది. ఈ ప్లాంట్లు నిర్మాణానికి నవీపేట మండలం కందకుర్తి వద్ద గోదావరి పరీవాహక ప్రాంతం అనువైందని భావిస్తున్నారు. ఇక్కడ నదీ జలాలు అందుబాటులో ఉండటమే కాకుండా, విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును రవాణా చేసేందుకు రైల్వే ట్రాక్ అందుబాటులో ఉంది. సింగరేణి బొగ్గు గనులున్న శ్రీరాంపూర్ (మంచిర్యాల) రామగుండం కోల్‌మైన్లు సుమారు 200 కిలోమీటర్ల దూరం ఉంటాయి. పైగా జిల్లాలో విద్యుత్ డిస్ట్రిబ్యూషన్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు దాదాపు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. డిచ్పల్లి వద్ద 400 కేవీ సబ్‌స్టేషన్ ఉంది. పలుచోట్ల 220 కేవీ, 132కేవీ, 33 కేవీ సబ్స్టేషన్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ. 7,500 కోట్లు ఉంటుందని జేఏసీ అంచనాకొచ్చింది. ఈ కేంద్రం ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఐదు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయని భావిస్తున్నారు. తెలంగాణ మంత్రుల సారథ్య బృందానికి వినతి జిల్లాలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ హైదరాబాద్‌కు వెళ్లి తెలంగాణ మంత్రుల సారథ్య బృందానికి వినతిపత్రం అందజేస్తామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లక్ష్మణ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే సోమవారం జిల్లా మంత్రి పి.సుదర్శన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశామన్నారు.