రూ.2,524 కోట్ల థర్మల్ దోపిడీ! | Thermal robbery of Rs .2,524 crore! | Sakshi
Sakshi News home page

రూ.2,524 కోట్ల థర్మల్ దోపిడీ!

Published Thu, Jul 7 2016 2:24 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

రూ.2,524 కోట్ల థర్మల్ దోపిడీ! - Sakshi

రూ.2,524 కోట్ల థర్మల్ దోపిడీ!

- కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ టెండర్లు ఖరారు
- సర్కారు అండతో ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థల మాయ
- పెంచింది రూ.2,680 కోట్లు... తగ్గించింది రూ.156 కోట్లు
- ప్రభుత్వాధినేతకు రూ.వెయ్యి కోట్ల వాటా?
- అర్ధరాత్రి జెన్‌కో బోర్డు భేటీ.. ఒక్క రోజులోనే ఎల్‌వోఐ
 
 సాక్షి, హైదరాబాద్ :
అవినీతి ఆరోపణలున్నా లెక్కచేయకుండా ప్రభుత్వం కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ ప్రాజెక్టుల కాంట్రాక్టులను అడ్డగోలుగా ఖరారు చేసింది. మంగళవారం రాత్రి జెన్‌కో బోర్డు సమావేశమై టెండర్లను ఆమోదించింది. బుధవారం ఏకంగా లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌వోఐ) కూడా ఇచ్చేసింది.  ఒకవైపు విపక్షాలు నిరసన తెలిపినా, ఇంకోవైపు టెండర్లపై న్యాయస్థానంలో కేసులున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రెండు కాంట్రాక్టు పనులను రూ.2,524 కోట్ల ఎక్సెస్‌కు కట్టబెట్టడం గమనార్హం. ప్రతిఫలంగా ప్రభుత్వాధినేతకు దాదాపు రూ.వెయ్యి కోట్లు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ అవినీతి తంతును ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో నిలదీశారు. సీబీఐ విచారణకు పట్టుబట్టారు. ఇరుకున పడ్డ ప్రభుత్వం ఆ కాంట్రాక్టులను ఆమోదించనే లేదని చెప్పింది. అవినీతి జరిగినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తామని సీఎం ప్రకటించారు. కాంట్రాక్టులపై ఏపీ జెన్‌కో నియమించిన నిపుణుల కమిటీ కూడా టెండర్లు 30 శాతం ఎక్కువని తేల్చింది. కాంట్రాక్టర్లతో కుమ్మక్కయిన ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు.

 పెంచింది బారెడు... తగ్గించింది మూరెడు!
 ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వ పెద్దల అండతో బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ (బీవోపీ) కాంట్రాక్టు పనులను దక్కించుకున్నారు. కృష్ణపట్నంలో టాటా సంస్థ రూ.2,736 కోట్లు కోట్ చేస్తే... ఇబ్రహీంపట్నంలో బీజీఆర్ పవర్స్ సంస్థ రూ.2,376 కోట్లు కోట్ చేసింది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ జెన్‌కో నిర్మించే ప్రాజెక్టులతో పోలిస్తే... కృష్ణపట్నంలో టాటా సంస్థ రూ.1,520 కోట్లు, ఇబ్రహీంపట్నంలో బీజీఆర్ సంస్థ రూ.1,160 కోట్లు ఎక్కువ కోట్ చేశాయి. రెండు చోట్ల కలిపి రూ.2,680 కోట్లు ఎక్కువగా కోట్ చేశాయి. సంప్రదింపుల హైడ్రామా తర్వాత తాజాగా రెండు సంస్థలు కలిపి 156 కోట్లు తగ్గించాయి.

అంటే రూ.2,680 కోట్లు పెంచిన కాంట్రాక్టు సంస్థలు సంప్రదింపుల తర్వాత కేవలం రూ.156 కోట్లు తగ్గించాయి. అయినప్పటికీ తెలంగాణ కాంట్రాక్టులతో పోలిస్తే ఇది ఇంకా రూ.2,524 కోట్లు ఎక్కువ. దీన్నిబట్టి ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది. రూ.156 కోట్లు తగ్గించుకోవడం అంటే ఇంత మొత్తమైనా ఎక్కువ కోట్ చేసినట్టేగా? 30 శాతం ఎక్సెస్ ఉన్నట్టు నిపుణులే చెబితే అవినీతి జరిగినట్టు కాదా?

 ఏమిటీ కాంట్రాక్టులు?
 కొత్తగా రెండు థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ఏపీ జెన్‌కో గతేడాదే నిర్ణయించింది. 800 మెగావాట్ల సామర్థ్యంతో కృష్ణపట్నంలో ఒకటి, విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద ఇంతే సామర్థ్యంతో మరొకటి ప్రతిపాదించింది. నిర్మాణ పనులను రెండు కాంట్రాక్టులుగా విభజించి టెండర్ల ప్రక్రియను పూర్తిచేశారు. బాయిలర్, టర్బైన్, జనరేటర్ (బీటీజీ) కాంట్రాక్టును ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్ దక్కించుకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో మరో భాగమైన బీవోపీ కాంట్రాక్టులు కృష్ణపట్నంలో టాటాకు, ఇబ్రహీంపట్నంలో బీజీఆర్‌కు దక్కాయి.

 ఆ కంపెనీతో ముందే కుమ్మక్కు?
 పేరుకు గ్లోబల్ టెండర్లు పిలిచినా... కేవలం ఆ రెండు ప్రైవేట్ కంపెనీలు అర్హత సాధించేలా ప్రభుత్వం అర్హత నిబంధనలను విధించింది. దేశంలో అన్ని సంస్థలూ ఎన్టీపీసీ నియామావళిని అనుసరిస్తుంటే... జెన్‌కో మాత్రం ఈ కాంట్రాక్టుల విషయంలో వాటి జోలికే వెళ్లలేదు. ప్రభుత్వం విధించిన అర్హత నిబంధనలన్నీ బీహెచ్‌ఈఎల్, టాటా, బీజీఆర్‌కు తప్ప మరో సంస్థకు లేకపోవడంతో, పోటీ లేకుండానే కాంట్రాక్టులన్నీ వాటికే దక్కాయి. ప్రభుత్వ పెద్దలు ప్రైవేట్ కంపెనీలతో ముందే కుమ్మక్కు కావడం వల్లే వాటికి కాంట్రాక్టులు దక్కినట్లు ఆరోపణలున్నాయి.
 
 సీఎం కనుసన్నల్లోనే జరిగిందా?
 బీజీఆర్ సంస్థ తప్పుడు అర్హతలను చూపుతోందని ఢిల్లీకి చెందిన మౌలిక్ భారత్ అనే స్వచ్ఛంద సంస్థ సాక్షాత్తూ సీఎం చంద్రబాబు నాయుడికే ఫిర్యాదు చేసింది. టెండర్లు తెరవకముందే ముఖ్యమంత్రికి లేఖ రాసింది. ఏపీ జెన్‌కో ప్రాజెక్టు టెండర్ల ఖరారులో అవకతవకలు జరుగుతున్నాయని ఆయన దృష్టికి తెచ్చింది. ఈ ఆరోపణలపై ప్రభుత్వం కనీసం విచారణ కూడా జరపకుండానే టెండర్లు కట్టబెట్టడాన్ని బట్టి, ఇదంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరిగి ందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 టెండర్లలో రూ.వేల కోట్ల అవినీతి
 ‘‘థర్మల్ ప్రాజెక్టుల టెండర్లలో రూ.వేల కోట్ల అవినీతి జరిగింది. పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం తక్కువకు కాంట్రాక్టులు ఇస్తే... ఇక్కడ(ఏపీలో) ప్రైవేట్ సంస్థలకు రూ.వేల కోట్లు దోచిపెడుతున్నారు. ఇది మామూలు దోపిడీ కాదు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలి’’.
 - గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement