ఇటీవల రెండేళ్ల పాలన పూర్తి చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతి కట్టడిలో, దౌత్య విధానం, రైల్వే విభాగాల్లో బాగా పనిచేసినట్లు ఆన్‌లైన్ సర్వేలో వెల్లడైంది.
ప్రధాని వెబ్‌సైట్ ఆన్‌లైన్ సర్వే
న్యూఢిల్లీ: ఇటీవల రెండేళ్ల పాలన పూర్తి చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతి కట్టడిలో, దౌత్య విధానం, రైల్వే విభాగాల్లో బాగా పనిచేసినట్లు ఆన్‌లైన్ సర్వేలో వెల్లడైంది. అవినీతి నియంత్రణలో సర్కారుకు 82% మంది కితాబునివ్వగా, 2014 ఎన్నికల్లో మోదీ ఇచ్చిన ప్రధాన హామీ అయిన నల్లధనం వెలికితీతకు తక్కువ మార్కులు పడటం గమనార్హం. ప్రధాని మోదీ అధికార వెబ్‌సైట్‌లో ఇటీవల ప్రారంభించిన ‘రేట్ మై గవర్నమెంట్’ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఈ సర్వేలో మంగళవారం సాయంత్రం వరకు 23 వేల మంది పాల్గొన్నారు. ఎక్కువ మంది మాత్రం ప్రభుత్వం రైల్వే శాఖలో చేపట్టిన పథకాలకు బ్రహ్మరథం పట్టారు. రైల్వే, జాతీయ రహదారుల విభాగాలు 5 స్కోర్‌కుగాను సగటున 4.5 స్కోర్ సాధించగా, విదేశాంగ విధానం 4.4, మేకిన్ ఇండియా 4.2, విద్యుత్ శాఖ 4.1 స్కోర్ సాధించాయి. స్వచ్ఛభారత్ 3.8 స్కోర్ సాధించగా, నల్లధనాన్ని దేశానికి రప్పించే కార్యక్రమాలకు కేవలం 3.4 మార్కులొచ్చాయి. అలాగే విద్యా నాణ్యతలోనూ 3.8 మార్కులే వచ్చాయి. ఈ సర్వే జూన్ 5న ముగియాల్సి ఉండగా, 10వ తేదీ వరకు పొడిగించారు.