ప్రభుత్వంలో అడ్డగోలు అవినీతి
- వ్యాపార విస్తరణకు వీలులేని రాష్ర్టం
- పారిశ్రామికవేత్తల అభిప్రాయం
- ఎన్‌సీఏఈఆర్ అధ్యయనంలో వెల్లడి
- సానుకూలతలో 19వ స్థానంలో ఏపీ
సాక్షి, ఏపీ డెస్క్
‘‘అంగరంగ వైభవంగా రాష్ర్టంలో పార్టనర్‌షిప్ సమ్మిట్‌లు, వందల కొద్దీ ఎంవోయులు, లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు...
’’ఇదీ సీఎం చంద్రబాబు చూపించే త్రీడీ సినిమా...
‘‘వ్యాపారానికి అత్యంత సానుకూలమైన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రథమ స్థానం..’’ ఇది రాష్ర్టప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ సతీమణి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ మన రాష్ట్రానికి ఇచ్చిన ర్యాంకు..
కానీ వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది. వ్యాపార కార్యకలాపాల విస్తరణకు తగిన మౌలికసదుపాయాలు గానీ, రాజకీయ వాతావరణం గానీ రాష్ర్టంలో లేవని పారిశ్రామిక వేత్తలు భావిస్తున్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ విషయం బైటపడింది. వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో తమ వ్యాపారాలను విస్తరించరాదని భావిస్తున్నట్లు ఈ అధ్యయనంలో పాల్గొన్న 60శాతం మంది పారిశ్రామికవేత్తలు వెల్లడించారట. వచ్చే 6 నెలల్లో ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని 51శాతం మంది చెప్పారు. 49శాతం మందే పరిస్థితి మెరుగయ్యే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వంలో అవినీతి ప్రధాన సమస్య..
పారిశ్రామిక వేత్తలు ఇంత నిరాశలో ఎందుకున్నారు? సమస్య ఏమిటో ఈ అధ్యయనం బైటపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలను ప్రధానంగా ఇబ్బంది పెడుతున్న అంశం ‘ప్రభుత్వంలో విచ్చలవిడిగా పెరిగిన అవినీతి’ అని బైటపడింది. ప్రభుత్వంతో ఎదురవుతున్న ఇబ్బందులు అన్న కేటగిరీలో ఈ అంశం ప్రధానమైనదిగా సర్వేలో తేలింది. రాష్ర్టప్రభుత్వంలో అవినీతి బలంగా వేళ్లూనుకుపోయిందని 74.3శాతం మంది పారిశ్రామికవేత్తలు చెప్పారు. 17.1శాతం మంది మాత్రం అవినీతి ఓ మోస్తరుగా ఉందని వెల్లడించారు.
ఒక్క పరిశ్రమ కూడా రాలేదు..
వాస్తవానికి ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఉన్నవి కూడా పక్కరాష్ట్రాలకు తరలిపోతున్నాయి. విశాఖలో హెచ్‌ఎస్‌బీసీ వెనక్కుపోయింది. మన్నవరంలో ఎన్టీపీసీ-బీహెచ్‌ఈఎల్ పట్టించుకునే నాథుడు లేక వెనక్కి పోయే పరిస్థితి.ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమలు, స్పిన్నింగ్ మిల్లులు, గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు మూతపడ్డాయి. అసలు కొత్త పరిశ్రమలు పెట్టేందుకు తగిన ప్రోత్సాహకాలు గానీ, పరిస్థితులు గానీ రాష్ర్టంలో లేవని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నిట్టూరుస్తున్నారు. రాష్ర్టంలో గతంలో పరిశ్రమలు పెట్టిన పారిశ్రామిక వేత్తలు కూడా ఇక్కడ పరిశ్రమలు ఎందుకు పెట్టాంరా భగవంతుడా అని వాపోతున్నారు. తమ వ్యాపారాలను విస్తరించేందుకు పూర్తి విముఖంగా ఉన్నారు...
అగ్రస్థానంలో గుజరాత్..
పరిశ్రమలు, ఆర్ధిక సరళిపై ఎన్‌సీఏఈఆర్ సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా ఈ అధ్యయనం జరిపించింది. పెట్టుబడులకు సంబంధించి 21 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో సర్వే జరిపారు. ఐదు ప్రధానాంశాల ఆధారంగా రాష్ట్రాలలో పెట్టుబడుల సామర్థ్య సూచీని లెక్కగట్టారు. అవి కార్మికులు, మౌలికసదుపాయాలు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ సుస్థిరత(పరిపాలనతో సహా), వ్యాపారానికి తగిన వాతావరణం. పెట్టుబడుల సామర్థ్య సూచీ ర్యాంకుల ప్రకారం ఈ ఏడాది మొదటి స్థానా న్ని గుజరాత్ కైవసం చేసుకుంది. ఢిల్లీ, తమిళనాడు తర్వాతి స్థానాలలో నిలిచాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న రాష్ట్రాలలో ఢిల్లీ ప్రధమ స్థానంలో ఉంది. రాజకీయ సుస్థిరత, వ్యాపారానికి సానుకూల వాతావరణం వంటి అంశాలలో కూడా గుజరాత్ అగ్రస్థానంలో ఉంది.
19వస్థానంలో ఏపీ
మొత్తం 21 రాష్ట్రాలలో అధ్యయనం జరపగా ఆంధ్రప్రదేశ్ అన్నీ చివరి స్థానాలలో నిలిచింది. వ్యాపారానికి సానుకూల వాతావరణం విషయంలో రాష్ర్టం 19వ స్థానంలో ఉంది. మౌలిక సదుపాయాల విషయంలో 14వ స్థానంలో ఉండగా, రాజకీయ సుస్థిరత విషయంలో 11వ స్థానంలోనూ కార్మికులకు సంబంధించిన అంశాలలో 9వ స్థానంలోనూ ఉంది. అన్ని అంశాలను కలిపి చూస్తే 4వ స్థానంలో ఉందని ఎన్‌సీఏఈఆర్ అధ్యయనం తెలిపింది.