రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే అవిశ్వాసం
► రాజధాని భూ దందా ఆధారాలను రాష్ర్టపతికి అప్పగిస్తాం
► ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
నరసరావుపేట వెస్ట్: ముఖ్యమంత్రి పనితీరులో వైఫల్యాలు, అవినీతి, ఆశ్రీత పక్షపాతాలను ఎండగట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించామని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాజ ధాని భూములు కొని మంత్రులు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని, వారిచేతిలో 15వేల ఎకరాలు ఉన్నాయని ఆరోపిం చారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంతి చంద్రబాబు అవినీతే అడ్డంకి అన్నారు. రాజధాని భూదందాపై సీబీఐ విచారణకు నిరాకరించినందున తమ వద్ద ఉన్న ఆధారాలను రాష్ట్రపతి, సీబీఐ, నేషనల్ విజిలెన్స్ అథారిటీకి అందజేస్తామని వెల్లడించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోను నెరవేర్చే ఉద్దేశం బడ్జెట్‌లో కన్పించలేదన్నారు.
రైతుల రుణాల కోసం రూ.3,512 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. రుణాలను చెల్లించే స్తోమత లేక 250 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, దీనికి పూర్తి బాధ్యత చంద్రబాబునాయుడిదే అని పేర్కొన్నారు. గృహనిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌తో సహా ఆరు ప్రాజెక్ట్‌లకు అరకొర నిధులు కేటాయించి కేటాయించారన్నారు. గాలేరు-నగరి, సుజల స్రవంతి రెండు ప్రాజెక్ట్‌లకు కలిపి రూ.6 వేల కోట్లు కావాల్సివుండగా కేవలం రూ.3,135 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు.
నిరుపేదలకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిర్మించే 4 లక్షల ఇళ్లకు రూ.6 వేలు కోట్లు కావాల్సివుండగా రూ.1,132 కోట్లు కేటాయించి ఏవిధంగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ఆర్‌డబ్ల్యుఎస్‌కు కేవలం రూ.1,200 కోట్లు కేటాయించారని, రాజధాని నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.850 కోట్లు ఇచ్చిందన్నారు. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి ఊసేలేదని, డ్వాక్రా రుణాలకు కేటాయింపేలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సాయం చేయకపోతే తానేమి చేయలేనని సీఎం చెబుతుండగా, మీ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి తామెందుకు నిధులివ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ టీడీపీ ఎంపీలను ప్రశ్నించారన్నారు.
మంత్రుల భూములను ల్యాండ్ పూలింగ్ నుంచి తప్పించారని, అసైన్డ్ భూములను కారుచౌకగా కొట్టేసి అగ్రిమెంట్లపై ఉంచుకున్నారన్నారని ఆరోపించారు. ఏమీ సంబంధం లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. సమావేశంలో మండల, పట్టణ కన్వీనర్లు కె.శంకరయాదవ్, ఎస్.ఏ.హనీఫ్, ఎమ్మెల్యే అధికార ప్రతినిధి వల్లెపు నాగేశ్వరరావు, నాయకులు షేక్.షాదర్‌బాషా, ఎస్.సుజాతాపాల్ పాల్గొన్నారు.