దోపిడీకి అడ్డొస్తే వేటే!
♦ అవినీతికి అడ్డొచ్చిన అధికారులకు స్థానభ్రంశం
♦ తాజా బాధితుడు సీసీడీఎంసీ చైర్మన్ అజయ్‌జైన్
♦ ‘స్విస్ ఛాలెంజ్’ను సందేహించడమే ఆయన నేరం
♦ అజయ్ స్థానంలో అనుకూల అధికారిణి నియామకం
♦ రూ.లక్షకోట్ల రియల్ దందాకు ‘ముఖ్య’నేత పథకం
♦ మాస్టర్ డెవలపర్‌గా అస్మదీయసంస్థ ఎంపికకు లైన్ క్లియర్!
♦ నేడు రాజధాని మాస్టర్‌ప్లాన్‌ల ఖరారు
సాక్షి, హైదరాబాద్: అవినీతిని ఒక యజ్ఞంలా పద్ధతి ప్రకారం సాగిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు అడ్డువచ్చిన అధికారులపై వేటువేస్తూ ‘ముందుకు’ పోతున్నారు. మాట వినని అధికారులను పక్కనబెడుతున్నారు. తప్పు చేయవద్దనే అధికారుల సలహాలను పెడచెవిన పెడుతున్నారు. ఇరిగేషన్‌లో ఓ ఫైలును ఇద్దరు సీఎస్‌లు వద్దన్నా కేబినెట్ చేత ఆమోదింపజేయడం చూస్తే అవినీతి విషయంలో ఆయనెంత నిక్కచ్చిగా ఉన్నారో అర్ధమౌతుంది. అవినీతి, అక్రమాలకు భిన్నంగా వ్యవహరించినా, సలహాలు ఇవ్వాలని చూసినా ఆ అధికారులు శంకరగిరిమాన్యాలు పట్టాల్సిందే.
తన వియ్యంకుడి బంధువు ప్రైవేటు మెడికల్ కాలేజీల వ్యవహారంలో మాట వినలేదన్న కారణంగా వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్‌వి సుబ్రహ్మణ్యంను యువజనసర్వీసుల శాఖకు మార్చేయగా, సీఆర్‌డీఏ వ్యవహారాలలో అడ్డుతగులుతున్నాడన్న కారణంగా పురపాలన పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిధర్‌ను ఏపీపీఎస్‌సీ సెక్రటరీగా మార్చేశారు. ఇలాంటి ఉదాహరణలెన్నో. తాజాగా మరో ఐఎఎస్ అధికారికి అదే అనుభవం ఎదురైంది. ‘స్విస్ ఛాలెంజ్’ విధానంపై సందేహాలు వ్యక్తం చేసినందుకు గాను రాజధాని నగర అభివృద్ధి, యాజమాన్య సంస్థ (సీసీడీఎంసీ) చైర్మన్ అజయ్ జైన్‌పై వేటు వేశారు. ఆయన స్థానంలో రిటైర్డ్ ఐఎఎస్ లక్ష్మీ పార్థసారథిని చైర్‌పర్సన్‌గా నియమించారు. రాజధాని మాస్టర్ డెవలపర్‌గా అస్మదీయ సంస్థను ఎంపిక చేసేందుకు ఆతృత పడుతున్న చంద్రబాబు నాయుడు తనకు అడ్డువచ్చిన ఏ అధికారినీ వదలడం లేదు.
రూ. లక్ష కోట్లు దోచుకునే వ్యూహం
లక్ష్మీ పార్థసారథి నేతృత్వంలో సింగపూర్‌కు చెందిన అసెండాస్-సెమ్జ్‌కార్ప్-సిన్‌బ్రిడ్జ్ కన్సార్టియంను మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక చేసేందుకు సర్కారు శరవేగంగా పావులు కదుపుతోంది. రాజధాని నిర్మాణం పేరుతో రైతుల భూమే పెట్టుబడిగా ‘రియల్’ దందాకు తెరతీసి రూ.లక్ష కోట్లకుపైగా దోచుకోవడానికి ప్రభుత్వ ‘ముఖ్య’నేత వ్యూహం రచించారు.
సింగపూర్‌కు చెందిన ప్రైవేటు సంస్థలు సుర్బానా, జురాంగ్ ఇంటర్నేషనల్‌లు ఇప్పటికే సీఆర్‌డీఏ(రాజధాని ప్రాంత), కేపిటల్ సిటీ(రాజధాని నగర), కోర్ కేపిటల్(ప్రధాన రాజధాని) మాస్టర్ ప్లాన్‌లను ప్రభుత్వానికి అందించిన విషయం విదితమే. సీఆర్‌డీఏ, కేపిటల్ సిటీ, కోర్ కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్‌లను ఈనెల 22న ప్రభుత్వం ఖరారు చేయనుంది. రాజధాని మాస్టర్ ప్లాన్‌లను అమలు చేసేందుకు మే 2, 2015న సీసీడీఎంసీ పేరుతో ‘స్పెషల్ పర్పస్ వెహికల్’(ప్రత్యేక సంస్థ)ను ఏర్పాటు చేసింది. మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేసి.. ఆ సంస్థ భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం, అభివృద్ధి, భూముల కేటాయింపు నుంచి పన్నుల వసూళ్ల వరకూ అన్ని వ్యవహారాలనూ సీసీడీఎంసీ పర్యవేక్షిస్తుంది. సీసీడీఎంసీలో ఒక్కో షేరు ముఖ విలువ రూ.పది చొప్పున పది లక్షల షేర్లకు రూ.వంద కోట్లను మే 9, 2015న ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టింది.
సింగపూర్ సంస్థల కోసమే ‘స్విస్ ఛాలెంజ్’
రాజధాని మాస్టర్ డెవలపర్‌ను స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఎంపిక చేస్తామని సీఎం చంద్రబాబు మొదటినుంచీ చెబుతున్నారు. సింగపూర్ సంస్థల ప్రతిపాదనల మేరకు ‘స్విస్ ఛాలెంజ్’ విధానంలో టెండర్ నోటిఫికేషన్ రూపొందించాలని సీసీడీఎంసీ చైర్మన్ అజయ్ జైన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ‘స్విస్ ఛాలెంజ్’ విధానంపై అజయ్‌జైన్ అనుమానాలు వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో థానేలో స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో గృహాల నిర్మాణానికి కాంట్రాక్టర్ ఎంపిక కేసులో ‘సుప్రీం కోర్టు’ జారీ చేసిన మార్గదర్శకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆయన స్థానంలో సీసీడీఎంసీ ఎండీ లక్ష్మీ పార్ధసారథిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
విశేషమేమిటంటే సీసీడీఎంసీ చైర్ పర్సన్‌గా తనను నియమించాలంటూ లక్ష్మీ పార్థసారథి చేత లేఖ రాయించిన ప్రభుత్వం దానిపై శుక్రవారం ఆమోదముద్ర వేసింది. రాజధాని మాస్టర్ ప్లాన్‌లను ఈనెల 22న ప్రభుత్వం ఖరారు చేశాక.. వాటి అమలుకు మార్చి మొదటి వారంలో సీసీడీఎంసీకి సింగపూర్ సంస్థల కన్సార్టియం స్వచ్ఛందంగా ప్రతిపాదనలు సమర్పించనున్నాయి. వాటిపై సీసీడీఎంసీ ఆమోదముద్ర వేయడం.. మాస్టర్ డెవలపర్‌గా అసెండాస్-సెమ్బ్‌కార్ప్-సిన్‌బ్రిడ్జ్‌ను ఎంపిక చేయడం ఖాయమని అధికారవర్గాలు వెల్లడించాయి. సింగపూర్ సంస్థల కన్సార్టియం, సీసీడీఎంసీలు ఒకే సంస్థగా ఏర్పడి రాజధాని మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయనున్నాయి. ఆ సంస్థలో సింగపూర్ సంస్థల కన్సార్టియం వాటా 51, సీసీడీఎంసీ వాటా 49 శాతం ఉండే అవకాశం ఉందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.