ముఖ్యమంత్రే అవినీతి సామ్రాట్టు | Chief minister is a Corrupt emperor | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రే అవినీతి సామ్రాట్టు

Published Wed, Jun 15 2016 1:28 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

ముఖ్యమంత్రే అవినీతి సామ్రాట్టు - Sakshi

ముఖ్యమంత్రే అవినీతి సామ్రాట్టు

- అవినీతి, అక్రమాలతో  రూ.1,45,549 కోట్లు కొల్లగొట్టారు
- ఎన్నికల హామీలు గాలికొదిలేశారు  
- ప్రలోభాలతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనేస్తున్నారు
- ముద్రగడ పద్మనాభంపై సర్కారు తీరు అమానుషం
- కాపు సామాజికవర్గాన్ని బీసీ జాబితాలో చేర్చాలి
- సాక్షి టీవీ ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలి
- వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం తీర్మానాలు
 
 సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి రెండేళ్లలో విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడి, రూ.1,45,549 కోట్లు కొల్లగొట్టి, అవినీతి సామ్రాట్టుగా ఎదిగారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని ధ్వజమెత్తింది. కాపులను బీసీల్లో చేరుస్తామన్న హామీని నెరవేర్చాలని ప్రశ్నించినందునే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. ఇతర బీసీ సామాజికవర్గాలకు అన్యాయం జరగకుండా కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసింది.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కొనుగోలు చేయడం, జన్మభూమి కమిటీలతో స్థానిక ప్రజాప్రతిని ధుల అధికారాలను హరించడం వంటి అప్రజాస్వామిక విధానాలపై నిప్పులు చెరిగింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ మంగళవారం విస్తృతస్థాయి సమావేశంలో 10 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ తీర్మానాలను ప్రవేశపెట్టగా సభకు హాజరైన నేతలు, కార్యకర్తలు కరతాళ ధ్వనులతో ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు ఇవీ...

► టీడీపీ ప్రభుత్వం గత రెండేళ్లలో రాష్ట్రాన్ని అవినీతి సామ్రాజ్యంగా మార్చింది. ముఖ్యమంత్రి ఇసుక దందాలు, మట్టి అమ్మకాలు, అక్రమ మద్యం వ్యాపారాలు, బొగ్గు కొనుగోలులో అవినీతి, బినామీ భూ కొనుగోళ్లలో కూరుకుపోయారు. రూ.1,45,549 కోట్ల అక్రమార్జనతో సాక్షాత్తు ముఖ్యమంత్రే అవినీతి సామ్రాట్టుగా ఎదిగారు.
► ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ప్రధాన హామీలు.. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యవంటి వాటిని నెరవేర్చకుండా టీడీపీ సర్కారు ప్రజలను దగా చేస్తోంది.
► వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రలోభాలను గురిచేసి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుండడం దారుణం. టీడీపీ విధానాలు అప్రజాస్వామికం. టీడీపీ ప్రభుత్వం అధికారం, డబ్బు, కాంట్రాక్టులు వంటి ప్రలోభాలను ఎరవేస్తోంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిం చడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం అక్రమం.
► ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధుల అధికారాలకు గండికొడుతూ జన్మభూమి కమిటీల వంటి అప్రజాస్వామిక సమాంతర వ్యవస్థలను ప్రభుత్వం సృష్టించింది. ప్రతిపక్ష శాసనసభ్యులను సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. వారిని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తోంది.
► ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను తలపించేలా సాక్షి పత్రిక, టీవీ చానల్ ప్రసారాలపై ఆంక్షలు విధించి పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న తీరు రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వం తక్షణమే తన చర్యను ఉపసంహరించుకొని, సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలి.
► రాజధాని నిర్మాణ ప్రక్రియలో ప్రభుత్వం యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతోంది. రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూమిని విదేశీ సంస్థలకు తాకట్టు పెట్టింది. భూములను లాక్కోవడం, భవన నిర్మాణాలు, భూ కేటాయింపుల వరకు అన్నింట్లో ఆశ్రీత పక్షపాతంతో వ్యవహరిస్తోంది.
► విభజన ప్రక్రియలో చురుకైన పాత్ర పోషిం చిన టీడీపీ తదనంతరం ఏపీ ప్రయోజనాల సాధనలో విఫలమైంది. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, ఉత్తరాంధ్ర-రాయలసీమకు ప్రత్యేక అభివృద్ధి నిధులు, రైల్వే జోన్ వంటి వాటిని సాధించలేక అసమర్థతను చాటుకుంది.
► రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. కాల్‌మనీ పేరుతో మహిళలను వేధించడం, వారిపై అకృత్యాలు, టీడీపీ అవినీతి-అక్రమ వ్యాపారాలను అడ్డుకుంటున్న అధికారులపై యథేచ్ఛగా దాడులు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై  దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెరిగిపోతున్నాయి.
► ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. పెరిగిపోతున్న వ్యవసాయ పెట్టుబడులు, సాగునీరు లేక ఎండుతున్న పంటలు, సరైన మద్దతు ధర లేకపోవడంతో వ్యవసాయ రంగం నానాటికీ దిగజారుతోంది. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండడం దారుణం.
► ముద్రగడ పద్మనాభంను ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించి, ఆయన ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, వారి కుటుంబ సభ్యులను వేధిస్తున్న తీరును వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండించింది. ముద్రగడ ఆరోగ్యం మెరుగుపడాలని సమావేశం ఆకాంక్షించింది. తుని ఘటన నేపథ్యంలో అమాయకులను అరెస్టు చేస్తూ వేధిస్తున్న ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేసింది. ఆ సంఘటన తదుపరి పరిణామాలపై సీబీఐ విచారణకు ఆదేశించి, వాస్తవాలు వెలికితీయాలని పేర్కొంది. ఇతర బీసీ సామాజికవర్గాలకు అన్యాయం జరగకుండా కాపు సామాజికవర్గాన్ని బీసీ జాబితాలో చేర్చాలని ఈ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement