ఉపాధి కల్పించని ప్రాజెక్టులెందుకు?
-
ఎన్‌సీసీపీపీఎల్ ఎదుట మండపం వాసులు ఆందోళన
-
సమస్యల విషయంపై నేడు చర్చలకు యాజమాన్యం సంసిద్ధత
తోటపల్లిగూడూరు :ఉపాధి అవకాశాలను కల్పిస్తామని కల్లిబొల్లి మాటలు చెప్పిన కంపెనీ యాజమాన్యాలు మాట మార్చి స్థానికులకు అన్యాయం చేస్తే సహించేది లేదని మండపం పంచాయతీ సర్పంచ్ కాల్తిరెడ్డి సుబ్బారావు హెచ్చరించారు. ఉపాధి కల్పనలో జరుగుతున్న అన్యాయంపై మండపం పంచాయతీలోని పలు గ్రామాలకు చెందిన స్థానికులు బుధవారం అనంతపురంలో ఉన్న ఎన్‌సీసీపీపీఎల్ విద్యుత్ ప్రాజెక్ట్ ఎదుట ఆందోళన చేశారు. సర్పంచ్ సుబ్బారావు మాట్లాడుతూ స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పించే విషయంలో ఎన్‌సీసీపీపీఎల్ విద్యుత్ ప్రాజెక్ట్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఉపాధి అవకాశాలను కల్పిస్తామని స్థానికుల భూముల్లో కంపెనీ ఏర్పాటు చేసి, ఇప్పుడు మాటమార్చి వారి పొట్టకొట్టే ఆలోచన చేస్తుండటం సమంజసం కాదన్నారు. ఎన్‌సీసీ నిర్మాణ సమయంలో గ్రీన్‌బెల్ట్ కింద, కంపెనీ కార్యనిర్వాహక కార్యాలయాల్లో స్థానిక గ్రామాలకు చెందిన సుమారు 180 మంది మహిళలకు రోజువారి కూలితో ఉపా«ధి కల్పించారన్నారు. అయితే లేనిపోని కొర్రీలుపెడుతూ ఇటీవల కాలంలో 100 మంది మహిళా కార్మికులను తొలగించారన్నారు. విడతల వారీగా ఒక్కొక్కరిని తొలగించేందుకు కంపెనీ యాజమాన్యం చర్యలు తీసుకుందన్నారు. తక్కువ వేతనంతో పని చేస్తున్నప్పటికీ స్థానికులను పని నుంచి తొలగించడంలో కంపెనీ యాజమాన్యం ఆంతర్యమేంటని సర్పంచ్ సుబ్బారావు ప్రశ్నించారు. కంపెనీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న స్థానికులైన వాహనాలను సైతం పక్కన పెట్టి స్థానికుల పొట్ట కొట్టిందన్నారు. ఈ రకంగా స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్న కంపెనీపై పోరాడుతామన్నారు.
సమస్యలపై చర్చలకు యాజమాన్యం సంసిద్ధం
స్థానికుల ఆందోళన నేపథ్యంలో సమస్యలపై చర్చించేందుకు కంపెనీ యాజమాన్యం ముందుకు వచ్చింది. స్థానికులు బుధవారం కంపెనీ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతతకు దారి తీస్తుండటంతో బందోబస్తుకు వచ్చిన కృష్ణపట్నం పోర్ట్ ఎస్‌ఐ విశ్వనాథరెడ్డి ఆందోళనకారులతో మాట్లాడి వారిని శాంతిప జేశారు. ఎస్‌ఐ ఆందోళనకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులతో చర్చించేందుకు ఆయన కంపెనీ యాజమాన్యాన్ని ఒప్పించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చలు జరిగేలా అంగీకరింప చేశారు. గురువారం జరిగే ఈ చర్చల ద్వారా తమ న్యాయం జరగకపోతే కంపెనీ ఎదుట ఆమరణ దీక్షలకు దిగతామని సర్పంచ్ సుబ్బారావు హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎండికళ్ల దయాకర్, ఉప సర్పంచ్ వాంకిల ప్రవీణ్, వెంకటేశ్వర్లు, సుధీర్, హరి, గోపి, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.