సాక్షి, రాజమండ్రి : గోదావరి పుష్కరాలను సాకుగా తీసుకొని నిత్యావసర వస్తువుల ధరలు పెంచి అమ్మితే సహించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాపారులను హెచ్చరించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాల రద్దీతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభిస్తున్న దృష్ట్యా పుష్కరాలు ముగిసే వరకూ టోల్‌గేట్ల వద్ద రుసుం వసూలు నిలిపివేయనున్నట్టు చెప్పారు. ఘాట్‌ల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలు తప్పవన్నారు. భక్తులను తీసుకెళ్లే వాహనాల డ్రైవర్లు స్వీయ నియంత్రణలో ఉండాలని, పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కోరారు. భక్తులు కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పుణ్య స్నానం కన్నా ముందు ఆరోగ్య రక్షణపై జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. రాజమండ్రి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో శనివారం రాత్రి సీఎం మీడియాతో మాట్లాడారు.
శనివారం ఉభయ గోదావరి జిల్లాల్లోని ఘాట్‌లన్నీ కలిపి సుమారు 60 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారని చెప్పారు. భక్తుల తరలింపులో వాహనాల డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని, వేరేవారి ప్రజలు తీసేహక్కు లేదని స్పష్టం చేశారు. ఆదివారం మరింతగా భక్తుల తాకిడి ఉండే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పుష్కరాల కోసం వస్తుండగా, లేదా వచ్చివెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందిన వారికి రూ.3 లక్షలు పరిహారం అందిస్తామని సీఎం ప్రకటించారు.బయట ప్రాంతాల నుంచి వస్తూ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌లో చిక్కుకున్న భక్తుల సౌకర్యార్థం విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లతో పాటు పుష్కర్‌నగర్‌ల్లో ఆదివారం భక్తులకు అందజేసేందుకు 12 లక్షల భోజనం పొట్లాలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రైళ్లు ఆలస్యమై రిజర్వేషన్ రద్దు చేసుకున్న భక్తులకు బస్సులు ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ధరలు పెంచి అమ్మొద్దు
Published Sun, Jul 19 2015 1:26 AM | Last Updated on Mon, Aug 13 2018 3:58 PM
Advertisement