తిమ్మాపూర్, న్యూస్‌లైన్: ఉజాలా పౌడర్ సేల్స్‌మెన్లుగా ఇంట్లోకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు బంగారాన్ని మెరుగుపెడతామని నమ్మబలికి ఓ మహిళ నుంచి మూడున్నర తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లిన సంఘటన గురువారం తిమ్మాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జోగయ్యపల్లెలో రామిడి హేమలత ఇంట్లో బట్టలు కుడుతోంది. సుమారు 40 సంవత్సరాలున్న ఇద్దరు వ్యక్తులు ఉజాలా పౌడర్ సేల్స్‌మెన్లుగా చెప్పుకొని రెండు బ్యాగులతో ఆమె ఇంట్లోకి వచ్చారు. పౌడర్ బాగా పని చేస్తుందని, వంట సామగ్రికి ఉపయోగించవచ్చని చెప్పారు. హేమలత కూతురు కాళ్లకు ఉన్న పట్టగొలుసులు కడిగిస్తామని చెప్పి పని చేసి చూపించారు. ఆ తర్వాత హేమలత మెడలో ఉన్న బంగారు గొలుసును కడిగి ఇస్తామన్నారు. ఆమె తన మెడలో ఉన్న రెండున్నర తులాల పుస్తెలతాడు, తులం గొలుసును వారి చేతిలో పెట్టింది. వాటిని కడిగేందుకు కుక్కర్ కావాలని, అందులో నీళ్లు పోసి ఇవ్వాలన్నారు.
నీటిని వేడి చేయాలని ఇంట్లో ఉన్న స్టౌవ్ వద్దకు వెళ్లారు. ఇంకా ఏమైనా బంగారం ఉంటే తేవాలనగానే ఆమె బీరువా వద్దకు వెళ్లింది. అనంతరం ఇంటికి బట్టలు ఉతికేందుకు మహిళ రాగా ఇద్దరిలో ఓ వ్యక్తి వచ్చి ఆమెను మాటల్లో దింపాడు. ఇంట్లో ఉన్న హేమలత బంగారం తీసుకురాకుండా బయటకు రాగా, గొలుసులను వేడి నీటిలో వేశానని, పది నిమిషాల తర్వాత చూసి తీసుకోవాలని జారుకున్నారు. కొద్దిసేపటికి ఆమె కుక్కర్లో చూసుకోగా గొలుసులు లేకపోవడంతో లబోదిబోమంది. హేమలత అత్త అహల్య పోలీసులకు సమాచారమందించింది. ఎల్‌ఎండీ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు.
పెద్దూరులో..
సిరిసిల్ల రూరల్: మెరుగుపెడతానని నమ్మించి మూడు తులాల బంగారు పుస్తెల తాడును ఎత్తుకెళ్లిన సంఘటన మండలంలోని పెద్దూరులో జరిగింది. ఆ గ్రామ సర్పంచ్ ఆదిపల్లి లక్ష్మిదేవయ్య కూతరు తాళ్లపల్లి జ్యోత్స్న(25) దొంగల మాయమాటలను నమ్మి తన మూడు తులాల బంగారు పుస్తెలతాడును పోగొట్టుకుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చి బంగారు, వెండి నగలకు మెరుగుపెడతామని చెప్పగానే జ్యోత్స్న నమ్మింది. వెండి పట్టగొలుసులు, ఇతర వెండి ఆభరణాలు తెచ్చి ఇవ్వగానే వాటిని ఓ వ్యక్తి కెమికల్‌తో మెరుగుపెట్టి ఇచ్చాడు.
మరో వ్యక్తి ఇంటి ఎదుట ద్విచక్రవాహనంపై ఉన్నాడు. బంగారు పుస్తెలతాడును కూడా మెరుగుపెడతాననగానే జ్యోత్స్న తన మెడలో ఉన్న పుస్తెల తాడును తీసి ఇచ్చింది. ఆ వ్యక్తి ఓ పాత్రలో నీళ్లు పోసి అందులో బంగారు గొలుసు వేసి కెమికల్ వేశాడు. నీళ్లలో నురుగు రావడంతో లోపల ఉన్న పుస్తెలతాడు కనిపించలేదు. ఐదు నిమిషాలపాటు స్టౌవ్‌పై పెట్టి వేడి చేసి తీయాలని అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ వ్యక్తి చెప్పినట్లే చేసి, పాత్రలో పుస్తెలతాడును తీసేందుకు చూడగా అందులో లేదు. దీంతో లబోదిబోమంటూ వచ్చి విషయాన్ని తండ్రికి చెప్పగా, ఆయన పోలీసులకు సమాచారమందించారు. పట్టణ సీఐ నాగేంద్రచారి వచ్చి వివరాలు తెలుసుకున్నారు.