ఇసుక దొంగలకు అధికార పార్టీ అండ
సాక్షి, ఏలూరు : ఇసుక దొంగలు జిల్లాలో రెచ్చిపోతున్నా వారిని అడ్డుకోలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) దుయ్యబట్టారు. ఆ దొంగలకు అధికార పార్టీ అండదండటుండటమే ఇసుక అక్రమ రవాణాకు కారణమని ఆరోపించారు. జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలపై ఆదివారం ఆయ న స్పందించారు. టీడీపీ నేతలే ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తూ సొ మ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. సామాన్యులకు అందుబాటులోలేని విధంగా ఇసుకకు డిమాండ్ సృష్టించి లారీ ఇసుకను రూ.30 వేలకు పైగా విక్రయిస్తున్నారని అన్నారు. దీనివల్ల భవనాలు, ఇళ్లు నిర్మాణాలు నిలిచిపోయి భవన నిర్మాణ కార్మికులకు పని దొరకని పరిస్థితి తలెత్తిందన్నారు.
మాఫియా చేతుల్లో ఇసుక ఉండటం వల్ల సామాన్యులకు ఇసుక అందడం లేదన్నారు. ప్రజాప్రతినిధుల వత్తిళ్లకు అధికారులు తలొగ్గి ఇసుక దొంగల్ని ఏమీ చేయలేకపోతున్నారని, ఇకనైనా జిల్లా అధికారులు ప్రజల పక్షాన పనిచేయాలని సూచించారు. అలా చేయకపోతే ప్రజల్లో చులకనైపోతారని హెచ్చరించారు. డ్వాక్రా గ్రూఫులకు ఇసుక రీచ్‌లను కేటాయించటంలోనూ అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందన్నారు. పెద్ద రీచ్‌లను టీడీపీ పెద్దల చేతుల్లోనే ఉంచి ఆదాయంరాని చిన్న రీచ్‌లను మహిళలకు కేటాయిస్తున్నారని చెప్పారు. వేలం లేకుండానే రీచ్‌లు కేటాయించడం అధికార పార్టీ కుట్రలో భాగమన్నారు. అన్ని రీచ్‌లకు ఒకే నిబంధనలు ఉండాల్సింది పోయి కొన్నిటికే నిబంధనలు వర్తింపజేయడమేమిటని ప్రశ్నించారు. ఇసుక దొంగలపై కఠిన చర్యలు తీసుకుని అక్రమ రవాణాను అరికట్టకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ పని చేయాల్సి వస్తుందని జిల్లా అధికారులకు నాని స్పష్టం చేశారు.