పెద్ద సాహసం ఈ ‘పేద..’ ఆశయం | This is a big adventure 'poor ..' ambition | Sakshi
Sakshi News home page

పెద్ద సాహసం ఈ ‘పేద..’ ఆశయం

Published Thu, Jan 16 2014 5:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

This is a big adventure 'poor ..' ambition

అలంపూర్, న్యూస్‌లైన్ : ఒక వ్యక్తి ఉన్నత స్థాయిలోకి రావాలని ఎవరెస్టు అంత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించడం సహజం. కానీ ఆ శిఖరాన్ని అధిరోహించడానికే  ఎంపికయ్యాడు అలంపూర్ మండలంలోని ప్రాగటూరుకు  చెందిన ఇంటర్ విద్యార్థి నాగరాజు. కృషి, పట్టుదల ఉంటే ఎంతటి సాహసమైనా చేసి ఉన్నత స్థానాన్ని దక్కించుకోవచ్చనే రుజువు చేశాడు . పర్వతారోహణలో మెళకువలు ఔపోసన పట్టి  ఏకంగా ఎవరెస్టు శిఖరం ఎక్కడానికి స్థానం సంపాందించాడు.
 
 నాన్న లేకున్నా...అమ్మే ఆసరాగా..
 రామదాసు, దేవమ్మలకు నేతాజి, పుష్పావతి, నాగరాజు, జ్యోతి నలుగురు సంతానం. వీరిలో నాగరాజు మూడో కుమారుడు. రామదాసు 13 ఏళ్ల క్రితం వలస కూలీగా పని చేస్తూ మృత్యువాతపడ్డాడు. దీంతో కుటుంబాన్ని దేవమ్మ తన కష్టార్జితంతో పోషిస్తోంది. వీరిలో ఇద్దరు కుమారులు చదవులతోపాటుగా వివిధ రంగాల్లో రాణించి తల్లిదండ్రులతోపాటు గ్రామానికి వన్నె తెచ్చారు. నాగరాజు  ఎవరెస్టు అధిరోహణకు  ఎంపిక కాగా... పెద్ద కుమారుడు నేతాజీ రాష్ట్రం తరపున హ్యాండ్ బాల్ క్రీడాల్లో పాల్గొని ప్రతిభ కనబర్చాడు.
 
 మట్టిలో మాణిక్యం  ...
 ఆర్థిక స్తోమత లేని నాగరాజు విద్యాభాస్యం ఇతర ప్రాంతాల్లోనే కొనసాగింది. ప్రాథమిక విద్య వనపర్తిలోని కేడీసీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగింది. 6 నుంచి 10వ తరగతి రంగారెడ్డి జిల్లాలోని చిలుగూరి రెసిడెన్షియల్ స్కూలులో సాగించాడు.
 
 ప్రస్తుతం పరిగిలోని ఏపీఎస్‌డబ్ల్యూ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ ఏడాది చదువుతున్నాడు. భువనగిరలో జరిగిన పర్వతారోహణ శిక్షణ ఎంపికకు 299 పాఠశాలల నుంచి విద్యార్థులు రాగా  ఇందులో 20 మంది ఎంపీకకాగా నాగరాజుకూ అవకాశం దక్కింది. 2013 సెప్టంబర్‌లో డార్జిలింగ్ వెళ్లాడు. అక్కడ 20 రోజులపాటు హిమాలయ మౌంటనీరింగ్ ఇన్‌స్ట్యూట్‌లో శిక్షణ పొందాడు. శిక్షణలో భాగంగా ఫస్ట్ క్యాంపులో 3500 అడుగుల ఎత్తును 20 కిలోల బరువుతో ఎక్కాడు. రెండవ, మూడవ క్యాంపుల్లోను ఇదే తరహా శిక్షణ పొందాడు. అనంతరం బేస్ క్యాపులో రినాక్‌లో 14500 అడుగుల గమ్యంలో 1700 అడుగుల గమ్యాన్ని సాధించింది నాగరాజు బృందం. అనంతరం స్నోక్ రాక్, ఐస్ రాక్, రాక్‌లను అవరోహించడం జరిగింది. 2013 డిసెంబరులో ఢిల్లీలో నాగరాజు, ఆనంద్(ఖమ్మం), గంగాధర్, మధుకర్(కరీంనగర్), భారతి(కడప), పూర్ణ, సరిత(నిజామాబాద్), సత్యనారయణ, మోహన్‌ప్రసాద్(వైజాగ్) ప్రత్యేక శిక్షణకు వెళ్లారు.  వీరిలో నాగరాజు ఏప్లస్ గ్రేడ్ సాధించి గుర్తింపు పొందాడు. ఇప్పుడు ఎవరెస్టు శిఖరారోహణకు ఎంపికయ్యాడు.
 
 ఆత్మసైర్యంతో ముందుకు వెళ్లాం....
 
 భువనగిరిలో  శిక్షణ తర్వాత మా  బృందంతో కలిసి డార్జిలింగ్ వెళ్లాం. అక్కడి గుట్టలను చూసి  భయపడ్డాం.  అక్కడ చలి మైనస్ 20 డిగ్రీలు ఉంది. ఆ చలిని తట్టుకోలేపోయాం. ఎముకులను కొరికే చలిలో కనీసం అన్నం తినే పరిస్థితి లేదు. ఎందుకు వచ్చామా దేవుడా అనిపించింది.  మా ప్రవీణ్‌కుమార్ సార్ ఆశయాన్ని నేరవేర్చాలనే పట్టుదలతో అత్మసైర్త్యంతో ముందుకు వెళ్లాం. శిక్షణలో స్నోక్ రాక్..ఐస్ రాక్..రాక్‌లను దాటి ముందుకు వెళ్లాం. 10వ రోజు రినాక్‌పీక్  ఎక్కేందుకు వెళ్లాం. దాన్ని అధిరోహించి జెండాను పాతి వచ్చాం. గౌల్‌దొడ్డిలో 20 రోజుల పాటు  శిక్షణ పొందాం. అక్కడ 11 మంది బృందంలో ఇద్దరు ఆనారోగ్య కారణాలతో తప్పుకున్నారు.
 
 తర్వాత శిక్షణ నిమిత్తం కాచిగుడా నుంచి ఢిల్లీ వెళ్లాం. అక్కడి నుంచి లాద్దాక్ వెళ్లాం. ఇంతటి అవకాశం కల్పించిన కళాశాల ప్రిన్సిపల్ సాయినాథ, పీడీ ఉదయ్ భాస్కర్, వైస్ ప్రిన్సిపల్ రఫీయుద్దీన్, క్లాస్ టీచర్, ఉపాధ్యాయ బృందానికి రుణపడి ఉంటాను. లాద్దాక్‌లో 20 రోజుల శిక్షణ పొందాం. అక్కడ ముందుగా చైనాసరిహద్దుకు  చేరుకొని అక్కడ స్వచ్ఛమైన నీటి సరస్సును చూశాం.  అక్కడ పని చేస్తున్న మన సైనికులతో అరగంటపాటు మాట్లాడి ఇక్కడి వాతవరణ పరిస్థితులు,  తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకొని ముందుకు వెళ్లాం. ఇలా అనేక అంశాలు నేర్చుకున్న తర్వాత ఈ  అపూర్వ అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టం.
 - నాగరాజు
 
 విజయం సాధించాలి :
 ఎవరెస్టు అంటే నాకు తెలియదు. కానీ అందరు నా కొడుకు గురించి గొప్పగా చెబుతుంటే మాత్రం అనందంగా ఉంది. అందులో విజయం సాధించాలని కోరుకుంటున్నా. 13 ఏళ్ల క్రితం భర్త చనిపోతే కష్టమైన ఆ పని ఈ పని చేసుకుంటు పిల్లలను చదివించాను. వాళ్లు సైతం నా కష్టాన్ని చూసి బాగా చదువుతున్నారు. చదువుతోపాటు ఇలాంటి గొప్ప అవకాశాన్ని దక్కించుకోవడంతో నా కష్టానికి ఫలితం దక్కిందనిపిస్తుంది. ఎవరెస్టు ఎక్కి విజయం సాధించిన నా బిడ్డను గొప్పగా చూడాలని ఉంది.                                     
 - దేవమ్మ, నాగరాజు తల్లి
 
 అలంపూర్, న్యూస్‌లైన్ : ప్రపంచంలోనే అతి ఎత్తై శిఖ రాన్ని అధిరోహించడానికి ఎంపికైన ఇంటర్ విద్యార్థి నా గరాజు శిఖరమంత ఎత్తుకు ఎదగాలని గ్రామస్తులు అకాంక్షించారు.తమ గ్రామానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిన అతన్ని అభినందిస్తూ గ్రామస్తులు ఘనంగా స న్మానించారు. పర్వతారోహణలో  శిక్షణ పొందుతున్న అతను సోమవారం రాత్రి గ్రామానికి చేరుకున్నాడు.
 
 గ్రా మ రెవెన్యూ కార్యదర్శి భవన ఆవరణలో మంగళవారం అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాధమ్మ, ఉస సర్పంచ్, రైతు సంఘం అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి, దండోర సంఘం నాయకులు రాజు, రాముడు, మహిళా సంఘం సభ్యులు, గ్రామస్తు లు తదితరులు నాగరాజును శాలువ, పూల మాలతో ఘ నంగా సత్కరించారు. గ్రామస్తులు సైతం అతన్ని అభినందించి పుష్పగుచ్చం అందజేశారు.  అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న వ్యక్తులకు గ్రామం తరుపున అన్నీ విధాల అదుకోవడానికి సిద్దంగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా నాగరాజు తల్లి దేవమ్మను కూడా ఘనం గా సన్మానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement