‘మాది వరంగల్ జిల్లానే. స్కూల్ నుంచి పీజీ వరకు అక్కడే చదువుకున్నా. కానీ మేడారం ఎప్పుడూ వెళ్లలేదు. వినడమే తప్ప ఎన్నడూ చూల్లేదు. నేను చిన్నతనంలో ఉండగా బంధువులు, మిత్రులు వెళ్లేవారు. మా కుటుంబం ఎప్పుడూ వెళ్లలేదు. వనదేవతలను దర్శించుకోవటం ఇదే మొదటిసారి. ఈసారి కూడా అనుకోకుండానే అక్కడికి వెళ్లాను. మొక్కులు చెల్లించుకున్నాను..’ అంటూ కలెక్టర్ వీరబ్రహ్మయ్య మేడారం జాతర విశేషాలను వెల్లడించారు. గురువారం ఉదయం ఆయన తన సతీమణి విజయలక్ష్మితో కలిసి సమక్క-సారలమ్మను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించటంతో పాటు సమక్క, సారలమ్మకు భక్తితో మొక్కులు చెల్లించారు. జాతరకు వెళ్లిన కలెక్టర్ తన మనోభావాలను ఫోన్లో ‘సాక్షి’ అడిగి తెలుసుకుంది. అది ఆయన మాటల్లోనే...
‘మేడారం వెళ్లటం ఇదే తొలిసారి. ముందుగా ప్లాన్ చేసుకోలేదు. అనుకోకుండానే వెళ్లాను. జిల్లాకు చెందిన వివిధ విభాగాల అధికారులు మేడారం డ్యూటీలో ఉన్నారు. వీరందరూ తమ సేవలు అందిస్తున్నారా..? కరీంనగర్ జిల్లా నుంచి మేడారం వెళ్లే మార్గంలో భక్తులు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా..? వివిధ విభాగాల అధికారులు అందుబాటులో ఉన్నారా..? రోడ్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు అందించే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి..? అని స్వయంగా పరిశీలించేందుకు కాటారం మీదుగా వెళ్లాను. 12న రాత్రి భూపాలపల్లిలోనే ఉన్నాను. మరుసటి రోజు ఉదయాన్నే మేడారం చేరుకున్నాం. నేను నా శ్రీమతితో కలిసి వెళ్లాను. అదో అద్భుతమైన జాతర. అడవిలో ఆదివాసీల సంప్రదాయాలు ఉట్టిపడ్డాయి.
కనీస వసతి సదుపాయాలేమీ లేని చోట ఎక్కడపడితే అక్కడ జనం. ఎటుచూసినా గుడారాలు వేసుకోవటం కొత్తగా కనిపించింది. గతంలో కలెక్టర్‌గా విజయనగరం జిల్లాలో పైడితల్లమ్మ జాతర, ఆర్‌డీవోగా భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి పండుగలకు లక్షలాదిగా జనం తరలిరావటం కళ్లారా చూశాను. జాతర నిర్వహణకు సారధ్యం వహించాను. అక్కడ వసతి సదుపాయాలన్నీ ఉండటంతో జాతర నిర్వహణ సాఫీగా జరిగిపోయేది. మేడారం అటవీ ప్రాంతం.. ఒక్క ఐటీడీఏ గెస్ట్‌హౌస్, చిన్న గ్రామం... అన్నీ తాత్కాలిక వసతులే. వనదేవతలను దర్శించుకోవటం మొదటిసారి కావటం కొత్త అనుభూతినిచ్చింది. ‘అందరూ బాగుండాలని.. జిల్లా ప్రజలందరూ చల్లంగుండాలని... వర్షాలు కురవాలని... సమ్మక్క-సారలమ్మలను మొక్కుకున్నా..’
ఇదే మొదటి మొక్కు
Published Sat, Feb 15 2014 2:46 AM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM
Advertisement
Advertisement