నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టబట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్ద పెద్ద నేతలు నంద్యాల రోడ్లపై తిరుగుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ఎన్నిక ఏకగ్రీవం చేసి ఉంటే వీరంతా నంద్యాలవైపు తొంగిచూసేవారా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యే సీటును గెలిపించేందుకు జరుగుతున్నవి మాత్రమే కావని... మూడున్నరేళ్ల చంద్రబాబు దుర్మార్గ, అవినీతి, అసమర్థ, అన్యాయ, అధర్మపాలనకు వ్యతిరేకంగా జనం వేస్తున్న ఓటు అని పేర్కొన్నారు. ఈ ఓటు ద్వారా నంద్యాల ప్రజలు ధర్మం, న్యాయం వైపు నిలిచారని రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని పిలుపునిచ్చారు. ‘‘మీరు వేసే ఓటుతో నేను సీఎం కాకపోవచ్చు. కానీ ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మోసాలకు, అన్యాయానికి, అబద్ధాలకు, అధర్మానికి, అవినీతికి వ్యతిరేకంగా మీరు ఓటు వేస్తున్నారు.
ఇవాళ జరిగే ఈ ఉప ఎన్నికలు... రాబోయే కురుక్షేత్ర మహా సంగ్రామానికి నాంది పలకాలని కోరుతున్నా’’ అని జగన్ పిలుపు నిచ్చారు. చంద్రబాబు మాదిరిగా తన దగ్గర డబ్బుల మూటలు, పోలీసు బలగం, ముఖ్యమంత్రి పదవి, బాకా చానళ్లు, పత్రికలు లేవని.... దివంగత ముఖ్యమంత్రి, నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి మీద మీకున్న అభిమానం. నాన్న సంక్షేమపథకాలు ఇంకా మీ గుండెల్లో బతికే ఉండడమే తనకున్న ఆస్తి అని పేర్కొన్నారు. ‘‘జగన్ అబద్ధం ఆడడు. జగన్ మోసం చేయడు... జగన్ మాట ఇస్తే తప్పడు. జగన్ ఏదైనా చెబితే చేస్తాడు అన్న విశ్వసనీయ రాజకీయాలే నాకు ఉన్న బలం’’ అని ఆయన వివరించారు. అహంకారంతో చంద్రబాబుకు కళ్లు నెత్తికి ఎక్కాయి. డబ్బుతో ఎమ్మెల్యేల మాదిరిగా ప్రజలనూ కొనవచ్చునని అనుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు మొట్టికాయలు వేసి... అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు శిల్పా మోహన్ రెడ్డి మీద చూపించి ఫ్యాను గుర్తుకు ఓటెయ్యాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
నేను ఈ రోజు ఒక్క హామీ ఇస్తున్నా. సంవత్సరం, సంవత్సరన్నరలో కురుక్షేత్ర సంగ్రామం రాబోతోంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మోసాలకు, అన్యాయానికి, అబద్దాలకు, అధర్మానికి, అవినీతికి వ్యతిరేకంగా మీరు ఓటు వేస్తున్నారు. ఇవాళ జరిగే నంద్యాల ఉప ఎన్నికలు... రాబోయే కురుక్షేత్ర సంగ్రామానికి నాంది పలకాలని కోరుతున్నా. న్యాయం, ధర్మం వైపు నిలబడాలని కోరుతున్నా. నంద్యాల ప్రజలు ధర్మం, న్యాయం వైపు నిలబడ్డారని రాష్ట్ర ప్రజలకు తెలపండి. మీరు వేసే ఓటు కేవలం ఒక ఎమ్మెల్యేను ఎన్నుకోవడానికి మాత్రమేకాదు... ఇటువంటి మోసగాళ్లను మేం క్షమించం. ఇటువంటి అవినీతిపరులు మాకొద్దు అని ఓటు వేస్తున్నాం అని తెలియజేయడానికి.. చంద్రబాబు మాదిరిగా నా దగ్గర డబ్బుల్లేవు.
నా దగ్గర ముఖ్యమంత్రి పదవి లేదు. పోలీసుల బలం నా దగ్గర లేదు. లేనిది ఉన్నట్టుగా...ఉన్నది లేనట్టుగా చూపించే టీవీ చానళ్లు నా దగ్గర లేవు. అలా రాసే పేపర్లు నా దగ్గర లేవు. చంద్రబాబు మాదిరిగా నా దగ్గర దుర్బుద్ధ్ది లేదు. అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోయే మనస్తత్వం అంతకన్నా లేదు. నాకున్న ఆస్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి....నాన్నగారి మీద మీకున్న అభిమానం. నా కున్న ఆస్తి నాన్నగారు చేసిన ఆ సంక్షేమపథకాలు ఇంకా మీ గుండెల్లో బతికే ఉండటం. జగన్ అబద్ధ్దం ఆడడు. జగన్ మోసం చేయడు. జగన్ మాట ఇస్తే తప్పడు. జగన్ ఏదైనా చెబితే చేస్తాడు అన్న విశ్వసనీయత నాకున్న ఆస్తి. విలువలతోకూడిన రాజకీయాలు చేయడం నాకున్న ఆస్తి. నవరత్నాలతో జగన్ కూడా ప్రతీ పేదవాడి ఇంట్లో వాళ్ల నాన్న మాదిరిగానే వెలుగులు నింపుతాడు అన్న నమ్మకం నాకు న్న ఆస్తి. నాకున్న ఆస్తి దేవుడి దయ. మీ అంద రి ఆశీస్సులు. నంద్యాలకు అన్నిరకాలుగా తోడుగా ఉంటా. నా గుండెల్లో పెట్టుకుంటా.