సీఎం ఆరోపణలు హాస్యాస్పదం: శిల్పా ఫ్యామిలీ
నంద్యాల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలను వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కుటుంబం తీవ్రంగా ఖండిచింది. ఓడిపోతామనే భయంతోనే దిగజారుడు రాజకీయం చేస్తున్నారని, తాము ఏ విచారణకైనా తమ కుటుంబం సిద్ధమని శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి, కోడలు నాగిని రెడ్డి, కుమార్తె శిల్పా తెలిపారు. నంద్యాలలో సోమవారం ఉదయం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ...‘ మా కుటుంబంపై ముఖ్యమంత్రి ఆరోపణలు హాస్యాస్పదం. గతంలో శిల్పా సేవా సమితిని చంద్రబాబు, లోకేశ్ ఇద్దరు పొడిగారు. 2014 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు అర్థరాత్రి రెండు గంటల సమయంలో నాన్నను పిలిపించుకుని మాట్లాడారు.
సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయనను పార్టీలో చేరాలని చంద్రబాబే స్వయంగా ఆహ్వానించారు. గతంలో లోకేశ్ నంద్యాలలో పర్యటించినప్పుడు కూడా శిల్పా సహకార బ్యాంకు పనితీరును మెచ్చుకున్నారు. శిల్పా సేవా సమితి ద్వారానే మా నాన్నకు మంచి పేరు ఉంది. గతంలో నాన్న చేసిన మంచి పనులు ఇప్పుడు చెడుగా కనిపిస్తున్నాయా?. నాన్న ఇప్పటివరకూ ఏ ఒక్క కాంట్రాక్టర్‌ను బెదిరించలేదు. బెదిరించిన ఘటనలు మా కుటుంబ చరిత్రలోనే లేనే లేదు. మహిళల పట్ల నాన్నకు అపారం గౌరవం ఉంది. కూతురి పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు. వాగ్దానాలన్నీ శిలా ఫలకాలకే పరిమితం అయ్యాయి. నంద్యాలను అభివృద్ధి చేస్తామని సీఎం అనడం విచారకరం’ అన్నారు.
మా బ్యాంక్ గురించి మాట్లాడటం ఆశ్చర్యం...
శిల్పా సహకార బ్యాంక్ ద్వారా వేలమంది మహిళలకు రుణాలు ఇచ్చామని శిల్పా చక్రపాణిరెడ్డి కోడలు నాగినిరెడ్డి తెలిపారు. వడ్డీలేని రుణాలు నుంచి అర్థరూపాయి వడ్డీ వరకూ రుణాలు ఇస్తున్నామన్నారు. ఇప్పటివరకూ ఏ మహిళను రుణం కట్టమని గట్టిగా అడిగింది లేదన్నారు. మహిళలకు మంచి గుర్తింపు ఇవ్వడానికే బ్యాంక్ పెట్టాం. బ్యాంకు గురించి చెడుగా ప్రచారం చేయడం మంచిది కాదు. బ్యాంకు నష్టాల్లో నడుస్తున్నా సంకల్ప బలంతో ముందుకు నడిపించుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. బ్యాంకు ద్వారా మహిళల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. స్వయం ఉపాధితో సొంత కాళ్లపై నిలబడేలా చేస్తున్నామన్నారు.
ఇవన్నీ ఆగిపోవాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశం. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. సీఎం తన స్థాయిని దిగజార్చుకుంటున్నారు. గడిచిన ఆరు నెలల సీసీ పుటేజ్‌ను ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఈ పుటేజ్‌ను పరిశీలించి కావాలంటే ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చు. బ్యాంకును మూసేయాలంటూ రెండు నెలలుగా అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. విచారణ పేరుతో నన్ను, నా స్టాఫ్‌ను ఇబ్బంది పెడుతున్నారు. విచారణ పేరుతో గంటల కొద్దీ వేధిస్తున్నారు. ఏడేళ్లుగా ఎలాంటి మచ్చ లేకుండా బ్యాంకును నడుపుతున్నాం. కేవలం రాజకీయా ప్రయోజనాల కోసం మా కుటుంబంపై బురద జల్లుతున్నారు. సూపర్ మార్కెట్‌లో సరుకులు ఫ్రీగా ఇప్పిస్తున్నామని చెబుతుతున్నారు. దయచేసి ఆధారాలు లేకుండా మాట్లాడవద్దు అని నాగినిరెడ్డి అన్నారు.
జవాబు చెప్పరు కానీ, మాపై నిందలా?
వైఎస్‌ఆర్ సీపీ గుర్తుపై గెలిచిన 21మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా టీడీపీలో ఎలా కొనసాగుతారని శిల్పా మోహన్ రెడ్డి కుమార్తె శిల్పారెడ్డి సూటిగా ప్రశ్నించారు. ‘దీనిపై జవాబు చెప్పరు. మాపై నిందలు మాత్రం వేస్తారు. నాన్నగారు నంద్యాలకు ఉచిత మినరల్ వాటర్ ఇస్తున్నారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. రెండు రోజలు తర్వాత మంత్రులు ఎవరూ ఇక్కడ కనిపించరు. నాన్న అనుభవం ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తికి అవకాశం ఇవ్వండి. నంద్యాల ప్రజల పెన్షన్లు, రేషన్ కార్డులు ఎక్కడికీ పోవు.’ అని తెలిపారు.