- నంద్యాల ప్రజలను, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను బెదిరిస్తున్నారు
- సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
నంద్యాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘చంద్రబాబు హయాంలో నంద్యాలలో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. కొద్ది రోజుల్లో ఉప ఎన్నిక జరుగుతోన్న నేపథ్యంలో అధికార పార్టీ ఓటమి భయంతో దాడులు, బెదిరింపులకు సిద్ధపడింది. పోలీసు బలగాన్ని ఉపయోగించి నంద్యాల ప్రజలు, వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అర్ధరాత్రి దాటాక వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల ఇళ్లపై ఆకస్మిక తనిఖీల పేరిట దాడులు చేసి భయాందోళన సృష్టిస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. సెర్చ్ వారంట్లు లేకుండానే పోలీసులు అర్ధరాత్రి దాటాక ఆకస్మిక తనిఖీలకు వెళ్లాల్సిన అవసరమేమొచ్చిందో స్పష్టం చేయాలి. ఇంట్లో ఏది ఉంటే అది సీజ్ చేయడం దారుణం. అధికార పార్టీ నేతలు మాత్రం ఓటర్లను ప్రలోభ పెడుతూ.. విచ్చలవిడిగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు.
వార్డులు.. గ్రామాల వారీగా రూ. 2 వేలు, 3 వేలు, 5 వేలు చొప్పున డబ్బులు పంచుతున్నారు. వారిపై ఎలాంటి దాడులు ఉండవు. ఎవరూ వారిని పట్టుకోరు. ఎవరు ఎవరిపై వేధింపులకు పాల్పడుతున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా?’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం నంద్యాల టౌన్ హోలులో ఏర్పాటు చేసిన ఆర్య వైశ్యుల ఆత్మీయ సమావేశంలో, ఆ తర్వాత పెద్దబండ సత్రం సెంటర్ రోడ్‌షోలో జగన్ మాట్లాడారు. పదకొండో రోజు రోడ్‌షో సంజీవనగర్ రామాలయం నుంచి ప్రారంభమై.. శాంతినికేతన్ స్కూల్, శేషయ్య చికెన్ సెంటర్, డాక్టర్ శౌరిరెడ్డి హాస్పిటల్, బైటిపేట, పెద్దబండ సత్రం, తల్లిపీరు వీధి, నీలివీధి, రేణుక ఎల్లమ్మ టెంపుల్, మెయిన్ బజార్, పప్పులబట్టి బజార్ మీదుగా తెలుగుపేట వరకు సాగింది. చంద్రబాబు అరాచక పాలనకు ముగింపు పలకాలంటే శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని జగన్ పిలుపునిచ్చారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..
పొట్టి శ్రీరాములును ప్రభుత్వం విస్మరించింది..
రాష్ట్ర విభజనకు ముందు ఏటా నవంబర్ 1న పొట్టి శ్రీరాములు జయంతి ఎంతో ఘనంగా జరిగేది. మూడేళ్ల చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పొట్టి శ్రీరాములు జయంతిని జరుపుకోవడం మానేశారు. ప్రభుత్వం ఆయన్ను పూర్తిగా విస్మరించింది. ఆర్య వైశ్యులంటే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో అభిమానం చూపేవారు. 2009లో రోశయ్యకు ఆరోగ్యం సహకరించక ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేసిన ఘనత రాజశేఖరరెడ్డిదే.
కులాలు, పార్టీలకు అతీతంగా నవరత్నాలు..
అవకాశం వస్తే దివంగత నేత రాజశేఖరరెడ్డిలా ప్రజలకు మంచి పరిపాలన అందించాలన్నదే నా లక్ష్యం. అందులో భాగంగా నవరత్నాల పథకాలను ప్రకటించాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ నవరత్నాలు అందాలి. అప్పుడు ఏ ఇంట్లోనూ అశాంతి అనేది ఉండదు. చిరునవ్వులు ఉంటాయి. కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు అని చూడకుండా ఆ పథకాలు అందరికీ అందించాలన్నదే నా తాపత్రయం. నంద్యాల రోడ్డు విస్తరణ పనులు చంద్రబాబు ఇష్టారాజ్యంగా చేశారు. పనులు చేపట్టే ముందు కనీసం వ్యాపారులను సంప్రదించలేదు. నష్టపరిహార విషయంపై చర్చించలేదు. రాత్రికి రాత్రే పోలీసులను పెట్టి భవనాలు కూలదోయించారు. అక్కడ మార్కెట్ ధర ప్రకారం సెంటు (48 గజాలు) స్థలం రూ.50 లక్షలు పలుకుతోంది. ఆయన మాత్రం ముష్టి వేసినట్లు గజానికి రూ.18 వేలే ఇస్తున్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో దుకాణాలు కోల్పోయి నష్టపోయిన వారికి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెట్ ధర ప్రకారం పరిహారం అందజేస్తాం.
వ్యాపారంలో కష్టనష్టాలు నాకు తెలుసు..
నంద్యాల పట్టణంలో కొందరి ఇళ్లను టార్గెట్ చేసుకుని.. సెర్చ్ వారంట్లు లేకుండా సోదాలు జరిపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? సత్యనారాయణ, రమేష్ లాంటి వాళ్ల ఇళ్లపై పోలీసులు రాత్రి వేళ దాడులు జరపాల్సిన అవసరమేముంది? పోనీ సోదాల్లో చివరికి ఏమైనా దొరికిందా అంటే అదీ లేదు. అమృత్‌రాజ్, నాగిరెడ్డి, జగదీశ్వరరెడ్డి, రామలింగారెడ్డి, లక్ష్మీనారాయణ, బాల హుస్సేన్, భువనేశ్వర్‌ల ఇళ్లపైనా దాడులు చేసి రూ.10 వేలు, రూ.20 వేలు సీజ్ చేశారు. ఈ దాడులకు సంబంధించి వారంట్ ఉండదు. ఒకేసారి 40, 50 మంది పోలీసులు బిలబిల మంటూ ఇళ్లలోకి వచ్చేస్తారు. వాళ్లను చూసి మహిళలు, పిల్లలు భయపడిపోతున్నారు. ప్రియతమ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోక ముందు వరకు నేనూ వ్యాపారాలు చేశాను.
చైర్మన్‌గా సాక్షి పేపర్‌ను నడిపాను. సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాను. వ్యాపారం కష్టనష్టాలు నాకు తెలుసు. నంద్యాలలో వ్యాపారులు పడుతున్న కష్టాలు చూశాను. వారికి వైఎస్సార్‌సీపీ అండదండగా ఉంటుంది. మానవతా దృక్పథంతో మీకు నేను సాయం అందిస్తాను. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వ్యాపారుల ను టార్గెట్ చేశారు. ప్రభుత్వ ఆదాయం పెంచుకో వడానికి కమర్షియల్ టాక్స్ అధికారులకు ఏటా లక్ష్యాలను పెట్టి వ్యాపారులపై దాడులు చేయిస్తు న్నారు. మూడున్నరేళ్లుగా ఈ కార్యక్రమం నిరాటం కంగా సాగుతోంది. వ్యాపారులు బాగా ఇబ్బందు లు పడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.
చంద్రబాబు ఎవరినీ వదల్లేదు..
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం ఎన్నికల ముందు.. ఆ తర్వాత అన్ని విధాలుగా ప్రజలను మోసం చేశారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటలు.. ఎన్నికలయ్యాక వాటిని పక్కన పెట్టి ఏరకంగా ప్రజలను మోసం చేశారన్నది అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు రైతుల వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లను పూర్తిగా మాఫీ చేస్తానన్నారు. నేటికీ ఒక్క రూపాయి మాఫీ చేయలేదు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలంటూ మోసపూరిత వాగ్దానాలతో రైతులను అతి దారుణంగా వంచించారు. వడ్డీనే ఏడాదికి రూ.15 వేల కోట్లు అవుతోంది. చంద్రబాబు మాత్రం రైతుకు ఏడాదికి రూ.3 వేలు మాత్రమే ఇచ్చి అదే రుణమాఫీ అని చెప్పి బొంకుతున్నారు. పొదుపు సంఘాల అక్క,చెల్లెమ్మలనూ మోసం చేశారు.
వారి రుణాలకు సంబంధించి ఒక్క రూపాయి మాఫీ చేయలేదు. విద్యార్థులు, నిరుద్యోగులను కూడా వదిలి పెట్టలేదు. జాబు రాకపోతే నెలనెలా రూ.2 వేల చొప్పున ప్రతి ఇంటికీ నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం.. పక్కా ఇల్లు కట్టిస్తానన్నారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో ఒక్క ఇల్లు కట్టించలేదు. బెల్టు షాపులు లేకుండా చేస్తాన న్నారు. అదీ చేయలేదు. కర్నూలు జిల్లా ప్రజల సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో మూడేళ్ల కిందట ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అందరినీ మోసం చేశారు. ఇలాంటి చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సమయం ఆసన్నమైంది. నంద్యాల ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయాలి. ధర్మం, న్యాయం వైపు నిలిచి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలి’’ అని జగన్ పిలుపునిచ్చారు.