♦ ప్రజలను మోసం చేసిన నిన్ను వదిలిపెట్టం
♦ ఈ నేరాలకు, మోసాలకు ఏ శిక్ష విధించినా తక్కువే అంటాం..
♦ ఇలాంటి వ్యక్తికి ఉరిశిక్ష వేసినా తప్పులేదంటాం..
♦ అధికారంలోకి రాగానే గుండ్రేవుల నిర్మిస్తాం
♦ నంద్యాల రోడ్ షోలో ప్రతిపక్షనేత
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికారంలోకి రావడం కోసం ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి... అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్న చంద్రబాబును కచ్చితంగా ప్రశ్నిస్తామని, నిలదీస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో మైకు పట్టుకుని ఇచ్చిన హామీలను కూడా అమలు చేయని చంద్రబాబును నిలదీస్తూనే ఉంటామని....ఇలాంటి వ్యక్తికి ఎటువంటి శిక్ష వేయాలని జగన్ ప్రశ్నించారు. ‘అయ్యా చంద్రబాబు తప్పుచేశావు.... నిన్ను ప్రశ్నిస్తాం.... తప్పుచేసిన నిన్ను నిలదీస్తాం’ అని పేర్కొన్నారు. నీ నేరాలకు, నీ మోసాలకు ఏ శిక్ష విధించినా తక్కువే అని చెబుతూ ఉంటామన్నారు. అన్యాయాలు, మోసాలు చేసే వ్యక్తికి ఉరిశిక్ష వేసినా తప్పులేదు అని గట్టిగా అంటూనే ఉంటామని తేల్చిచెప్పారు.
కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించి నీరు అందించేందుకు అధికారంలోకి రాగానే గుండ్రేవుల ప్రాజెక్టును చేపడతామని ఆయన హామీనిచ్చారు. నంద్యాలను గుండెల్లో పెట్టుకుంటానని మాట ఇచ్చారు. శిల్పామోహన్‌రెడ్డికి వేసే ఈ ఓటుతో చంద్రబాబు గూబ గుయ్ మనాలని పిలుపునిచ్చారు. మీరు వేసే ఓటు జగన్‌కు అని గుర్తుపెట్టుకోవాలని కోరారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు జగన్ రోడ్ షో నూనెపల్లె నుంచి ప్రారంభమై చాబోలు, సాంబవరం, దీబగుంట్ల, నెహ్రూనగర్, జిల్లెల్ల, కానాలపల్లె మీదుగా అయ్యలూరు వరకూ సాగింది. ఈ సందర్భంగా పలుచోట్ల మాట్లాడుతూ జగన్ ఏమన్నారంటే..
గుండ్రేవుల నిర్మిస్తాం...
‘‘గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మిస్తానని ముఖ్యమంత్రి హోదాలో 2014 ఆగస్టు 15న స్వాతంత్య్రదినోత్సవ సాక్షిగా కర్నూలులో చంద్రబాబు హామీనిచ్చారు. ఈ మూడున్నరేళ్లలో కనీసం అటువైపు చూడలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో కేసీకెనాల్‌కు రెండుకార్ల పంటలకు నీరు వచ్చేది. ఇప్పుడు ఒక్కకారు పంటకైనా నీరు వచ్చే పరిస్థితి ఉందా? చంద్రబాబు గుండ్రేవుల ప్రాజెక్టు కట్టే పరిస్థితి లేదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘గుండ్రేవుల’ నిర్మిస్తాం. కేసీ కెనాల్‌కు మళ్లీ రెండు కార్లపంటలకు నీరు ఇస్తాం.
అందరినీ మోసం చేశారు..
రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులు అందరినీ చంద్రబాబు మోసం చేశారు. ఇంతకు ముందు రైతులకు వడ్డీలేని రుణాలు వచ్చేవి. ఇప్పుడు ఆ వడ్డీ డబ్బులను చంద్రబాబు ఒక చేత్తో లాక్కొని...దానికే రుణమాఫీ అని పేరు పెట్టి మోసం చేస్తున్నారు. ఇప్పుడు రుణాలు మాఫీ కాక వడ్డీ భారం పెరిగి రైతులు బ్యాంకుల గడప తొక్కే పరిస్థితి లేకుండా పోయింది. డ్వాక్రా మహిళలకు పావలావడ్డీ రుణాలు వచ్చేవి. ఇప్పుడు ఆ పావలా వడ్డీ సబ్సిడీ ఇవ్వకుండా పసుపు–కుంకుమ పేరుతో మోసం చేస్తున్నారు. ఇది అక్కాచెల్లెమ్మల కంట్లో ఉప్పూ–కారం కాదా? చదువుకుంటున్న పిల్లలకు ఉద్యోగం ఇస్తానని...ఇవ్వకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఇప్పటికి చంద్రబాబు అధికారంలోకి వచ్చి 38 నెలలు అయ్యింది.. నాకు చంద్రబాబు రూ.76 వేలు బాకీ ఉన్నారని....కాలర్ పట్టుకుని అడుగుతానని యువభేరీ సభలో ఒక పిల్లాడు నాతో అన్నాడు.
ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికి...కేసుల భయంతో మోదీ కాళ్ల మీద పడి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ప్రత్యేక హోదా వస్తే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవి. ఇళ్లులేని పేదలకు 3 సెంట్ల స్థలం ఇస్తానని, ఇళ్లు కట్టిస్తానన్నారు. ఇప్పటివరకు ఒక్క ఇల్లైనా కట్టించారా? ముఖ్యమంత్రి హోదాలో కర్నూలుకు వచ్చి స్మార్ట్ సిటీ చేస్తా, ట్రిపుల్ ఐటీ, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తా, మైనింగ్ యూనివర్సిటీ, చేనేత క్లస్టర్లు పెడతా, గుండ్రేవుల ప్రాజెక్టు కడతా అని హామీనిచ్చారు. ఏ ఒక్కటైనా అమలు చేశారా? ఇప్పుడు మళ్లీ నంద్యాలకు వచ్చి అది చేసేస్తాను...ఇదీ చేసేస్తానని హామీలిస్తున్నారు.
ఏమీ అనకూడదంట...
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీలను అమలు చేయని ఈ వ్యక్తిని ఏమీ అనకూడదంట. 21 మంది ఎమ్మెల్యేలను కొనుగోలుచేసినా, ఆ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించకపోయినా ఏమీ మాట్లాడకూడదంట. వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయకపోయినా, వాళ్లల్లో కొందరిని మంత్రులుగా చేసినా, రాజకీయాలు భ్రష్టు పట్టించినా ఎవ్వరూ మాట్లాడకూడదంట. చంద్రబాబు చట్టాన్ని పరిహాసం చేస్తున్నా ప్రశ్నిస్తే తప్పంట. రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను వెన్నుపోటు పొడిచినా అడగనే కూడదంట. నిరుద్యోగుల తరఫున మాట్లాడితే కేసులంట. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు గురించి నేను ఒక్క మాట మాట్లాడితే టీవీలన్నీ ఊదరగొట్టేశాయి. నన్నా ఈ మాట అన్నది జగన్ అని చంద్రబాబు గింజుకున్నారు. అబ్బ.... ఎంత గింజుకున్నారంటే నాకే అర్థంకాలే. చంద్రబాబుకు ఒక్కటి చెప్పదలచుకున్నా. అయ్యా చంద్రబాబు తప్పుచేశావు. నిన్ను ప్రశ్నిస్తాం.
తప్పుచేసిన నిన్ను నిలదీస్తాం. ఈ అన్యాయాలకు, మోసాలకు గాను నీకు ఏ శిక్ష విధించాలని అడుగుతూనే ఉంటాం. అంతేకాదు నీ నేరాలకు, నీ మోసాలకు ఏ శిక్ష విధించినా తక్కువే అని చెబుతూ ఉంటాం. ఇలాంటి అన్యాయాలు, మోసాలు చేసే వ్యక్తికి ఉరిశిక్ష వేసినా తప్పులేదు అని గట్టిగా అంటూనే ఉంటాం. ఏమయ్యా చంద్రబాబు...నేనేదో ఒక మాట అంటే తప్పు. మరి ఎన్నికలకు ముందు మాట ఇచ్చి మోసం చేసినప్పుడు అది తప్పు అనిపించలేదా? నిన్నేమన్నా అంటే దిష్టిబొమ్మలు కాల్పిస్తావు. మాట తప్పడం, మడమ తిప్పడం నీకున్న దురలవాటు. మాట తప్పకపోవడం, మడమ తిప్పకపోవడం నేను మా నాన్న దివంగత నేత రాజశేఖరరెడ్డి నుంచి నేర్చుకున్న అలవాటు’ అని జగన్ పేర్కొన్నారు.
తప్పుచేశావ్ చంద్రబాబూ!
Published Fri, Aug 11 2017 12:36 AM | Last Updated on Fri, Oct 19 2018 8:11 PM
Advertisement