నంద్యాల సీటు టీడీపీకి
- తెలుగుదేశం అభ్యర్థి భూమాకి 97,076 ఓట్లు
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 69,610 ఓట్లు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన నంద్యాల ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. ప్రధానంగా తెలుగుదేశం–వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య సాగిన ఈ పోరులో బ్రహ్మానందరెడ్డి 27,466 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 97,076 ఓట్లు రాగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 69,610 ఓట్లు లభించాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్‌కు కేవలం 1,382 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత స్థానం నోటా(నన్ ఆఫ్ ద ఎబోవ్)కు దక్కింది. 1,231 ఓట్లతో ‘నోటా’ ఏకంగా నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం.
ఒక్క రౌండ్ మినహా అన్ని రౌండ్లలోనూ టీడీపీకి స్పష్టమైన ఆధిక్యత లభించింది. అన్ని రౌండ్ల ఫలితాల అనంతరం భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ ప్రకటించారు. మొత్తం 250 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా.. సదరు చిరునామాల్లో ఓటర్లు లేకపోవడంతో 39 తిరిగొచ్చాయి. మిగిలిన 211లో ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం గమనార్హం. మొత్తం పోలైన ఓట్లలో టీడీపీ అభ్యర్థికి 56.05 శాతం, వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 40.19 శాతం లభించాయి.
పోలైన ఓట్లు 1,73,187
నంద్యాల నియోజకవర్గంలో మొత్తం 2,18,858 ఓట్లు ఉన్నాయి. ఈ నెల 23న జరిగిన ఉప ఎన్నికలో మొత్తం 1,73,187 ఓట్లు పోలయ్యాయి. అంటే మొత్తం ఓట్లలో 79.13 శాతం పోలయ్యా యి. ఈ ఓట్లను సోమవారం 19 రౌండ్లలో లెక్కించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం వరకూ కొనసాగింది. విజయం ఎవరిదనే విషయంలో మాత్రం ఉదయం 11 గంటలకే స్పష్టత వచ్చింది. మొత్తం 19 రౌండ్లలో ఒక్క 16వ రౌండ్ మినహా మిగిలిన అన్ని రౌండ్లలోనూ టీడీపీకి మెజార్టీ వచ్చింది. 16వ రౌండ్‌లో గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామం ఉండటంతో వైఎస్సార్‌సీపీకి 654 ఓట్ల మెజార్టీ లభించింది. మిగిలిన 18 రౌండ్లలో అధికార టీడీపీ అభ్యర్థికే మెజార్టీ దక్కింది. నంద్యాల గ్రామీణ ప్రాంతంతోపాటు నంద్యాల అర్బన్‌లోనూ టీడీపీకి భారీ ఆధిక్యత రాగా, గోస్పాడు మండలంలో మాత్రం మెజార్టీ 2,000 కంటే తక్కువే లభించింది.
నాలుగో స్థానంలో ‘నోటా’
నంద్యాల ఉప ఎన్నికలో ‘నోటా’ ఏకంగా నాలుగో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తర్వాత అత్యధిక ఓట్లు వచ్చింది ‘నోటా’కే కావడం విశేషం. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న అబ్దుల్ ఖాదర్‌కు 1,382 ఓట్లు రాగా, నోటాకు 1,231 ఓట్లు లభించాయి. ఇక రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్‌పీఎస్) అభ్యర్థికి పెద్దగా ఓట్లు రాలేదు. మిగిలిన స్వతంత్ర అభ్యర్థుల్లో ఒక్కరికి కూడా 1,000 ఓట్లకు మించి పడలేదు.