bhuma brahmanandareddy
-
గెలుపుపై నమ్మకం కోల్పోయిన టీడీపీ ప్రముఖులు
సాక్షిప్రతినిధి కర్నూలు : గెలుపు, ఓటమి సమస్య కాదు.. గత 20 ఏళ్లుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ అత్యంత బలహీనంగా ఉంది. ఇది మాకు తెలుసు. అయితే నియోజకవర్గస్థానం ముఖ్యం. ఒక్కసారి టిక్కెట్ వదులుకుని నియోజకవర్గాన్ని పోగొట్టుకుంటే తిరిగి అందుకోవడం చాలా కష్టం. అందుకే గెలిచినా, ఓడినా పోటీ చేయడం ముఖ్యం. – ఇటీవల టీడీపీ నేతలు బాహాటంగానే చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. ఈ మాటలు చూస్తే తెలుగుదేశం పార్టీ నేతల్లో గెలుపుపై పెద్దగా ఆశల్లేవనే విషయం సుస్పష్టమవుతోంది. కేవలం రాజకీయ ఉనికి కోసం పోటీ చేయాలని తాపత్రయ పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంత శ్రమించినా అధికార పార్టీని ఢీకొట్టడం అంత సులభం కాదనే ధోరణిలో ఉన్నారు. అయితే నియోజకవర్గ స్థానాలను కాపాడుకోవడంలో ఎవరికివారు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో వర్గవిభేదాలు బట్టబయలవుతున్నాయి. నంద్యాల, ఆళ్లగడ్డ, ఆదోని, ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానాలతో పాటు కర్నూలు పార్లమెంట్ స్థానంలో కూడా వర్గవిభేదాలతో టీడీపీ సతమతమవుతోంది. నంద్యాలలో నాలుగు ముక్కలాట మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంలో ఆళ్లగడ్డలో పరిస్థితి బాగోలేదని, మూడు నెలల్లో మార్పు రావాలని, లేదంటే పార్టీ ప్రత్యామ్నాయం చూసుకుంటుందని లోకేశ్ చెప్పినట్లు తెలిసిందే. ఈ క్రమంలో అఖిల ఆదివారం నంద్యాలలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని నంద్యాల, గోస్పాడు కార్యకర్తలకు వారం రోజుల నుంచే ఆమె వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఆహా్వనించారు. విషయం తెలిసి అఖిలతో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మాట్లాడారు. ఇన్చార్జ్గా భూమా బ్రహ్మనందరెడ్డి ఉన్నప్పుడు పార్టీ కార్యాలయం ప్రారంభించడం సరికాదని చెప్పారు. ఆమె ససేమిరా అనడంతో అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో అఖిలతో నేరుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఎవ్వరినీ ఖాతరు చేయకుండా అఖిల ఆఫీసు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అఖిల సోదరుడు భూమా బ్రహా్మనందరెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్‌తో పాటు వీరి అనుచరులు దూరంగా ఉన్నారు. కార్యక్రమానికి ఎవ్వరూ వెళ్లకుండా భూమా బ్రహ్మానందరెడ్డి కట్టడి చేశారు. ఫరూక్ కూడా తన వర్గాన్ని వెళ్లకుండా నివారించారు. ఇప్పటికే నంద్యాలలో భూమా బ్రహ్మనందరెడ్డి, ఫరూక్, ఏవీ సుబ్బారెడ్డి వర్గాలుగా కార్యకర్తలు చీలిపోయి ఉన్నారు. ఈ క్రమంలో అఖిల రాకతో టీడీపీలో నాలుగో కుంపటి రగిలినట్లయింది. అయితే అఖిల మాత్రం.. నంద్యాలలో తన తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని, తాను ఆళ్లగడ్డ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు. భవిష్యత్‌లో నంద్యాల మునిసిపల్ చైర్మన్‌గా విఖ్యాత్‌ను పోటీ చేయించి, 2029 ఎన్నికల్లో విఖ్యాత్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ అడుగుతామని అఖిల వివరిస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని, ఆళ్లగడ్డలో పరిస్థితి బాగోలేకపోవడంతో నంద్యాల టిక్కెట్ అఖిల ఆశిస్తున్నారని భూమా బ్రహ్మానందరెడ్డి, ఫరూక్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డి దసరా నుంచి పూర్తిగా ఆళ్లగడ్డ రాజకీయాలపై దృష్టి పెడతానని తన వర్గీయులతో వ్యాఖ్యానిస్తున్నారు. ఆదోని టిక్కెట్ ‘మీనాక్షి’కి లేనట్టే! వయోభారంతో తాను పోటీచేయలేనని తన కుమారుడు భూపాల్చౌదరికి ఆదోని టిక్కెట్ ఇవ్వాలని లోకేశ్‌కు మీనాక్షినాయుడు విన్నవించారు. అయితే ఆదోని టిక్కెట్ ఈ దఫా బీసీలకు ఇచ్చే యోచనలో ఉన్నామని లోకేశ్ తేల్చిచెప్పారు. ఆదోనిలో ‘కమ్మ’ సామాజికవర్గానికి టిక్కెట్ ఇస్తే ఫలితం ఉండబోదని, అక్కడ బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. ఆదోని నుంచి టీడీపీ నేతలు దేవేంద్రప్ప, సూరం భాస్కర్‌రెడ్డి, గుడిసె కృష్ణమ్మతో పాటు మైనారీ్టనేత రవూఫ్ టిక్కెట్ ఆశిస్తున్నారు. మనుగడ కోసం ‘కోట్ల’ యత్నం కర్నూలు మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి 2014 వరకూ కర్నూలు రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇప్పుడు అతని రాజకీయ ప్రయాణం దారితెన్నూ లేనివిధంగా తయారైంది. 2014, 2019లో ఎంపీగా ఓడిపోవడంతో రాజకీయ మనుగడపై నమ్మకం సన్నగిల్లింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అధిక స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుస్తారని, తాను పోటీ చేసినా ‘హ్యాట్రిక్ ఓటమి’ తప్పదు అనే భావనకు వచ్చారు. అందుకే ఎమ్మిగనూరు అసెంబ్లీ టిక్కెట్ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువగా ఈ నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వర్గాలుగా కార్యకర్తలు చీలిపోయి టీడీపీ మరింత బలహీనమైంది. ఎమ్మిగనూరులో కార్యాలయం ప్రారం¿ోత్సవం నుంచి కోట్ల చేస్తున్న రాజకీయాలపై లోకేశ్‌కు జయనాగేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అధిష్టానంతో మాట్లాడిన కోట్లకు పార్టీ కొత్త విషయం చెప్పింది. కుటుంబానికి ఒక్క టిక్కెట్ మాత్రమే ఇస్తామని, మీ ఇంట్లో ఎవరు పోటీ చేస్తారో నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీ చేస్తే మంత్రాలయం టిక్కెట్ ఇస్తామని, ఆలూరు బోయలకు ఇస్తామని, సుజాతమ్మ ఆలూరు నుంచి పోటీ చేస్తే మంత్రాలయం బోయలకు ఇస్తామని వారు స్పష్టం చేశారు. దీంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ‘కోట్ల’ కుటుంబం ఉంది. ఇటీవల గోనెగండ్లలో విలేకరుల సమావేశంలో కూడా ‘కర్నూలు ఎంపీగా తానుకానీ లేదా మరొకరు కానీ పోటీ చేస్తారని’ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పారు. తాను ఎంపీ అభ్యరి్థగా రాలేదని, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా వచ్చానన్నారు. ఎంపీ అభ్యర్థిగా తానే బరిలో ఉంటానని ధైర్యంగా చెప్పలేకపోయారు. అంటే తన స్థానంపై తనకే నమ్మకం, స్పష్టత లేదనే విషయం సుస్పష్టమవుతోంది. మరోవైపు జయనాగేశ్వరరెడ్డిపై కూడా టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మిగనూరు నుంచి ఈ దఫా కొత్త ముఖాన్ని బరిలోకి దింపే యోచనలో టీడీపీ ఉందని లోకేశ్‌ను కలిసిన కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్నారు. దీంతో జయనాగేశ్వరరెడ్డికి కూడా టిక్కెట్ దక్కే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. -
నంద్యాల సీటు టీడీపీకి
- తెలుగుదేశం అభ్యర్థి భూమాకి 97,076 ఓట్లు - వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 69,610 ఓట్లు సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన నంద్యాల ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. ప్రధానంగా తెలుగుదేశం–వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య సాగిన ఈ పోరులో బ్రహ్మానందరెడ్డి 27,466 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 97,076 ఓట్లు రాగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 69,610 ఓట్లు లభించాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్‌కు కేవలం 1,382 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత స్థానం నోటా(నన్ ఆఫ్ ద ఎబోవ్)కు దక్కింది. 1,231 ఓట్లతో ‘నోటా’ ఏకంగా నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. ఒక్క రౌండ్ మినహా అన్ని రౌండ్లలోనూ టీడీపీకి స్పష్టమైన ఆధిక్యత లభించింది. అన్ని రౌండ్ల ఫలితాల అనంతరం భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ ప్రకటించారు. మొత్తం 250 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా.. సదరు చిరునామాల్లో ఓటర్లు లేకపోవడంతో 39 తిరిగొచ్చాయి. మిగిలిన 211లో ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం గమనార్హం. మొత్తం పోలైన ఓట్లలో టీడీపీ అభ్యర్థికి 56.05 శాతం, వైఎస్సార్సీపీ అభ్యర్థికి 40.19 శాతం లభించాయి. పోలైన ఓట్లు 1,73,187 నంద్యాల నియోజకవర్గంలో మొత్తం 2,18,858 ఓట్లు ఉన్నాయి. ఈ నెల 23న జరిగిన ఉప ఎన్నికలో మొత్తం 1,73,187 ఓట్లు పోలయ్యాయి. అంటే మొత్తం ఓట్లలో 79.13 శాతం పోలయ్యా యి. ఈ ఓట్లను సోమవారం 19 రౌండ్లలో లెక్కించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం వరకూ కొనసాగింది. విజయం ఎవరిదనే విషయంలో మాత్రం ఉదయం 11 గంటలకే స్పష్టత వచ్చింది. మొత్తం 19 రౌండ్లలో ఒక్క 16వ రౌండ్ మినహా మిగిలిన అన్ని రౌండ్లలోనూ టీడీపీకి మెజార్టీ వచ్చింది. 16వ రౌండ్లో గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామం ఉండటంతో వైఎస్సార్సీపీకి 654 ఓట్ల మెజార్టీ లభించింది. మిగిలిన 18 రౌండ్లలో అధికార టీడీపీ అభ్యర్థికే మెజార్టీ దక్కింది. నంద్యాల గ్రామీణ ప్రాంతంతోపాటు నంద్యాల అర్బన్లోనూ టీడీపీకి భారీ ఆధిక్యత రాగా, గోస్పాడు మండలంలో మాత్రం మెజార్టీ 2,000 కంటే తక్కువే లభించింది. నాలుగో స్థానంలో ‘నోటా’ నంద్యాల ఉప ఎన్నికలో ‘నోటా’ ఏకంగా నాలుగో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తర్వాత అత్యధిక ఓట్లు వచ్చింది ‘నోటా’కే కావడం విశేషం. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న అబ్దుల్ ఖాదర్‌కు 1,382 ఓట్లు రాగా, నోటాకు 1,231 ఓట్లు లభించాయి. ఇక రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్పీఎస్) అభ్యర్థికి పెద్దగా ఓట్లు రాలేదు. మిగిలిన స్వతంత్ర అభ్యర్థుల్లో ఒక్కరికి కూడా 1,000 ఓట్లకు మించి పడలేదు. -
తాడో పేడో!
► రసకందాయంలో నంద్యాల రాజకీయం ► అధికార పార్టీలో ఆరని చిచ్చు ► కార్యకర్తల భేటీలతో నేతలు బిజీ ► నేడు శిల్పా వర్గం సమావేశం ► ఆదివారం మాజీ మంత్రి ఫరూక్.. ► రెండు రోజుల్లో కార్యకర్తలతో భూమా బ్రహ్మానందరెడ్డి చర్చలు ► ఇదే బాటలో ఎస్పీవై రెడ్డి వర్గం సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల వేడి అధికార పార్టీలో రోజురోజుకు రాజుకుంటోంది. ఉప ఎన్నికల సీటు తమకంటే తమకు ఇవ్వాలని ఎవరికి వారే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఎవరికి వారుగా అధిష్టానానికి సిగ్నల్స్ పంపగా.. తాజాగా కార్యకర్తల సమావేశాలు షురూ చేశారు. తనకు సీటు ఇవ్వాలని ఇప్పటికే అధిష్టానాన్ని సంప్రదించిన మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి శుక్రవారం కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇదే బాటలో మరో మాజీ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ కూడా ఆదివారం కార్యకర్తలతో భేటీ కానున్నట్లు తెలిసింది. ఇక భూమా కుటుంబానికి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డి కూడా రెండు రోజుల్లో కార్యకర్తలతో చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మిగిలిన ఎస్.పి.వై. రెడ్డి వర్గం కూడా కార్యకర్తల భేటీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారుగా తమ సత్తా చాటాలని నడుపుతున్న రాజకీయ చదరంగంలో ఎవరి ఎత్తు పారుతుందో చూడాల్సి ఉంది. పోటీ చేయాల్సిందే.. ప్రధానంగా నంద్యాల అసెంబ్లీ సీటును ఆశిస్తున్న మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి ఇందుకోసం తన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇప్పటికే నేరుగా ముఖ్యమంత్రిని కలసి తనకు సీటు ఇవ్వాలని ఆయన కోరారు. అయితే అధిష్టానం నుంచి సానుకూల స్పందన లేని నేపథ్యంలో స్వతంత్రంగా బరిలోకి దిగాలని ఆయన యోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూమా కుటుంబానికి సీటు ఇస్తే సహకరించేది లేదని పరోక్షంగా ఇప్పటికే తేల్చిచెప్పారు. తాజాగా కార్యకర్తల భేటీలోనూ ఇదే అంశం ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. పోటీ చేయాల్సిందేననే డిమాండ్ కార్యకర్తల నుంచి వచ్చేలా చూసేందుకే నేడు సమావేశమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లుగా ఉన్న రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి ఉప ఎన్నికల్లో భూమా కుటుంబానికి సహకరిస్తే తాము మీ వెంట నడవబోమని కూడా ఈ సమావేశంలో కార్యకర్తలు తేల్చి చెప్పనున్నట్లు సమాచారం. నియోజకవర్గాన్ని వదిలిపెడితే నియోజకవర్గంలో రాజకీయ సమాధేనని ఈ సందర్భంగా తమ నేతకు ఆయన అనుచరులు స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వేరే పార్టీ నుంచి పోటీ చేయాలా, స్వతంత్రంగా బరిలోకి దిగాలా? అనే అంశాన్ని నేటి కార్యకర్తల సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదే బాటలో... ఉప ఎన్నికల్లో సీటు కోసం శిల్పామోహన్‌రెడ్డి కదుపుతున్న పావులకు దీటుగా ఫరూక్ వర్గం కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రెండు దఫాలుగా కనీసం తమ నేత పేరును పరిశీలించకపోవడాన్ని ఆయన అనుచరులు తప్పుపడుతున్నారు. ప్రధానంగా ముస్లిం ఓటర్లున్న నంద్యాల అసెంబ్లీ సీటును తమ నేతకు ఇవ్వాల్సిందేనని ఆయన అనుచరులు కోరుతున్నారు. లేనిపక్షంలో అధికార పార్టీకి దూరమవ్వాలని కూడా ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన కార్యకర్తల భేటీ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా భూమా కుటుంబం నుంచి సీటు ఆశిస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి ఇప్పటికే నంద్యాలలో పర్యటిస్తున్నారు. అధిష్టానం నుంచి తనకే సీటు కన్ఫర్మ్ అయిందని ప్రచారం చేసుకుంటున్నారు. భూమా అనుచరులు మొత్తం తన వెంటే ఉన్నారనే సంకేతాన్ని అధిష్టానానికి పంపేందుకు వీలుగా త్వరలో ఆయన కూడా కార్యకర్తలతో భేటీ కానున్నారని సమాచారం. ఇక అదే బాటలో భూమా కుటుంబానికి టిక్కెట్ ఇవ్వకపోతే తామూ రంగంలో ఉన్నామంటూ ఎస్.పి.వై.రెడ్డి వర్గం కూడా సమావేశానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నికల రాజకీయ వేడి అధికార పార్టీలో రోజురోజుకు సెగ పుట్టిస్తోంది.