హైదరాబాద్లో ఉన్నవాళ్లంతా తెలంగాణవారే:డిఎస్
హైదరాబాద్: హైదరాబాద్లో ఉన్నవాళ్లంతా తెలంగాణ వారేనని పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రుల భయాందోళనలను తొలగించే ప్రయత్నం ఆయన చేశారు. ఇక్కడ ఉన్నవారు ఎటువంటి ఆందోళనలు చెందవలసిన అవసరంలేదన్నారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగానో, దేశానికి రెండో రాజధాని గానో చేసే ఆలోచన యుపిఏకు లేదని చెప్పారు. రాష్ట్ర విభజనపై సంప్రదించలేదని సీమాంధ్ర నేతలు, ప్రజలు అనడం సరికాదన్నారు.
శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలను సంప్రదించిందని డిఎస్ చెప్పారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు లేవనెత్తుతున్న సమస్యలను ఆంటోనీ కమిటీ పరిష్కరిస్తుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. 4, 5 నెలల్లో తెలంగాణ ఏర్పాటుపై రాజ్యాంగ ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పారు.
కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపమని అక్కడి ప్రజలు కోరుతున్నారని, ఆ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయదని చెప్పారు. కానీ తెలంగాణకు అభ్యంతరం లేదంటూ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేసినట్లు తెలిపారు. పరస్పరం సహకరించుకుంటూ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవడంపై దృష్టిపెట్టాలన్నారు. శాంతిభద్రతలపై సీఎం కూడా దృష్టి సారించాలని ఆయన కోరారు.