ఆ రెండు పార్టీలు కాలగర్భంలో కలిసిపోతాయి: కొణతాల | Those parties will vanish, says konatala ramakrishna | Sakshi
Sakshi News home page

ఆ రెండు పార్టీలు కాలగర్భంలో కలిసిపోతాయి: కొణతాల

Published Thu, Oct 10 2013 2:22 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

ఆ రెండు పార్టీలు కాలగర్భంలో కలిసిపోతాయి: కొణతాల - Sakshi

ఆ రెండు పార్టీలు కాలగర్భంలో కలిసిపోతాయి: కొణతాల

లక్షలాది మంది ప్రజలు రోడ్లెక్కి సమైక్యం కోసం నినదిస్తుంటే పాలకపక్షం, ప్రధాన ప్రతిపక్షం బాధ్యతను విస్మరించి విభజనకు అంగీకరించాయని, ఈ రెండు పార్టీలు త్వరలోనే కాలగర్భంలో కలిసిపోతాయని వైఎస్సార్ సీపీ నాయకులు కొణతాల రామకృష్ణ అన్నారు. బుధవారం రాత్రి జగన్‌ను పోలీసులు తీసుకెళ్లిన తీరుపై ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. అహింసా మార్గంలో దీక్ష కొనసాగిస్తుంటే పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమని, గతంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దీక్ష సందర్భంగానూ ఇలాగే వ్యవహరించారని ఆయన దుయ్యబట్టారు.

సమైక్యాంధ్రకు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు విభజనకు పూనుకున్నాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తాను రాజీనామా చెయ్యరు, ఎవర్నీ చెయ్యనివ్వరని అన్నారు. జులై 25న వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు అందరూ రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, కానీ సీఎం దగ్గరుండి విభజన తంతు జరిపిస్తున్నారని అన్నారు. ఓవైపు మంత్రి విశ్వరూప్ రాజీనామా చేస్తే ఆమోదిస్తారు, మిగతా వాళ్లు చేస్తే ఆమోదించరు, హరికృష్ణ రాజీనామా చేస్తే ఆమోదిస్తారు, మిగతా ఎంపీలు చేస్తే ఆమోదించరు..దీన్ని బట్టి చూస్తుంటే పాలక, ప్రతిపక్షాలు ఎంతగా కుమ్మక్కయ్యాయో ఇట్టే చెప్పవచ్చునని అన్నారు.
 
 పోలీసులను అడ్డుకున్న నాయకులు
జగన్‌ను దీక్షాస్థలి నుంచి పోలీసులు తీసుకెళ్లే సమయానికి పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు వచ్చారు. జగన్‌ను పోలీసులు తీసుకెళుతున్న సమయంలో నాయకులు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కొడాలి నాని, వైఎస్ అనీల్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు తీవ్రంగా అడ్డుకున్నా పోలీసులు వీళ్లందరినీ పక్కకు నెట్టి జగన్‌ను అంబులెన్సు ఎక్కించారు. దీక్షా ప్రాంగణంలో ఉన్న కార్యకర్తలు కూడా పోలీసులను తీవ్రంగా అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర, జై జగన్ నినాదాలు చేశారు. ఒక దశలో తీవ్రంగా తోపులాట జరిగింది. కార్యకర్తలను, నాయకులను పోలీసులు పక్కకు నెట్టి జగన్‌ను ప్రత్యేక అంబులెన్సులో నిమ్స్‌కు తరలించారు. అర్ధరాత్రి సమయంలోనూ కొంతమంది కార్యకర్తలు నిమ్స్‌కు వెళ్లారు.,  ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు నిమ్స్ వద్ద మీడియాతో మాట్లాడుతూ పోలీసుల తీరును తప్పుపట్టారు. అహింసా మార్గంలో దీక్ష చేస్తున్నా అడ్డుకోవడం తగదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement