మా వాళ్లకే ఇవ్వాలి | Those who should be our | Sakshi
Sakshi News home page

మా వాళ్లకే ఇవ్వాలి

Published Mon, Dec 22 2014 3:39 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

Those who should be our

మీరేం చేస్తారో నాకు తెలియదు.... నేను చెప్పిన  వారికే రుణాలు ఇవ్వాలి.. అధికార పార్టీకి చెందిన నాయకుడి హుకుం ఇది.. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు  జరుగుతోంది. అంతేకాకుండా  లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం నియమించిన కమిటీలు కీలకంగా మారాయి.  అందులోని సభ్యులు తమ వారికే రుణాలు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో  అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
 
 కడప రూరల్ : ఎస్సీ. ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు రుణాల మంజూరు విషయంలో జరుగుతున్న ప్రక్రియలో గందరగోళం  చోటుచేసుకుంటోంది. అనేక చోట్ల అధికారపార్టీ నాయకులు జోక్యం చేసుకుంటుండటంతో అధికారులకు తలనొప్పిగా మారింది. రుణాల మంజూరు విషయంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది.
 
 గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓ, బ్యాంకులకు     చెందిన సిబ్బంది ఒకరు, ఆయా కార్పొరేషన్లకు సంబంధించిన అధికారి ఒకరు, సోషల్ వర్కర్లు ముగ్గురు కమిటీలో సభ్యులుగా ఉంటారు.  జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనుమతితో సభ్యుల నియామకం జరుగుతుంది.  అర్హులైన అభ్యర్థుల ఎంపిక ఈ కమిటీ ద్వారా జరగాల్సి ఉంది.  కమిటీ ఆమోదం పొందిన తర్వాతనే అభ్యర్థుల రుణ మంజూరు ప్రక్రియకు మార్గం సుగమం అవుతోంది.
 
  ఈ కమిటీల్లోని సోషల్ వర్కర్లు దాదాపుగా అధికార పార్టీకి చెందిన వారు కావడంతో వారంతా తమ పార్టీకి చెందిన వారికే రుణాలు వచ్చేలా ప్రయత్నాలు సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముందు మా వాళ్లను ఎంపిక చేయండి.. ఆపై మీ పని చేసుకోండని ఇటీవల ఓ మండల నాయకుడు హుకుంజారీ చేయడాన్ని ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.  ఆయా కార్పొరేషన్లు మండలాలు,  మున్సిపాలీటీ వారీగా లక్ష్యాలను విధించాయి. ఆ లక్ష్యాల ప్రకారమే బ్యాంకర్లు అర్హులైన వారికి రుణాలను అందించాల్సి ఉంది.  లబ్ధిదారుల  ఎంపికలో  అధికారులు స్వేచ్చగా వ్యవహరించలేక పోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
 
 అర్హులైన వారు మళ్లీ కమిటీ ఆమోదం పొందాలి
 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆయా వర్గాలకు చెందిన వారు రుణాలు పొందడానికి అన్ని అనుమతులను పొందారు. కమిటీ సభ్యుల ఆమోదం కూడా పొందారు. ఇంతలోపే ఎన్నికలు రావడం.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగిపోయింది. అప్పుడు అర్హులైన వారంతా మళ్లీ ప్రస్తుత కమిటీల ఆమోదం పొందాలని  ఆదేశాలు వచ్చాయి.
 ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి  లబ్ధిదారుల  ఎంపిక కార్యక్రమం జరుగుతోంది. బీసీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.  ముస్లిం, క్రిస్టియన్ కార్పొరేషన్ల ద్వారా రుణ లక్ష్యాల ప్రకటన త్వరలో రానుంది.  రుణాల మంజూరులో అధికార పార్టీ నాయకుల పెత్తనంతో అర్హులైన నిరుపేద లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement