లైంగిక దాడి ఘటనలో ముగ్గురు నిందితుల అరెస్టు | three accused arrested in sexual assault case | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి ఘటనలో ముగ్గురు నిందితుల అరెస్టు

Published Sun, Nov 10 2013 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM

three accused arrested in sexual assault case

 

 =అంతా గోప్యమే..
 = ప్రధాన నిందితుడు పాత ముద్దాయే

 
విజయవాడ, న్యూస్‌లైన్ : వించిపేట రైల్వే ఆఫ్ యార్డులో ప్రయాణికురాలిపై జరిగిన లైంగిక దాడి కేసులో కొత్తపేట పోలీసులు ముగ్గురు నిందితులను శనివారం అరెస్టు చేశారు. ఈ ఘటనలో నిందితులను అరెస్టు చూపడంలో పోలీసులు అంతా గోప్యంగానే ఉంచడం విమర్శలకు దారి తీసింది. కేసులో ముగ్గురు నిందితులను శనివారం సాయంత్రం కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో వెస్ట్ ఏసీపీ టీ హరికృష్ణ, సీఐ వెంకటేశ్వర్లు, సాహేరా బేగంలు అరెస్టు చూపారు.  

ఈ కేసులో ప్రధాన నిందితుడైన గుంటూరు జిల్లా నర్సరావుపేట జొన్నలగడ్డ గ్రామానికి చెందిన దెడ్డుకుంట కోటిరెడ్డి(30)తో పాటు కేఎల్‌రావునగర్ బొగ్గులైన్ క్వార్టర్స్‌కు చెందిన కొనపాల రాజు (37), విశాఖపట్నానికి చెందిన శేర గోపి (28)లను శనివారం రాత్రి అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండపేటకు చెందిన ఓ వివాహితపై ఈ నెల 5వ తేదీ తెల్లవారుజామున కొంతమంది యువకులు లైంగిక  దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు అదేరోజు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

యువతిపై లైంగిక దాడి చేసిన  వారిలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉన్నారంటూ పుకార్లు రావడంతో కేసును కొత్తపేట పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు  కొత్తపేట పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులను శనివారం రాత్రి అరెస్టు చూపడంతో కేసు చిక్కుముడి వీడింది. ప్రధాన నిందితుడైన కోటిరెడ్డి గుంటూరు, విజయవాడ రైల్వే పోలీస్‌స్టేషన్లలో పలు కేసులలో ముద్దాయి.
 
ఆరోజేం జరిగిందంటే...

 నిందితులు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం... ఘటన జరిగిన రోజు మూడో నంబర్ ప్లాట్‌ఫాంపై ఉన్న డీఎంఈలో వివాహిత రాజమండ్రి వెళ్లేందుకు రెలైక్కింది. డీఎంఈని శుభ్రం చేయాల్సి ఉండటంతో రైలు వించిపేట రైల్వే ఆఫ్ యార్డులోకి చేరింది. అదే సమయంలో రైలులో ఒంటరిగా ఉన్న వివాహితను కోటిరెడ్డి గమనించాడు. రైల్వేస్టేషన్ నుంచి యార్డులోకి వెళ్లే రైళ్లలో నిద్రపోతున్న వ్యక్తులను బెదిరించి డబ్బులు, వస్తువులు లాక్కోవడం అతని వృత్తి. ఒంటరిగా ఉన్న వివాహితను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఇదే సమయంలో రైల్వేలో ప్రైవేటు స్వీపర్‌గా పనిచేసే కొనపోల రాజు (37) వివాహితపై లైంగిక దాడికి పాల్పడటాన్ని గమనించాడు. కోటిరెడ్డి వెళ్లిపోయిన తర్వాత అతను కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో శేర గోపి అక్కడే ఉండి ఘటనను ప్రత్యక్షంగా తిలకించాడు. ఈ వ్యవహారం గురించి పోలీసులకు గాని, రైల్వే అధికారులకు గాని తెలియజేయకపోవడంతో ఈ కేసులో గోపిని మూడో నిందితుడిగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement