
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం
పలమనేరు: దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న ఓ కుటుంబం తిరిగిరానీ లోకాలకు వెళ్లింది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారిని దర్శించుకుని వెళ్తున్నవారిని సొంత వాహనం మృత్యువు రూపంలో కబళించింది. ముగ్గురిని సజీవదహనం చేసింది.
తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు బెంగళూరు సంపెంగ నగర్కు చెందిన సత్యనారాయణ కుటుంబం తరలివచ్చింది. ఉత్సవాల్లో పాల్గొని వెంకన్నను చూసి తరించిన ఆ కుటుంబం దర్శనం తరువాత తమ సొంత వాహనంలో తిరుగు ప్రయాణమైంది. దారిలో చిత్తూరు జిల్లా పలమనేరు బూతుల బండ వద్దకు వచ్చేసరికి హఠాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. అక్కడే సత్యనారాయణ, అతని భార్య మహాలక్ష్మీ, కూతురు దీపమాల మంటల్లో చిక్కుకుని కారులోనే సజీవ దహనమైయారు.
ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సత్యనారాయణ కుమారుడు ప్రసన్న కుమార్ను రక్షించారు. అగ్ని మాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.