సువర్ణముఖి నది నుంచి మృతదేహాలు వెలికితీత
విజయనగరం : సువర్ణముఖి నదిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ముగ్గురి మృతదేహాలను స్థానికులు గురువారం వెలికి తీశారు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం తోటపల్లి గ్రామ సమీపంలో సువర్ణముఖి నదిలో బుధవారం స్థానికులు కృష్ణ (40)తో పాటు అతడి మేనల్లుళ్లు నాగేంద్ర (10) మహేంద్ర (11)లు స్నానానికి దిగారు. ఆ క్రమంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు పిల్లలిద్దరూ నదిలో మునిగిపోయారు. వెంటనే అప్రమత్తమైన మేనమామ కృష్ణ... వారిని రక్షించేందుకు ప్రయత్నించారు.
ఆ క్రమంలో అతడు కూడా గల్లంతయ్యాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై వారి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని నదిలో వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాంతో గురువారం ఉదయం సంఘటన స్థలానికి 200 మీటర్ల దూరంలో మృతదేహాలను కనుగొన్నారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.