suvarnamukhi river
-
గ్రామాల్లోకి సువర్ణముఖి నీరు
వంగర : కొప్పర, కొండచాకరాపల్లి గ్రామాల్లోకి సువర్ణముఖి నది నీరు శుక్రవారం వేకువజామున ప్రవేశించింది. గురువారం అర్ధరాత్రి వరకు నదుల్లో ఎటువంటి నీటి ప్రవాహం లేకున్నా ఒక్కసారిగా శుక్రవారం వేకువజామున సువర్ణముఖి, వేగావతి నదుల్లో నీటి ఉధృతి భారీగా పెరిగింది. 60వేల క్యూసెక్కుల నీరు నదిలో ప్రవహించింది. అప్పటి వరకు మడ్డువలస గేట్లు ఎత్తకపోవడంతో నీరు పోటెత్తింది. దీంతో ఉదయం ఐదు గంటల సమయానికి కొండచాకరాపల్లి రైతుల కల్లాలు, ఆంజనేయస్వామి, రామాలయాల ఆవరణలోకి, రోడ్లుపైకి వరద నీరు ప్రవేశించింది. కొప్పర ప్రధాన రహదారి, ఎస్సీ కాలనీ, రెల్లి వీధి, ప్రాథమిక పాఠశాల, పంట పొలాలు, కూరాకుల పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఒక్కసారిగా రెండు గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు. సమాచారాన్ని స్థానిక జెడ్పీటీసీ బొత్స వాసుదేవరావునాయుడు కలెక్టర్, బొబ్బిలి నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ దృష్టికి ఉదయం ఆరు గంటల సమయంలో తీసుకువెళ్లారు. కలెక్టర్ ప్రాజెక్టు అధికారులను అప్రమత్తం చేయడంతో డీఈ డి.పద్మజ ఆధ్వర్యంలో ప్రాజెక్టు వద్ద ఏడు గేట్లు ఎత్తి 55వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెట్టారు. దీంతో గ్రామాల్లో ఉన్న నీటి ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆయా గ్రామాల్లో వరి, జొన్న, కూరగాయల పంటలు నీట మునిగాయి. కొండచాకరాపల్లి తంపర పొలాల్లో వరి పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల పర్యటన కొప్పర, కొండచాకరాపల్లి గ్రామాల్లో రెవెన్యూ, మండల పరిషత్ అధికారులతో పాటు వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల్లో శుక్రవారం సందర్శించారు. ఎప్పటికప్పుడు సమస్యను ఉన్నతాధికారులకు చేరవేసే పనిలో ఉన్నారు. గ్రామాలకు రక్షణ కల్పించాలి... మా గ్రామాలకు రక్షణ కల్పించాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు కిమిడి సన్యాసినాయుడు, పారిశర్ల శ్రీదేవిలు డిమాండ్ చేశారు. ఏటా వరదల సమయంలో ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారని, శాశ్వత పరిష్కారం కల్పించాలని వారు కోరారు. -
భారీ వర్షాలు: రెండో రోజు నిలిచిన రైళ్లు
-
భారీ వర్షాలు: రెండో రోజు నిలిచిన రైళ్లు
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. గుంటూరు జిల్లావ్యాప్తంగా శుక్రవారం మళ్లీ ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. నగర శివారులోని పలు కాలనీలు ఇప్పటికే జలమయమైనాయి. దీంతో శివారు ప్రాంతానికి చెందిన ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గురువారం వరకు కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో ఏడుగురు మృతి చెందగా... మరొకరు గల్లంతయ్యారు. అలాగే జిల్లాలోని రైల్వే ట్రాక్ ఏడు చోట్ల దెబ్బతింది. దీంతో ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. గుంటూరు - సికింద్రాబాద్ మధ్య రెండో రోజు కూడా రైళ్లు నడవని పరిస్థితి ఏర్పడింది. రైల్వే ట్రాక్‌లు మరమ్మతులు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే రంగంలోకి దిగింది. భారీ వర్షాలతో జిల్లావ్యాప్తంగా 66 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ఉన్నతాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఓ వేళ వరద పోటెత్తితే రంగంలోకి దిగేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఇప్పటికే ప్రకటించారు. జిల్లాలోని వర్షాలు, వరదల పరిస్థితిపై ఉన్నతాధికారులతో కలెక్టర్ కాంతిలాల్ దండే ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలకు జిల్లాలోని కాకుమాను మండలం కొండపాటూరులో నల్లమడ వాగుకు గండి పడింది. గరికపాడు సమీపంలో కొమ్మమూరు కెనాల్‌కు గండి పడింది. దీంతో పంట పొలాల్లొకి భారీగా వరద నీరు చేరుతుంది. తూర్పు గోదావరి జిల్లా : జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు కుంటలు చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. రాజమండ్రి దివాన్ చెరువు ప్రాంతంలోని ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజానగరం చెరువుకు గండిపడింది. కృష్ణా జిల్లా : విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. 70 గేట్లు ఎత్తి లక్షా 32 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాల కారణంగా నందిగామ, వీరులపాడు, వత్సవాయి మండలాల్లో పొన్నేరు, కట్టలేరు, వైరా ఏరు ఉధృతిగా ప్రవహిస్తుంది. వీరులపాడు కూడలి వద్ద కాజ్వే పైకి భారీగా నీరు వచ్చి చేరింది. 25 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం జిల్లా: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో వేగవతి, సువర్ణముఖి నదులకు వరద పోటెత్తింది. దీంతో మద్దివలస రిజర్వాయర్‌కు 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో ఆరు గేట్లను అధికారులు ఎత్తివేసి.. నీటికి దిగువకు విడుదల చేశారు. -
నదిలో పడి ఇద్దరు విద్యార్థినుల మృతి
పార్వతీపురం (విజయనగరం) : పిక్నిక్ కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు ప్రమాదవశాత్తు నదిలో పడి మృతిచెందారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా డి.సిర్లాం సమీపంలోని సువర్ణముఖి నది వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మందలుక్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న 13 మంది విద్యార్థినులు పిక్నిక్ కోసం సువర్ణముఖి నది వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో కర్రి కవిత(13), తులసి(13) అనే ఇద్దరు ఆడుకుంటూ వెళ్లి సువర్ణముఖిలో పడి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. విద్యార్థినులు పిక్నిక్ వెళ్తున్న విషయం పాఠశాల యాజమాన్యానికి తెలియదని అంటున్నారు. -
సువర్ణముఖి నది నుంచి మృతదేహాలు వెలికితీత
విజయనగరం : సువర్ణముఖి నదిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ముగ్గురి మృతదేహాలను స్థానికులు గురువారం వెలికి తీశారు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం తోటపల్లి గ్రామ సమీపంలో సువర్ణముఖి నదిలో బుధవారం స్థానికులు కృష్ణ (40)తో పాటు అతడి మేనల్లుళ్లు నాగేంద్ర (10) మహేంద్ర (11)లు స్నానానికి దిగారు. ఆ క్రమంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు పిల్లలిద్దరూ నదిలో మునిగిపోయారు. వెంటనే అప్రమత్తమైన మేనమామ కృష్ణ... వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో అతడు కూడా గల్లంతయ్యాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై వారి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని నదిలో వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాంతో గురువారం ఉదయం సంఘటన స్థలానికి 200 మీటర్ల దూరంలో మృతదేహాలను కనుగొన్నారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.