కార్తీక పున్నమి వెలుగులో దివ్యదేవుని దర్శనభాగ్యం దొరికిందన్న ఆనందం మరుక్షణంలో ఆవిరవుతుందని గుర్తించలేకపోయారు. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో యాత్ర విశేషాలు పంచుకుందామనుకున్న వారి యాత్ర విషాదంగా మారుతుందని తెలుసుకోలేకపోయారు. మంచు తెరలను చీల్చుకుంటూ కారులో రయ్యిమని దూసుకొస్తున్న వారికి లారీ రూపంలో మృత్యువు తమ ముందే ఉందని గమనించలేకపోయారు. శనివారం వేకువజామున చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద లారీని వెనకగా కారు ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. తెల్ల వారుజామున ఎర్రని నెత్తుటి ముద్దలుగా మారి జిల్లా గుండెలపై కన్నీటి తడి మిగిల్చారు. ‘దేవుడా.. మా కుటుంబ సభ్యుల ప్రాణాలను అర్ధంతరంగా కొండెక్కించావా’ అంటూ బంధువులు గుండెలవిసేలా రోదించారు.
చిలకలూరిపేటరూరల్: దైవదర్శనానికి వెళ్లి వస్తున్న వారి జీవితాలపై విధి విషం చిమ్మింది. రోడ్డు ప్రమాదం రూపంలో ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. శనివారం తెల్లవారుజామున మండలంలోని తాతపూడి వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. పోలీసుల వివరాల మేరకు..
అరుణాచలం వెళ్లి అనంతలోకాలకు ....
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి చెందిన ఇమ్మంది సోమశేఖర్, పలివెల సుబ్బారావు, పల్లి దినేష్, రేగుల సత్యసారథి స్నేహితులు. ఈ నెల 21వ తేదీ గురువారం రాజమండ్రి నుంచి కారులో తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలంకు వెళ్ళారు. సుబ్బారావు, సోమశేఖర్ అయ్యప్ప మాల ధరించి ఉన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వీరిలో సారథి కారు నడుపుతున్నాడు. పక్కనే సీట్లో దినేష్ కూర్చున్నారు. వెనుక సీట్లో సుబ్బారావు, సోమశేఖర్ ఉన్నారు. తెల్లవారుజామున 5.30 గంటలకు తాతపూడి బ్రిడ్జి వద్ద కారు ముందు వెళుతున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు.
దీంతో వేగంగా వస్తున్న కారు.. లారీని వెనక నుంచి ఢీకొట్టింది. కారు డ్రైవింగ్ చేస్తున్న రేగుల సత్యసారథి(28), కారు యజమాని పల్లి దినేష్(31), పలివెల సుబ్బారావు,(30) అక్కడికక్కడే మృతి చెందారు. అయ్యప్ప దీక్షలో ఉన్న మరో వ్యక్తి ఇమ్మంది సోమశేఖర్ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలవగా చికిత్స నిమిత్తం రాజమండ్రిలోని ఆస్పత్రికి తరలించారు.
బెలూన్స్ తెరుచుకున్నా..
వేగంగా లారీని ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. ఇందులోనే వారు ఇరుక్కుపోయారు. దీంతో బెలూన్స్ తెరుచుకున్నా బయటకు రాలేక మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ ఎస్ విజయ చంద్ర, ఎస్‌ఐలు ఉదయ్‌బాబు, వపన్‌కుమార్, ఆర్టీవో అమరానాయక్, హైవే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం బంధువులకు అప్పగించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హుటాహుటిన తరలివచ్చిన మృతుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు.
ఇటీవలే కారు కొనుగోలు చేసి....
రాజమండ్రి పేపర్ మిల్లులో సివిల్ కాంట్రాక్టులు నిర్వహించే పశ్చిమ గోదావరి జిల్లా కోవూరుకు చెందిన మృతుడు పల్లి దినేష్‌కుమార్ భార్య శృతి పేరుతో అక్టోబర్ నాలుగో తేదీన కారు కొనుగోలు చేశాడు. నవంబర్ ఐదో తేదీన రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ పూర్తయినా నేటికీ కారును టీఆర్ పేరుతో కొనసాగిస్తున్నారు.
విడదీయరాని స్నేహం ...
పలివెల సుబ్బారావు రాజమండ్రిలోని పేపర్ మిల్లులో కాంట్రాక్ట్ కార్మికుడిగా, సోమశేఖర్, పల్లి దినేష్‌లు సివిల్ కాంట్రాక్టర్లుగా పని చేస్తున్నారు. వీరి మధ్య చాలా కాలంగా స్నేహం కుదిరింది. మృతుడు సుబ్బారావుకు గతేడాది వివాహమై రెండు మాసాల క్రితం కుమారుడు జన్మించాడు. మరో మృతుడు పల్లి దినేష్ పశ్చిమ గోదావరి జిల్లా కోవూరులో నివసిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రేగుల సత్యసారథి రాజమండ్రి సమీపంలోని కోరుకొండ మండలం గోకవరం వాసి. స్నేహితులంతా ఒక్కసారి మృత్యువాత పడడంతో ఆయా కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment