బాబు భజన సభల్లో.. పింఛన్‌దారులకు చుక్కలు | Three elderly people dead with Chandrababu Campaign | Sakshi
Sakshi News home page

బాబు భజన సభల్లో.. పింఛన్‌దారులకు చుక్కలు

Published Sun, Feb 3 2019 4:29 AM | Last Updated on Sun, Feb 3 2019 11:30 AM

Three elderly people dead with Chandrababu Campaign - Sakshi

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడలో పింఛన్‌ కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు

సాక్షి, అమరావతి/సంతబొమ్మాళి/సాక్షి ప్రతినిధి, ఏలూరు /సదుం : ఊళ్లో సభ జరుగుతున్న రోజే పింఛన్‌లిస్తాం.. అప్పుడు తీసుకోకుంటే పింఛనే రద్దవుతుంది.. అంటూ జన్మభూమి కమిటీ సభ్యులు ప్రచారం చేస్తుండటంతో కృష్ణా జిల్లా నిడమోలుకు చెందిన 70 ఏళ్ల వెంకటేశ్వర్లు రాజమండ్రిలో ఉంటున్న తన కుమారుడి ఇంటి నుంచి హడావుడిగా సొంతూరికి బయలుదేరాడు. కొడుకు ఇంట్లో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నా.. పింఛన్‌ రద్దువుతుందని అన్ని పనులూ మానుకుని మరీ వచ్చాడు. అయితే ఊళ్లో సభ ఈ రోజు కాదు.. నాలుగో తేదీ.. ఆ రోజే పింఛన్ల  డబ్బులిస్తారని చెప్పడంతో పనులన్నీ వదిలి మరో రెండు రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. ప్రతి నెలా మాదిరి ఒకటి నుంచి ఐదో తేదీల మధ్య ఐదు రోజుల పాటు పింఛన్‌ల పంపిణీని ఆపేసి, ఈ సారి కేవలం ఒకే రోజు.. అదీ రెండు మూడు గంటలే పంపిణీ చేస్తున్నారు. ఆ సమయంలో తీసుకోకుంటే రద్దవుతాయని జన్మభూమి కమిటీ సభ్యులు బెదిరించడంతో వృద్ధులు పింఛన్‌ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. 

సీఎం చంద్రబాబు పొగడ్తల సభల కోసం..
పింఛన్లు పంపిణీ చేసేందుకు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు భజన సభలు వృద్ధులకు చుక్కలు చూపుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ డబ్బులతో ఊరూరా ఈ సభలను నిర్వహిస్తున్న కొందరు ఉన్నతాధికారులు.. ఇందుకోసం వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో వారికి చుక్కలు చూపుతున్నారు. ఒకటో తేదీ నుంచి ఐదో తేదీల మధ్య రోజూ ప్రతి గ్రామంలో జరగాల్సిన పింఛన్ల పంపిణీ నిబంధనలను.. బాబు పొగడ్తల సభల కోసం తాత్కాలికంగా మార్చేశారు. ప్రతి గ్రామం, పట్టణ వార్డుల్లోనూ శని, ఆది, సోమవారాల్లో ఏదో ఒక రోజు సభ నిర్వహించి.. ఆ రోజు మాత్రమే పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. ఆ రోజు పింఛన్‌ తీసుకోకుంటే ఇక భవిష్యత్తులో పింఛన్‌ రాదని గ్రామాల్లో జన్మభూమి కమిటీలు బెదిరిస్తున్నాయి. అధికారులు మాత్రం.. ఆ రోజు తీసుకోకుంటే ఇంక ఆ నెలకు పింఛన్‌ పంపిణీ ఉండదని చెబుతున్నారు. సీఎం కార్యాలయ కార్యదర్శి గిరిజాశంకర్, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో కృష్ణమోహన్‌ ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎంపీడీవోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామంలో సభ జరిగే రోజే ఆ ఊరిలో పింఛనుదారులందరూ సభకు హాజరయ్యేలా చూసుకోవాలని సెర్ప్‌ సీఈవో జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో ఒక్కో మండలంలో దాదాపు పది గ్రామాల్లోని సభలకు అధికారులు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఒక్కో గ్రామంలో ఒకట్రెండు గంటలే సభ నిర్వహించి, ఆ సమయంలోనే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో వృద్ధులు సభల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

దాదాపు 11 వేల చోట్ల మొదలు కాని పంపిణీ 
రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలు, 3,600కు పైగా పట్టణ వార్డుల్లో ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీ మొదలు కావాల్సి ఉంది. రెండో తేదీ రాత్రి వరకు దాదాపు 11 వేల చోట్ల అసలు పింఛన్ల పంపిణీ ప్రారంభం కాలేదని అధికార వర్గాల సమాచారం. ఐదో తేదీకల్లా పంపిణీ పూర్తి కావాల్సి ఉంది. ఫిబ్రవరి నెలకు 54.15 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయగా.. శనివారం రాత్రి వరకు కేవలం 11 లక్షల మందికే పింఛన్‌లు అందాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పింఛన్‌దారుల నుంచి అధికారులు  ఫోన్‌ నంబర్లతో పాటు ఓటు ఉందా లేదా తదితర వివరాలు సేకరిస్తున్నారు. పింఛన్‌ పంపిణీ చేసే అధికారి రిజిస్టర్‌లో లబ్ధిదారుడి ఫోన్‌ నంబర్‌ను నమోదు చేసుకోవాలని ఆదేశాలున్నాయి. ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడలో చేపట్టిన పసుపు–కుంకుమ చెక్కులు, వృద్ధులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసింది. పేరు పేరునా పిలిచి పింఛన్, పసుపు–కుంకుమ చెక్కులు ఇవ్వడంతో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. టెంట్లు లేక మండుటెండలోనే భోజనాలు చేశారు. పసుపు–కుంకుమ చెక్కుల పంపిణీలో కొంతమంది సభ్యుల పేర్లు లేకపోవడంతో గందరగోళానికి దారితీసింది. 

ముగ్గురి ఉసురు తీసిన బాబు ప్రచారార్భాటం 
పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరి మృతి
పింఛన్ల పెంపు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రచారార్భాటం ముగ్గురు వృద్ధుల ఉసురు తీసింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు మృత్యువాతపడ్డారు. పసుపు–కుంకుమ, పింఛన్ల పంపిణీని వేడుకగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. డ్వాక్రా మహిళలు, పింఛన్‌దారులంతా పంచాయతీ కార్యాలయాల వద్దకు హాజరుకావాలంటూ అధికారులు టాంటాం వేశారు. 

టెంట్‌లోనే కుప్పకూలి.. 
తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన కర్రి వెంకటరెడ్డి(75) పింఛన్‌ కోసం ఉదయం ఏడు గంటలకే పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నాడు. పంచాయతీ సిబ్బంది వృద్ధులు, వికలాంగుల వేలిముద్రలను తీసుకున్నారు. చాలాసేపు వేచి ఉన్న తర్వాత సాయంత్రం ఎమ్మెల్యే చేతులు మీదుగా పింఛన్‌ సొమ్ము అందజేస్తాం.. అని చెప్పడంతో కొంతమంది వెళ్లిపోగా, మరికొందరు అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో వెంకటరెడ్డి పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన టెంట్‌లో కుర్చీలో కూర్చుండిపోయాడు. పదిగంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పంచాయతీ అధికారులు వెంకటరెడ్డి కుమారుడు సతీష్‌రెడ్డికి సమాచారం తెలపడంతో ఆయన వచ్చి వైద్యుని వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. 

రోడ్డుమీదే కూలబడ్డాడు..
తాడేపల్లిగూడెం మూడో వార్డుకు చెందిన గొర్ల కొండయ్య (80) పింఛన్‌ తీసుకునేందుకు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లాడు. మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే నిరీక్షించి, నీరసించి సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడి వారు లేపి మంచినీళ్లిచ్చారు. పింఛన్‌తో ఇంటికెళ్తూ రోడ్డుపై మరోసారి పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు. 

తీవ్ర అస్వస్థతతో..
పింఛన్‌ కోసం వచ్చి వృద్ధురాలు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా సదుం మండలం నడిగడ్డలో జరిగింది. షరీపాబీ (75) నడిగడ్డలోని కుమార్తె మస్తానీ వద్ద కొద్ది రోజులు, సదుంలోని కుమారుల ఇంట కొద్ది రోజులు ఉంటోంది. శనివారం ఉదయం నడిగడ్డకు వచ్చిన షరీపాబీ రేషన్‌ సరుకులు తీసుకుంది. అనంతరం పింఛన్‌ కోసం బయలుదేరింది. గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమానికి వచ్చింది. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురవడంతో స్థానికులు ఆమెను సీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ప్రభుత్వం ప్రచారం కోసం పింఛన్లు పంపిణీ చేయకుండా వారిని గంటల తరబడి కూర్చోబెట్టడం వల్లే వృద్ధుల ప్రాణాలు పోయాయని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement