కలిసి రాణించారు.. కలిసే మరణించారు
ఏలేశ్వరం/మండపేట రూరల్/ పెదపూడి, న్యూస్‌లైన్ : జీవిత ప్రస్థానంలో ఒకేమాటగా, ఒకేబాటగా ముందంజ వేసిన ఆ ముగ్గురు మిత్రులనూ మృత్యువు ఒక్కసారే కబళించింది. ఒకరికొకరు అండగా.. అంచెలంచెలుగా ఎదిగిన వారు అంతిమప్రస్థానంలోనూ ఒకరికొకరు తోడయ్యారు. ఏలేశ్వరం మం డలం చిన్నింపేట జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కారు గుర్తు తెలియని వాహ నాన్ని ఢీకొని మండపేట మండలం అర్తమూరుకు చెందిన కడియాల శ్రీనివాస్ (39), పెదపూడి మండలం జి.మామిడాడకు చెందిన తమలంపూడి సురేష్‌బాబురెడ్డి(36), వెలగల నారాయణరెడ్డి(38) మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
శ్రీనివాస్, సురేష్‌బాబురెడ్డి, నారాయణరెడి పదేళ్లక్రితం శ్రీకాకుళం జిల్లా పలాసకు వలస వెళ్లారు. అక్కడ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదిగారు. హైదరాబాద్ కుకట్‌పల్లిలో ఇటీవల హోటల్ వ్యాపారం కూడా ప్రారంభించారు. వీరిలో సురేష్‌బాబురెడ్డి శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. రావులపాలెంలో బంధువుల ఇంట ఆదివారం జరిగే ఓ వేడుకలో పాల్గొనేందుకు శ్రీనివాస్, సురేష్‌బాబురెడ్డి, నారాయణరెడ్డి శనివారం రాత్రి పలాస నుంచి కారులో బయలుదేరారు. ఆ ముగ్గురి స్నేహితుడైన పంచాయతీరాజ్‌శాఖ వర్క్ ఇన్‌స్పెక్టర్ టి.నరసింహమూర్తి కూడా వారి వెంట వచ్చారు.
ఆదివారం తెలవారుజామున సుమారు 3 గంటల సమయంలో చిన్నింపేట జంక్షన్ వద్ద వీరి కారును దాటుకుని వచ్చిన గుర్తు తెలియని వాహనం అకస్మాత్తుగా కుడివైపు తిరిగింది. దీంతో వీరి కారు ఆ వాహనాన్ని ఢీకొని నుజునుజ్జయింది. శ్రీనివాస్, సురేష్‌బాబురెడ్డి అక్కడికక్కడే మరణించారు. నారాయణరెడ్డి, నరసింహమూర్తి, డ్రైవర్ ప్రసాద్‌కుమార్ మహంతి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. కారు లోంచి చేతులు బయటకు పెట్టి నరసింహమూర్తి చేస్తున్న ఆర్తనాదాలతో అక్కడకు చేరుకున్న స్థానికులు గాయపడ్డ ముగ్గురినీ 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నారాయణరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతుడు శ్రీనివాస్‌కు భార్య గౌరి, కుమారుడు చందు, కుమార్తె రోజ్ ఉన్నారు. నారాయణరెడ్డికి భార్య శాంతిప్రియ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని ప్రత్తిపాడు సీఐ రామ్మోహన్‌రెడ్డి, ఎస్సై గౌరీశంకర్, ట్రైనింగ్ ఎస్సై శంకర్ పరిశీలించారు. ప్రమాదంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో నుజ్జయిన కారును గురైన వాహనాన్ని క్రేన్‌ద్వారా పక్కకు తొలిగించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను గొల్లలమామిడాడ, అర్తమూరు గ్రామాలకు తరలించారు. స్వంతజిల్లాకు వస్తూ మార్గమధ్యలో అశువులు బాసారు.
వీరంతా పలాస నుంచి రావులపాలెం వస్తుండగా అర్తమూరు, మామిడాడల్లో విషాదఛాయలు ముగ్గురు మిత్రులను కబళించిన ప్రమాదంతో అర్తమూరు, గొల్లల మామిడాడ గ్రామాల్లో విషాదం అలముకుంది. శ్రీనివాస్ మృతితో దిక్కులేనివాళ్లమయ్యామని ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచి వేసింది. శ్రీనివాస్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. శ్రీనివాస్ మృతదేహానికి ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా కుటుంబానికి పెద్ద దిక్కు అనుకున్న కొడుకును మృత్యువు అకాలంగా ప్రమాదం రూపంలో పొట్టన పెట్టుకుందంటూ సురేష్‌బాబురెడ్డి తల్లి వెంకటలక్ష్మి,తండ్రి జయరామ్‌చంద్రారెడ్డి రోదించారు. ప్రమాదవార్త తెలియగానే పలాస నుంచి తల్లిదండ్రులు, హైదరాబాద్ నుంచి సోదరి సుధారాణి మామిడాడ చేరుకున్నారు. వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే బంధువులు, ఇరుగుపొరుగు వారు కంటతడి పెట్టారు. కాగా పలాసలో ఉంటున్న కొడుకు కోడలు, మనుమలతో వస్తాడనుకుంటే ఇంటికి శవమై వచ్చాడంటూ నారాయణరెడ్డి తండ్రి భోరున విలపించాడు. ప్రమాదవార్త తెలియగానే నారాయణరెడ్డి భార్య, పిల్లలు పలాస నుంచి మామిడాడ బయలు దేరారు.