
మూడు హెలికాప్టర్లతో ఆపరేషన్ శేషాచలం
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి ఏడు కొండల్లో ఒకటైన శేషాచలం మీద ఉన్న అడవుల్లో రేగిన కార్చిచ్చును చల్లార్చడానికి ఆపరేషన్ కొనసాగుతోంది. మూడు హెలికాప్టర్లతో మంటలు ఆర్పుతున్నారు. శేషాచలం కార్చిచ్చుపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. మంటలు మరింత వ్యాపించకుండా తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అటవీ అధికారులతో ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి సమీక్షించారు. మంటలార్పడానికి కందకాలు తవ్వాలని నిర్ణయించారు.
మరోవైపు మూడు హెలికాప్టర్లతో మంటలు ఆర్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కుమారధార, పసుపుధార డ్యాంల నుంచి హెలికాప్టర్ల ద్వారా పెద్ద పెద్ద కంటెయినర్లలో నీళ్లు తీసుకెళ్లి మంటల మీద చల్లుతూ వాటిని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు టీటీడీ సంయుక్తంగా కమిటీని ఏర్పాటు చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.