ఇల్లు చూపులకు వెళ్లి కానరాని లోకాలకు...
Published Sat, Aug 24 2013 4:12 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
టెక్కలి, శ్రీకాకుళం న్యూస్‌లైన్: శుభకార్యం కోసం ఇళ్లుచూపులకు వెళ్లిన ఆ కుటుంబం డ్రైవర్ మద్యం మత్తు, అతి వేగానికి బలైంది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొనడంతో వారికి తీవ్ర అన్యాయం జరిగింది. కోటబొమ్మాళి మండలం పొడుగుపాడు వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంలో ఆటోలో ఉన్న 16 మందిలో ముగ్గురు మృతి చెందగా, మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. వివాహ శుభకార్యంలో భాగంగా శ్రీకాకుళం మండలం భైరివానిపేటలోని వరుడి ఇల్లు చూపులకు వెళ్లిన కోటబొమ్మాళి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన వధువు కుటుంబ సభ్యులకు ఈప్రమాదం జరిగింది.
ఘటనలో అక్కడికక్కడే ఒకరు, శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మృతులు, క్షతగాత్రులంతా రామేశ్వరానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు, బంధువులు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆటో డ్రైవర్ మితిమీరిన వేగం, మద్యం సేవించడం ప్రమాదానికి కారణాలని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...
శ్రావణ శుక్రవారం మంచి రోజని...
శ్రావణ మాసం అందులోనూ శుక్రవారం కావడంతో మంచి రోజని భావించి ఇళ్లుచూపుల నిమిత్తం భైరివానిపేటలో ఉన్న వరుడు ఇంటికి రామేశ్వరం గ్రామానికి చెందిన బసవల చిన్నవాడు కుటుంబ సభ్యులు ఆటోలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మరో అర గంటలో ఇంటికి చేరుకునే లోపు ప్రమాదానికి గురయ్యారు. పొడుగుపాడు వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న లారీని, మృతుల కుటుంబీకులు ప్రయాణిస్తున్న ఆటో బలంగా ఢీకొట్టడంతో ముందు సీటులో కూర్చున్న విశ్రాంత ఇన్ చార్జి ఎంపీడీవో అయిన వెలమల ఫకీరు (62) అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. గాయపడిన 15 మందిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న ఐదుగురిని రిమ్స్‌కు తరలించారు. వీరిలో జలుమూరు దాలయ్య (65), జడ్డాడ తవిటమ్మ (50)లు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆటోడ్రైవర్ వాడాడ కాళిదాసు (28), బసవల సీతమ్మ, బసవల రత్నాలు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. డ్రైవర్ కాళిదాసు మృత్యువుతో పోరాడుతున్నాడు. మిగిలిన ఇద్దరి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ప్రమాద బాధితుల్లో నలుగురు కోటబొమ్మాళి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మరో నలుగురు చిన్నపాటి గాయాలతో స్వగ్రామమైన రామేశ్వరం చేరుకున్నారు.
ప్రాణాలు తీసిన మత్తు, అతివేగం
ఆటో డ్రైవర్ కాళిదాస్‌తో పాటు మరికొందరు కుటుంబీకులు బాగా మద్యం సేవించడంతోనే ఈప్రమాదం జరిగిందని తెలుస్తోంది. మద్యం మత్తుకు మితిమీరిన వేగం తోడుకావడంతో హైవేకు దూరంగానే నిలిపి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఉద్యమం కారణంగా బస్సులు అందుబాటులో లేకపోవడంతో వీరు ఆటోను ఆశ్రయించారు. ఈప్రమాదంతో అక్కడికక్కడే మృతిచెందిన రిటైర్డ్ ఉద్యోగి వెలమల ఫకీర్ కోటబొమ్మాళి, సారవకోట మండలాల్లో ఇన్‌చార్జి ఎంపీడీవోగా పనిచేశారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో బసవల కోదండరావు, బలగ సీతమ్మ, బసవ నీలమ్మ, పాపాల అప్పలరాజు, దండాసి వాల్మీకి, బంగారు బోడయ్య తదితరులున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే కొర్ల భారతి హుటాహుటిన ప్రమాద స్థలానికి వెళ్లి, తర్వాత రిమ్స్‌లో మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను పరిమర్శించారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఏఎంసీ చైర్మన్ దుబ్బ వెంకటరావు బాధితులను రిమ్స్‌లో ఓదార్చారు.
రోదనలతో నిండిన రిమ్స్
ప్రమాదం బారిన పడిన వారంతా ఒకే గ్రామానికి చెందడంతోపాటు, బంధువులు కావడంతో వీరికి సంబంధించినవారు ఆస్పత్రి వద్దకు చేరుకుని రోదించారు. బంధువుల, కుటంబీకుల రోదనలతో రిమ్స్‌లో విషాద చాయలు అలముకున్నాయి.
Advertisement
Advertisement