కొత్తగూడెం రూరల్, న్యూస్‌లైన్ : పొద్దంతా కష్టపడి పని చేసి.. సాయంత్రం సరదాగా స్నేహితులతో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరైన ముగ్గురు యువకులు.. తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడ్డారు. పాలవ్యాన్ రూపంలో వారిని మృత్యువు వెంటాడింది. వారిలో ఇద్దరు కొత్త అంజనాపురం గ్రామానికి చెందిన వారు కాగా, మరొకరు ఆ గ్రామానికి చుట్టపుచూపుగా వచ్చిన ఇల్లెందు మండలానికి చెందిన వ్యక్తి. వివరాలిలా ఉన్నాయి... కొత్త అంజనాపురం గ్రామానికి చెందిన కొందరు యువకులు గురువారం సాయంత్రం కొత్తగూడెంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు.
అక్కడ అందరితో కలిసి సరదాగా గడిపి.. అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి ఇంటికి పయనమమ్యారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఆటోను చుంచుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ వద్ద ఎదురుగా వస్తున్న పాలవ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అంజనాపురంలోని ఒకరి ఇంటికి బంధువుగా వచ్చిన ఇల్లెందు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పాయం రాము(35) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అంజనాపురానికి చెందిన ముక్తి కుమార్(19)ను కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి, అదే గ్రామానికి చెందిన జబ్బ నాగరాజు (24)ను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. గాయపడిన గణేష్, ఆదినారాయణ, వీరబాబు, భూపతి. కొండల్, సురేష్ కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శోకసంద్రంలో అంజనాపురం...
ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృత్యువాత పడడంతో కొత్త అంజనాపురం గ్రామం శోకసంద్రంలో మునిగింది. ఆర్తదానలు, ఆక్రందనలు మిన్నంటాయి. పెళ్లికి ఎంతో ఆనందంగా ఆటోలో వెళ్లిన వారు ఇలా విగతజీవులుగా మారడాన్ని వారి కుటుంబసభ్యులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు మృతదేహాలను చూసి వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చేతికందిన కొడుకులు కాటికి వెళ్లడంతో కుమార్, నాగరాజుల తల్లిదండ్రులు రోదనలను ఎవరూ ఆపలేకపోతున్నారు. గ్రామస్తులు, బంధువుల ఆర్తనాదాల మధ్య రెండు మృతదేహాలను శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా రాము మృతదేహాన్ని అతడి స్వగ్రామానికి తరలించారు.
విషాదం
Published Sat, Mar 8 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
Advertisement
Advertisement