ఆశయం తీరకుండానే.. అనంతలోకాలకు | Three people expired due to the current polls | Sakshi
Sakshi News home page

ఆశయం తీరకుండానే.. అనంతలోకాలకు

Published Mon, Aug 5 2013 4:06 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM

Three people expired due to the current polls

గట్టు, న్యూస్‌లైన్: నిత్యం మిణుకు మిణుకుమంటూ వెలిగే వి ద్యుత్ బల్బుల స్థానంలో కొత్తవాటిని అమర్చాల ని ఆ తండా యువకులు అధికారులకు నివేదించా రు. శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన వి ద్యుత్ స్తంభాలను మార్చాలని విన్నవించారు. అందులో భాగంగానే తండాకు స్తంభాలను తీసుకొస్తున్న క్రమంలో ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
 
 మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన శనివారం అర్ధరాత్రి  కేటీదొడ్డి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..ధరూర్ మండలం గువ్వలదిన్నె గ్రామపంచాయతీ పరిధిలోని తూర్పుతండాకు చెందిన ఆరుగురు గిరిజనులు విద్యుత్ స్తంభాల కోసం తమ ట్రాక్టర్‌లో గద్వాలకు వెళ్లారు.
 
 అర్ధరాత్రి అక్కడి డివిజన్ కార్యాలయంలో పదింటిని ట్రాక్టర్‌లో లోడు చేసుకుని తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలోని గట్టు మండలం కాలూర్‌తిమ్మన్‌దొడ్డి సమీపంలోకి చేరుకోగానే మధ్యటైరు పగిలిపోవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన గోతిలో పడిపోయింది. దీంతో ట్రాక్టర్‌పై ఉన్న చందూనాయక్ (20), హన్మంతునాయక్ (40), రవీంద్రనాయక్ (20) అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ రామునాయక్‌తో పాటు ముడావత్‌నాయక్, తిమ్మానాయక్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
 
 100 కాల్ సెంటర్‌తో వెలుగులోకి
 ఆ సమయంలో సహాయం కోసం క్షతగాత్రుల ఆర్తనాదాలు వినేవారే కరువయ్యారు. వారు వెంటనే 100కు కాల్ సెంటర్‌తో పాటు తమ బంధువులకు ఫోన్ చేశారు. దీంతో జిల్లా కేంద్రంలోని సిబ్బంది గట్టు పోలీసులను అప్రమత్తం చేశారు. ఎట్టకేలకు ఆదివారం తెల్లవారుజామున సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గద్వాల ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
 
 ఈ మేరకు సీఐ షాకీర్‌హుస్సేన్, ఏఎస్‌ఐ జయరాములు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుల్లో హన్మంత్ నాయక్‌కు భార్య రంగమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మిగతా ఇద్దరు అవివాహిత యువకులు. ఈ సంఘటనతో తూర్పుతండాలో విషాదఛాయలు అలముకున్నాయి. హన్మంతునాయక్ అన్న కుమారుడు చందూనాయక్. ప్రమాదంలో ఇద్దరూ మృత్యువాతపడటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. తండాలో ఏ సమస్య వచ్చినా ముందుండే యువకులు ఇలా మృత్యువాతపడటం చూసి గుండెలు బాదుకుంటున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement