‘భయ్..ఏమైంది. బదిలీ తెల్సిందా...నాకు పోస్టింగ్ ఇంకా చెప్పలే’ ఇదీ ఏ ఇద్దరు అధికారులు బయటో, ఫోన్లలోనో తారసపడుతూ చర్చించుకుంటున్న మాటలు. ఒత్తిడితో రాజధానిలో మకాం వేసి ఎటూ తేలక రాత్రికి ఇంటికి చేరుతున్న వైనం. ఎన్నికల వేళ స్థానచలనాలకు పచ్చజెండా ఊగడంతో ఎవరికి వారు సత్తా చాటుకొని కొలువులకోసం కసరత్తు చేస్తున్నారు. రాజకీయ హస్తాలు వెనకుండీ కథను నడుపుతుంటే ఉన్నతాధికారులు సైతం పాత్ర పోషణ చేస్తున్నారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఎన్నికల బదిలీలకు సంబంధించి ఎవరికి వారే తమ పైరవీలను కొనసాగిస్తుండడంతో రాష్ట్ర రాజధానిలో ఉత్కంఠ సాగుతోంది. ఈ కారణంగా శుక్రవారం రాత్రి వరకు ఎవర్ని ఏ జిల్లాలకు కేటాయించాలో తెలీక హైద్రాబాద్‌లోని ఉన్నతాధికారులే పరేషాన్‌లో పడ్డారు.
పైరవీల పరాకాష్టే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు అంతర్ జిల్లాకు చెందిన కేవలం 8మంది అధికారులను మాత్రమే ఇక్కడికి కేటాయించారు. వీరు డీటీల నుంచి తహశీల్దార్లుగా పదోన్నతులు పొందిన వారు కావడంతో ముందుగా ప్రకటించారు. వీరికి తప్పా, మిగిలిన వారిలో ఏఒక్కర్నీ పంపలేకపోతున్నారు. ఇక ఎన్నికల కమిషన్ విధించిన గడువుకు రెండు రోజులే ఉండడంతో బదిలీల పక్రియ ఎటూ తేలకపోవడంతో అధికారుల్లో, టెన్షన్ పెరిగిపోతోంది.
దీంతో రోజూ ఉదయం హైద్రాబాద్ వెళ్లి సాయంత్రానికి తిరిగి వస్తున్నారు. మరోవైపు మండల స్థాయి అధికారులు తమ పలుకుబడిని గట్టిగా నిరూపించుకుంటున్నారు. ఈ ప్రభావం పాలనపై పడుతోంది. వివిధ పనులపై కార్యాలయాలకు వచ్చేవారు ఉస్సూరంటూ వెనక్కు వెళ్తున్నారు. జిల్లాకు సంబంధించి 49మంది తహశీల్దార్లు, ఇద్దరు ఆర్డీఓల జాబితాను అధికారులు ఇది వరకే సిద్దం చేశారు. ఇక అక్కడ్నుంచి ఇదే సంఖ్య రావాల్సి ఉండగా, రోజు రోజుకు మారిపోతోన్నట్లు సమాచారం, చివరకు ఎంతమందికి అవకాశం కల్పిస్తారనేది ప్రస్తుతం అయోమయంగా మారింది.
మున్సిపల్ కమీషనర్‌కు ఝలక్.......
పట్టణ మున్సిపాలిటీకి కమిషనర్‌గా తాండూర్ నుంచి రమణాచారి ఇక్కడికి రాకముందే ఒక్కరోజులోనే మన నేతలు ఝలక్ ఇచ్చారు. గురువారం బదిలీ ఉత్తర్వులు రాగా, శుక్రవారం దాన్ని నిలిపేస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డా.ఎస్‌కె జోషి జిఓ అర్టీ నెం.200ను జారీ చేశారు. దీంతో ఇక్కడికి వస్తానని భావించిన కమిషనర్ పాలమూరు రాజకీయాలను చూసి షాక్‌కు గురయ్యారు.
ఆయన తన ధోరణిలో వెళ్లే అధికారని తెలియడంతో ఎన్నికల సమయంలో అలాంటి అధికారితో తలనొప్పులు వస్తాయని పసిగట్టిన ఇక్కడి నేతలు ఆయనకు మోకాలడ్డినట్లు తెలుస్తోంది. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే సైతం అధికార పార్టీ నేతలకు మద్దతు ఇచ్చి బదిలీకి బ్రేక్ వేసినట్లు సమాచారం. దీంతో ఈ మున్సిపాలిటీ ఇన్‌చార్జి పాలనలోనే కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి.
సస్పెన్స్...థ్రిల్లర్..!
Published Sat, Feb 8 2014 3:05 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement