ఉత్కంఠకు తెర!
{పశాంతంగా ముగిసిన మావోయిస్టు వారోత్సవాలు
ఏవోబీలో భారీ స్తూపాల ఆవిష్కరణ
పెద్దఎత్తున జన సమీకరణ
విధ్వంసాలు జరగకుండా నిలువరించిన పోలీసులు
పెదబయలు/ముంచంగిపుట్టు: మన్యంలో వారం రోజుల పాటు ఉత్కంఠ వాతావరంతో గడిచింది. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించారు. వీటిని నిలువరించేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. మరో పక్క ఉత్సవాలను ఏ విధం గా నైనా విజయవంతంగా నిర్వహించాలని మవోయిస్టులు ప్రతిష్ఠగా తీసుకోవడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఏజెన్సీ వాసులు భయాందళనతో గడిపారు. అయితే వారోత్సవాలు ప్రశంతంగా ముగియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గత ఏడాది మా వోలు కోరుకొండ ఏరియా కమిటి, ఈస్టు డివిజన్ కమిటీల ఆధ్వర్యంలో మావోలు వారోత్సవాలు నిర్వహిస్తే ఈ సారి పెదబయలు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోలీసుల వ్యూహాలను తిప్పికొడుతూ ఏవోబీలో పెద్దఎత్తున గిరిజనులకు సమీకరించి వారోత్సవాలు ఘనంగా నిర్విహ ంచారు. మన్యంలో మారుమూల గ్రామాల్లో ఏవోబీ సరిహద్దు గ్రామాల్లో బాక్సైట్ వ్యతిరేక కమిటీల ఎన్నిక జరిగినట్లు సమాచారం.
మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వాలు ఎందుకు దృష్టి సారించడం లేదని, మన్యంలో ఏటా ప్రాణాంతక వ్యాధులతో మృత్యువాత పడుతుంటే శాశ్వత చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, ఏటా ఎపిడమిక్ పేరిట మూడు నెలల పాటు వైద్యం అంటూ హైడ్రామ నడిపి తరువాత వదిలేస్తున్నారని ప్రజల్లో ప్రశ్నలు రేకెత్తించారు. అలాగే ప్రజా డాక్టర్, ప్రజా వైద్యం పేరుతో గ్రామాల్లో చదువుకుని ఉన్న యువతకు చిన్న చిన్న వ్యాధులకు సంబందించి శిక్షణ ఇచ్చి వారి గ్రామాల్లో జ్వరాలు వస్తే వైద్యం అందించే ప్రయత్నం చేసి మావోలు గిరిజనులకు చేరువయ్యారు. అలాగే పోలీసులురోడ్డు ప్రాంతాల్లో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎలాంటి విధ్వంసాలు జరక్కుండా నిలువరించగలిగారు.
పాడేరులో..
పాడేరు: విశాఖ మన్యంలోని ఏఓబీ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. వారం రోజులపాటు మావోయిస్టులు వ్యూహాత్మకంగా సంస్మరణ వారోత్సవాలను విజయవంతంగా జరుపుకున్నారు. పలు గ్రామాల నుంచి గిరిజనులు ర్యాలీలుగా సంస్మరణ వారోత్సవాలకు తరలి వెళ్లారు. ఏఓబీలో దట్టమైన అటవీ ప్రాంతాల్లో పలుచోట్ల స్తూపావిష్కరణలను చేసి మావోయిస్టుల అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు గిరిజనుల్లో చైతన్యం నింపారు. గ్రామాల్లో పోలీసు ఇన్‌ఫార్మర్లకు మావోయిస్టులు హెచ్చరికలు చేసినట్లు తెలిసింది. ఏఓబీలో పోలీసు యంత్రాంగం మొహరించి విస్తృతంగా కూంబింగ్ నిర్వహించినప్పటికీ మావోయిస్టులు సంస్మరణ వారోత్సవాలను విజయవంతం చేసుకోవడం విశేషం.