
విశాఖ సాగరతీరంలో తూర్పు నౌకాదళం తన విన్యాసాలను ప్రదర్శించి శత్రు దేశాలకు తన సత్తా ఏపాటిదో చాటి చెప్పింది. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌ను చిత్తు చేసి భారత్ విజయబావుటాను ఎగురవేసిన సందర్భంగా ఏటా డిసెంబర్ 4న నేవీ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా సోమవారం సాయంత్రం విశాఖలోని రామకృష్ణా బీచ్‌లో పలు యుద్ధ విన్యాసాలు చేశారు. వీటిని ఎంతోమంది తిలకించారు.సముద్రంలో చిక్కుకున్న వారిని రక్షించడం, నావికులను సాగరంలో ఒక చోట నుంచి మరో చోటకు తరలించడం వంటివి ప్రదర్శించారు.
గంటకు ఆరు వేల కి.మీ. వేగంతో దూసుకెళ్లే మిగ్ విమానాలు భూమికి అతి సమీపంనుంచే గాల్లో తల్లకిందులుగా చక్కర్లు కొడుతూ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. శత్రు దేశం సముద్రంలో రహస్యంగా ఉంచిన ఆయిల్ రిగ్గు పేల్చివేత, మెరైన్ కమెండోల సాహసకృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇంకా డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హాక్స్ శ్రేణి హెలికాప్టర్లు తమ ప్రతిభను ప్రదర్శించాయి. సూర్యాస్తమయం అయ్యాక యుద్ధ నౌకలు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతూ కనువిందు చేశాయి.
– సాక్షి, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment