సాక్షి, మచిలీపట్నం: గత ఎన్నికల్లో పార్టీకి కంచుకోటగా నిలిచిన నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లా పాత్ర కీలకం కానుంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 16 నియోజకవర్గాల్లో 11నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరాలు చేయగా.. మరో 5 నియోజకవర్గాల్లో ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇది వరకు ఉన్న వారిని పక్కన బెట్టి కొత్త వారికి అవాకాశం కల్పించే దిశగా సీఎం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల్లో అసమ్మతిని రాజేస్తోంది.
నూజివీడులో నయా రాజకీయం!
నూజివీడు నియోజకవర్గంలో రాజకీయం రంజుగా మారింది. 2014 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన ముద్దర బోయిన వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ప్రస్తుతం అతన్ని పక్కన బెట్టి కమ్మ సామాజిక వార్గనికి చెందిన అట్లూరి రమేష్‌కు టికెట్ ఇవ్వాలని అధినేత యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ముద్దరబోయిన వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉంది. ఆది నుంచి పార్టీ కోసం పనిచేసినా తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఆఖరికి ఎమ్మెల్యే స్థానం కేటాయించకపోవడంపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పంచాయతీ సీఎం వద్దకు వెళ్లినా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలిసింది. దీనికి తోడు తాజాగా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పేరు సైతం ప్రస్తావనకు వస్తోంది. ఇందుకు అధిష్టానం ఆదేశిస్తే తాను నూజివీడు నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కొన్ని రోజులు క్రితం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బచ్చుల స్పష్టం చేయడం బలాన్ని చేకూరుస్తోంది.
కాగితకు చెక్!
పెడన ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేసే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం సిటింగ్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావుకు ఆరోగ్యం సహకరించడం లేదన్న సాకుతో పక్కన పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై చర్చించేందుకు కాగిత ఆదివారం సీఎం అపాయింట్‌మెంట్ కోరగా.. తిరస్కరించినట్లు తెలిసింది. దీనికి తోడు సుజనా చౌదరి సైతం ఆరోగ్యం బాగాలేదు కదా.. తర్వాత మట్లాడుదాంలే అన్న ఉచిత సలహా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో కాగిత వర్గంలో అయోమయం నెలకొంది. దీనికి తోడు ప్రస్తుతం ముడా చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బూరగడ్డ వేదవ్యాస్ సైతం పెడన అభ్యర్థిగా బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నారు. ఇందులో భాగంగానే గత కొన్ని నెలలుగా నియోజకవర్గంలో పర్యటనలు, పరామర్శలు, పార్టీ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. వ్యాస్ తనయుడికి నారా లోకేష్ అత్యంత సన్నిహితుడు కావడంతో ఆ దిశగా పావులు కదుపుతున్నారు.
కొనకళ్లకు దక్కేనా?
బందరు ఎంపీగా వ్యవహరిస్తున్న కొనకళ్ల నారాయణరావుకు పెడన ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఖరారైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఎంపీగా తాము పోటీ చేసి గెలవలేమని.. ఇప్పటికే సీఎంకు స్పష్టం చేశారని, ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని సీఎం ఎదుట వాపోయినట్లు తెలిసింది. దీంతో చేసేది లేక పెడన స్థానానికి ఎన్నిక చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ బాడుగు రామకృష్ణ కుమార్తె బాడుగ శ్రీదేవికి మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దించాలనే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు సమచారం. కాగా తాజాగా మరో వాదన తెరపైకి వస్తోంది. ఇటీవల టీడీపీలోకి చేరిన వంగవీటి రాధాకు బందరు పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో టీడీపీలో అసమ్మతి వర్గాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
కల్పనకు కలేనా?
పామర్రు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ స్థానంలో గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ఉప్పులేటి కల్పన నైతిక విలువలను మంట గలిపి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సిటింగ్ ఎమ్మెల్యేపై తన సామాజిక వార్గనికి చెందిన నాయకులే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కల్పనకు టికెట్ కేటాయిస్తే తాము ఒప్పుకొమని కొందరు.. కల్పనకే టికెట్ కేటాయించిచాలని మరో వర్గం పట్టుబడుతోంది. ఈ పంచాయతీ ఇటీవల సీఎం వద్దకు చేరింది. వెరసి పామర్రు నియోజకవర్గం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక తికమక పడుతున్నట్లు సమాచారం. పామర్రు స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ ఆశిస్తున్నారు. కొంతకాలంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తనకే టికెట్ దక్కుతుందన్న ధీమాతో సైతం ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కొత్తగా మరో అభ్యర్థి తెరపైకి వచ్చారు. సీఎం చంద్రబాబు తనకు టికెట్ ఇచ్చినట్లు ఊడిగ శ్రీనివాస్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ స్పష్టం చేశారు. దీంతో టికెట్ ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment