ఆ కుర్చీకి యమక్రేజ్
Published Fri, Jul 8 2016 12:59 PM | Last Updated on Tue, Sep 18 2018 8:19 PM
తిరుపతిలో పోస్టల్ ఎస్పీ కుర్చీ కోసం పోటాపోటీ!
తీవ్రంగా పోటీ పడుతున్న ముగ్గురు ఎస్పీలు
తిరుపతిలోని తపాలాశాఖ సూపరింటెండెంట్ (పోస్టల్ ఎస్పీ) పోస్టుకు యమక్రేజ్ నెలకొంది. మొదలే ఆధ్యాత్మిక నగరం.. రాజకీయాలూ తక్కువే..అబ్బో..! ప్రశాంతంగా పనిచేసుకోవచ్చన్న ఉద్దేశంతో.. ఈ కుర్చీ దక్కించుకునేందుకు ముగ్గురు ఎస్పీలు తీవ్రంగా పోటీపడుతున్నట్టు సమాచారం.
తిరుపతి అర్బన్ : తిరుపతి తపాలా డివిజన్‌కు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న టీఏ.వెంకటశర్మను వారం రోజుల క్రితం ఒంగోలుకు బదిలీ చేశారు. ప్రస్తుత ఆర్‌ఎంఎస్ సూపరింటెండెంట్ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఈ కుర్చీ దక్కించుకునేందుకు ఇతర జిల్లాల్లోని సూపరింటెండెంట్లు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఎలాగైనా తిరుపతిలో పోస్టింగ్ వేయించుకునేందుకు విభిన్న లాబీయింగ్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో అనంతపురం పోస్టల్ ఎస్పీ శ్రీనివాస్, కాకినాడ పోస్టల్ ఎస్పీ శ్రీకుమార్‌తో పాటు నాలుగేళ్ల క్రితం సస్పెండ్ అయి ప్రస్తుతం పోస్టింగ్ పొందిన మరో సూపరింటెండెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా రీజనల్ కేంద్రమైన కర్నూలు, ఉమ్మడి సర్కిల్ కేంద్రమైన హైదరాబాద్‌లో ముగ్గురు అధికారులు తమదైన ప్రయత్నాలను ప్రారంభించినట్టు సమాచారం. ఇటీవల హైదరాబాద్ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్‌గా పనిచేసి ఢిల్లీకి బదిలీ అయిన మరో ఉన్నతాధికారి సిఫార్సుతో తిరుపతి కుర్చీని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేగాక ఢిల్లీస్థాయి ఉన్నతాధికారి సహాయంతో ఇప్పటికే ఇద్దరు సూపరింటెండెంట్లు కేంద్ర సమాచారశాఖ కార్యదర్శిని సంప్రదించి తమ వినతులను అందజేసినట్టు సమాచారం.
ఓ వైపు తపాలా శాఖలోని ఢిల్లీస్థాయి అత్యున్నతాధికారుల ప్రసన్నంతో పాటు మరోవైపు ఎవరి స్థాయిలో వారు ముడుపులు చెల్లించి తిరుపతిలో పోస్టింగ్ వేయించుకునేందుకు సన్నాహాలు ప్రారంభించినట్టు పోస్టల్ వర్గాల భోగట్టా. ఇందులో సుమారు రూ.25 లక్షల వరకైనా ముడుపులు చెల్లించి తిరుపతి ఎస్పీ కుర్చీని దక్కించుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. దీంతోపాటు రెండు ప్రధాన పార్టీల మంత్రులతో కూడా సిఫార్సు చేయించేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
ముగ్గురూ పాతవారే
తిరుపతి పోస్టల్ ఎస్పీ కుర్చీ కోసం పోటీపడుతున్న ముగ్గురు సూపరింటెండెంట్లు తిరుపతి డివిజన్ కార్యాలయానికి పాతవారే. ఇద్దరు ఏఎస్పీలుగా పనిచేసి పదోన్నతిపై అనంతపురం, కాకినాడకు వెళ్లగా మరో అధికారి తిరుపతిలోనే సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ ఫిర్యాదులపై సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత నాలుగేళ్ల నుంచి రెండు సార్లు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌లు, తాజాగా ఒంగోలుకు బదిలీ అయిన సూపరింటెండెంట్ రెండున్నరేళ్లు ఎస్పీగా పనిచేశారు. వారు ముగ్గురూ ఆయా కేంద్రాల్లో పనిచేస్తూ తిరుపతిపై కన్నేసి ఉంచారు. అయితే వారి నిరీక్షణ తాజా ఎస్పీ బదిలీతో కొంతమేరకు ఫలించినట్లవుతోంది.
Advertisement
Advertisement