బాబోయ్ టిమ్ | Tim WonderGeneration | Sakshi
Sakshi News home page

బాబోయ్ టిమ్

Published Tue, Feb 10 2015 5:30 AM | Last Updated on Wed, Sep 5 2018 3:24 PM

Tim WonderGeneration

  • రెండు డ్యూటీలు చేయలేమంటున్న డ్రైవర్లు
  • భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు
  • చట్టవిరుద్ధమంటున్న కార్మిక నేతలు
  • ఆందోళనలో డ్రైవర్లు, కండక్టర్లు
  • నెల్లూరు (రవాణా): సంక్షేమ పథకాల్లో కోతలు పెడుతూ భారం తగ్గించుకుంటున్న రాష్ట్రప్రభుత్వం తాజాగా ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన బాబు ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను ఏవిధంగా తొలగించాలన్న దానిపై కసరత్తు ప్రారంభించినట్లు కనిపిస్తోంది.

    తాజాగా రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లుకు కండక్టర్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఎంఎస్ జీఓనం. 8     విడుదల చేసింది. దీంతో డ్రైవర్లు, కండక్టర్ల నోట్లో పచ్చి వెలక్కాయపడినట్లైంది. టిమ్ డ్యూటీలు చేయలేమంటూ డ్రైవర్లు ఇప్పటికే అందోళన చేస్తుంటే తాజా జీఓతో ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 160 బస్సులకు పైగా టిమ్ సర్వీస్‌లు నడుస్తున్నాయి. కండక్టర్లుగా 5 ఏళ్ల క్రితం రిక్రూట్ చేసుకున్న వారిలో నేటికి ఉద్యోగాలు లభించలేదు. వారిని ఇప్పటికి లూప్‌లైన్‌లోనే ఉంచింది. తాజా ప్రభుత్వ ఉత్తర్వులపై ఆర్టీసీ ఉద్యోగులు మండిపడుతున్నారు.
     
    1,500 టిక్కెట్లు తగ్గకూడదు..


    జిల్లాలోని ఆయా డిపోల్లో దాదాపు 793 బస్సులు తిరుగుతున్నాయి. వాటిలో 108 బస్సులను అద్దె ప్రాతిపాదికన తిప్పుతున్నారు. వీటికి సంబంధించి 1,920 మంది డ్రైవర్లు, 1,565 మంది కండక్టర్లు పనిచేస్తున్నారు. అద్దె బస్సులు పోను మిగిలిన 685 బస్సులకు గాను 160 బస్సులకుపైగా టిమ్(టిక్కెట్ ఇష్యూ మిషన్) సర్వీసులుగా నడుపుతున్నారు. వాటిలో పగలు 60, రాత్రి సమయాల్లో 100 బస్సులు తిప్పుతున్నారు.

    టిమ్ సర్వీసులో పనిచేస్తున్న డ్రైవర్లకు నెలకు 1,500 టిక్కెట్లకు తగ్గకుండా ఉండాలని షరతు విధించారు. ఇందుకుగాను టిక్కెట్‌కు రూ. 2 కమీషన్‌ను యాజమాన్యం ప్రకటించింది. డ్రైవరే కండక్టర్ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి స్టేజి దగ్గర టిక్కెట్లు కొట్టిన తర్వాతే బస్సును నడపాలి. ప్రస్తుతం నెల్లూరు నుంచి తిరుపతి, బెంగళూరు, విజయవాడ, చైన్నై తదితర ప్రాంతాలకు టిమ్ పద్ధతిలోనే అధికారులు బస్సు సర్వీసులు నడుపుతున్నారు. హైదరాబాద్, వైజాగ్ ప్రాంతాలకు మాత్రం డ్రైవర్లు, కండక్టర్లను పంపుతున్నారు.
     
    టిమ్‌తో ఇబ్బందులు...

    టిమ్ సర్వీస్‌తో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని డ్రైవర్లు వాపోతున్నారు. బస్టాండ్‌లో నిలిపి టిక్కెట్ కొట్టడం వల్ల ప్రయాణానికి ఆలస్యమవుతుంది. టిక్కెట్ మరిచిపోతే ఉద్యోగం ఎక్కడ పోతుందోనన్న ఆందోళన ఉంటుందంటున్నారు. ప్రయాణికుడు టిక్కెట్ తీసుకోకపోయిన డ్రైవర్‌పై క్రమశిక్షణ చర్యలు తప్పవు. బస్సు ఎక్కడైనా మరమ్మతులకు గురైనా, పంక్చర్ పడ్డా డ్రైవర్ ఒక్కరే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. టిమ్ సర్వీసుతో డ్రైవింగ్‌పై ఏకాగ్రత కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రతకు గ్యారెంటీ ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కండక్టర్లు నిరుద్యోగులుగా మిగులుతారన్నారు. బస్సులో డ్రైవరు ఒక్కరే ఉండటం వల్ల లగేజి ఏమి వేస్తున్నారో చూసుకోవడం కష్టమని చెబుతున్నారు. ఇటీవల కాలంలో బస్సుల్లో పేలుడు పదార్థాలు, ఎలక్ట్రానిక్స్ గూడ్సు వంటి వాటిని సరఫరా చేస్తున్నారు. తనిఖీల్లో పట్టుబడితే డ్రైవర్‌ను బాధ్యుడ్ని చేసి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని వాపోతున్నారు.
     
    టిమ్ సర్వీస్‌ల కోసం ప్రత్యేక జీఓ


    ఆర్టీసీలో టిమ్ సర్వీస్‌లు ఎక్కువ మొత్తంలో తిప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓనం.8 విడుదల చేసింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం 72వ నిబంధనను మార్చుతూ 72ఏ కొత్త నిబంధనను ప్రవేశపెట్టారు. ఈ జీఓ ప్రకారం డ్రైవర్‌కు కండక్టర్ లెసైన్స్ లేకపోయిన 7వ తరగతి చదివి ఉంటే టిమ్ ద్వారా టిక్కెట్లు జారీ చేయవచ్చని పేర్కొన్నారు. సంబంధింత డ్రైవర్‌కు గుర్తింపుపొందిన సంస్థలో 3 రోజుల పాటు శిక్షణ పొందితే టిమ్ సర్వీస్‌కు అర్హత పొందవచ్చని తెలిపారు. టిమ్ సర్వీస్‌పై ఇప్పటికే పలువురు డ్రైవర్లు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం డ్రైవర్ కండక్టర్ విధులు నిర్వహించకూడదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం అప్పీలు చేసింది.
     
    రిక్రూట్ అయినా ఉద్యోగాలు నిల్...

    ఆర్టీసీ 2009లో జిల్లాలో 250 మందిని కండక్టర్ పోస్టు కోసం సెలెక్ట్ చేసింది. అయితే 2014లో 100 మందికి మాత్రమే ఉద్యోగావకాశం కల్పించారు. వారిలో కూడా అన్ సీజన్ పేరుతో ఈఏడాది ఆగస్టులో 62 మందిని విధుల నుంచి తొలగించారు. రాష్ట్రప్రభుత్వం భవిష్యత్తులో బస్సులకు కండక్టర్లు ఉండకూడదన్న ఉద్దేశంతోనే ప్రత్యేక జీవో జారీచేసింది. మోటారు వాహనాల చట్టానికి విరుద్ధంగా జీఓ ఉందని పలువురు యూనియన్ నేతలు చెబుతున్నారు. జీఓ విషయంపై ఆర్టీసీ ఆర్‌ఎం రవికుమార్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు.
     
    చట్టవ్యతిరేకం: నారాయణ, ఈయూ ప్రధానకార్యదర్శి, నెల్లూరు
     టిమ్ డ్యూటీలు చేయించడం చట్టవిరుద్ధం. ఈ విషయంపై గతంలో ఆందోళనలు చేపట్టాం. డ్రైవర్లు రెండు రకాలు విధులు నిర్వహించడం ఒత్తిడితో కూడుకున్న పని. మానసిక ప్రశాంతత కోల్పోయి తప్పులు చేసే అవకాశం ఉంది.

    ఉద్యమాలు చేస్తాం :  రామంజులు, ఎన్‌ఎంయూ అధ్యక్షుడు, నెల్లూరు
    టిమ్ సర్వీసుల విషయం కోర్టులో నడుస్తుంది. డ్రైవర్ రెండు రకాల విధులు నిర్వహించకూడదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా ప్రభుత్వం మనసు మార్చుకోలేదు. ఈ విషయంపై ఉద్యమాలు నిర్వహించి టిమ్ సర్వీసులు రద్దుచేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement