labor leaders
-
డ్యూటీ వెసులుబాట్లపై వేటు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెతో కార్మిక సంఘాల నేతలపై రగిలిపోతున్న అధికారులు వారికున్న వెసులుబాట్లపై వేటు వేస్తున్నారు. గుర్తింపు కార్మిక సం ఘం నేతలకు ప్రత్యేక రిలీఫ్‌లు పొందే వెసులుబాటు ఉంది. రిలీఫ్ అంటే.. వారు విధులకు హాజరు కావాల్సిన పనిలేదు. హాజరుపట్టికలో సంతకం చేస్తే చాలు వేతనం అందుతుంది. ఇలాంటి వాటిని తొలగించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. వాటికి సంబంధించిన వారందరికీ, ఆయా వెసులుబాట్లు తొలగిస్తున్నట్లు అధికారులు 300 మందికి శ్రీముఖాలు పంపినట్లు తెలిసింది. గత కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ విజయం సాధించింది. దీంతో ఈ సంఘం గుర్తింపు సంఘంగా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర నేతల్లో 20 మందికి పూర్తి రిలీఫ్‌లు ఉంటాయి. వీరు ఒక్క రోజు కూడా విధులకు హాజరు కావాల్సిన పనిలేదు. ఇక ప్రతి డిపో కార్యదర్శికి యూనియన్ రిలీఫ్ పేరుతో వారానికి ఒక రోజు, రీజినల్ కార్యదర్శికి వారానికి ఒక రోజు ఉంటుంది. గుర్తింపు సంఘానికి సంబంధించి తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో పర్యవేక్షణకు నిత్యం ఆఫ్ డే రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటిని రద్దు చేస్తున్నట్లు అధికారులు వారికి పంపిన నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. మీడియాపై ఆంక్షలు.. బస్‌భవన్‌లోకి మీడియా ప్రతినిధులు రాకుండా అనధికార ఆంక్షలు విధించారు. విలేకరులను లోనికి రానీయవద్దని అధికారులు ఆదేశించారని ప్రధాన గేటు వద్ద ఉండే సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. రూ.3 వేల కోట్లివ్వండి.. ఆర్టీసీకి వన్‌టైం సెటిల్మెంట్ కింద రూ.3 వేల కోట్లు ఇస్తే సమస్యలన్నీ పోతాయని, భవిష్యత్‌లో నష్టాల మాట లేకుండా సంస్థ నడుస్తుందని కార్మిక సంఘం సీనియర్ నేత, ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు అన్నారు. ఈ దిశగా ఆలోచించాలని కోరుతూ సీఎం కార్యాలయానికి కూడా లేఖ రాసినట్టు తెలిపారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ఆదివారం మానవహారాలు నిర్వహించనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్‌కు, చనిపోయిన ఆర్టీసీ కార్మికులకు నివాళులర్పించి అన్ని డిపోల పరిధిలో మానవహారాలు నిర్వహించాలని శనివారం జరిగిన సమావేశంలో జేఏసీ నిర్ణయించింది. -
వృద్ధికి ఊతమిచ్చే చర్యలు అవసరం...
- మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలి - బీ20-ఎల్20 సంయుక్త తీర్మానం అంకారా (టర్కీ): వృద్ధికి ఊతమిచ్చే చర్యల అమలుకు పూర్తి సామర్థ్యం మేర పనిచేయాలని, మరిన్ని ఉద్యోగావకాశాల కల్పనపై దృష్టి పెట్టాలని భారత్ సహా జీ20 కూటమి సభ్య దేశాలకు అంతర్జాతీయ వ్యాపార, కార్మిక నేతలు సూచించారు. అలాగే 2025 నాటికి ఉద్యోగాల్లో మహిళలు, పురుషుల మధ్య వ్యత్యాసాన్ని 25 శాతం మేర తగ్గించాలని పేర్కొన్నారు. జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, గవర్నర్ల సదస్సు సందర్భంగా భేటీ అయిన అంతర్జాతీయ వ్యాపార, కార్మిక నేతల బృందాలు ఈ మేరకు బిజినెస్20-లేబర్ 20 సంయుక్త తీర్మానాన్ని విడుదల చేశాయి. ‘ఉద్యోగాలు, వృద్ధి, గౌరవప్రదమైన పని’ పేరిట రూపొందించిన అంకారా తీర్మానంలో.. వృద్ధికి, మరింత మందికి ఉపాధి కల్పించేందుకు, పనిచేసే చోట పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఈ మూడూ కీలకమని పేర్కొన్నాయి. కార్మిక రంగానికి సంబంధించి గతసంయుక్త తీర్మానాల అమలు పురోగతి అంతంత మాత్రంగానే ఉందని డిక్లరేషన్ పేర్కొంది. యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్మాణాత్మక చర్యలు అవసరమని పేర్కొంది. -
కార్మిక నేతలతో ప్రధాని చాయ్ పే చర్చ
న్యూఢిల్లీ: 46వ భారత కార్మిక సదస్సు(ఐఎల్సీ) సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర కార్మిక సంఘ నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. కార్మిక చట్టాలు, ప్రభుత్వ ఆర్థిక విధానాలపై వారి అభిప్రాయాలను విన్నారు. భేటీ అనంతరం.. తమ డిమాండ్లకు సంబంధించి ప్రధాని నుంచి తమకెలాంటి హామీ లభించనందున, సెప్టెంబర్ 2న తాము తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె విషయంలో వెనక్కు తగ్గకూడదని నిర్ణయించినట్లు కార్మికసంఘాల నేతలు తెలిపారు. వీరితో చర్చలు జరిపేందుకు మోదీ మంత్రుల బృందా న్ని ఏర్పాటు చేశారు. కార్మిక నేతలతో మోదీ జరిపిన తేనీటి భేటీలో ఆ బృందం సభ్యులైన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్, పీఎంఓ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ హాజరయ్యారు. ‘మేం చెప్పిందంతా విన్నారు. ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నారని మేం వారికి స్పష్టంగా చెప్పాం. ఏ విషయంలోనూ మాకెలాంటి హామీ ఇవ్వలేదు. అందుకే సమ్మె విషయంలో ముందుకే వెళ్లాలని నిర్ణయించాం. ఈ విషయంలో కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా ఉన్నాయి’ అని ప్రధానితో భేటీ అనంతరం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి గురుదాస్ దాస్‌గుప్తా స్పష్టం చేశారు. ఈ భేటీలో సీఐటీ యూ, బీఎంఎస్, ఐఎన్టీయూసీ, హెచ్ఎం ఎస్ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ఐఎల్సీని సోమవారం మోదీ ప్రారంభిస్తారు. చర్చలు అసంపూర్ణం: ఆ తరువాత కేంద్ర కార్మిక సంఘాల నేతలు, కేంద్ర మంత్రుల బృందం మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. కాంట్రాక్ట్ కార్మికులు, కనీస వేతనం అంశాలు మినహా మిగిలిన అంశాలైన కార్మిక సంఘాల గుర్తింపు, బోనస్ చట్ట సవరణ, కార్మికులకు మరిన్ని సామాజిక భద్రత పథకాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైందని ప్రభుత్వం పేర్కొనగా.. ఏ అంశంపైనా ఏకాభిప్రాయం కుదరలేదని ఏఐటీయూసీ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 2న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెపై వెనక్కు తగ్గలేదని తేల్చి చెప్పింది. ప్రధానమంత్రి మోదీతో కార్మిక సంఘాల తేనీటి భేటీ అనంతరం.. ఆదివారం కార్మిక సంఘాల ప్రతినిధులతో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, జితేంద్రసింగ్ పలు వివాదాస్పద అంశాలపై దాదాపు 3 గంటలపాటు చర్చలు జరిపారు. అనంతరం బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులు, కనీస వేతనం అంశాలకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయన్నారు. బోనస్ చట్టం, కార్మికుల సామాజిక భద్రతకు సంబంధించిన అంశాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు. భేటీలో ఆర్థికమంత్రి జైట్లీ సూచనలకు, పలు సమస్యలకు ఆయన చూపిన పరిష్కార మార్గాలకు కార్మిక సంఘాల నేతల నుంచి సానుకూలత వ్యక్తమైందన్నారు. -
బాబోయ్ టిమ్
రెండు డ్యూటీలు చేయలేమంటున్న డ్రైవర్లు భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు చట్టవిరుద్ధమంటున్న కార్మిక నేతలు ఆందోళనలో డ్రైవర్లు, కండక్టర్లు నెల్లూరు (రవాణా): సంక్షేమ పథకాల్లో కోతలు పెడుతూ భారం తగ్గించుకుంటున్న రాష్ట్రప్రభుత్వం తాజాగా ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన బాబు ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను ఏవిధంగా తొలగించాలన్న దానిపై కసరత్తు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. తాజాగా రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లుకు కండక్టర్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఎంఎస్ జీఓనం. 8 విడుదల చేసింది. దీంతో డ్రైవర్లు, కండక్టర్ల నోట్లో పచ్చి వెలక్కాయపడినట్లైంది. టిమ్ డ్యూటీలు చేయలేమంటూ డ్రైవర్లు ఇప్పటికే అందోళన చేస్తుంటే తాజా జీఓతో ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 160 బస్సులకు పైగా టిమ్ సర్వీస్‌లు నడుస్తున్నాయి. కండక్టర్లుగా 5 ఏళ్ల క్రితం రిక్రూట్ చేసుకున్న వారిలో నేటికి ఉద్యోగాలు లభించలేదు. వారిని ఇప్పటికి లూప్లైన్లోనే ఉంచింది. తాజా ప్రభుత్వ ఉత్తర్వులపై ఆర్టీసీ ఉద్యోగులు మండిపడుతున్నారు. 1,500 టిక్కెట్లు తగ్గకూడదు.. జిల్లాలోని ఆయా డిపోల్లో దాదాపు 793 బస్సులు తిరుగుతున్నాయి. వాటిలో 108 బస్సులను అద్దె ప్రాతిపాదికన తిప్పుతున్నారు. వీటికి సంబంధించి 1,920 మంది డ్రైవర్లు, 1,565 మంది కండక్టర్లు పనిచేస్తున్నారు. అద్దె బస్సులు పోను మిగిలిన 685 బస్సులకు గాను 160 బస్సులకుపైగా టిమ్(టిక్కెట్ ఇష్యూ మిషన్) సర్వీసులుగా నడుపుతున్నారు. వాటిలో పగలు 60, రాత్రి సమయాల్లో 100 బస్సులు తిప్పుతున్నారు. టిమ్ సర్వీసులో పనిచేస్తున్న డ్రైవర్లకు నెలకు 1,500 టిక్కెట్లకు తగ్గకుండా ఉండాలని షరతు విధించారు. ఇందుకుగాను టిక్కెట్‌కు రూ. 2 కమీషన్‌ను యాజమాన్యం ప్రకటించింది. డ్రైవరే కండక్టర్ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి స్టేజి దగ్గర టిక్కెట్లు కొట్టిన తర్వాతే బస్సును నడపాలి. ప్రస్తుతం నెల్లూరు నుంచి తిరుపతి, బెంగళూరు, విజయవాడ, చైన్నై తదితర ప్రాంతాలకు టిమ్ పద్ధతిలోనే అధికారులు బస్సు సర్వీసులు నడుపుతున్నారు. హైదరాబాద్, వైజాగ్ ప్రాంతాలకు మాత్రం డ్రైవర్లు, కండక్టర్లను పంపుతున్నారు. టిమ్‌తో ఇబ్బందులు... టిమ్ సర్వీస్‌తో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని డ్రైవర్లు వాపోతున్నారు. బస్టాండ్‌లో నిలిపి టిక్కెట్ కొట్టడం వల్ల ప్రయాణానికి ఆలస్యమవుతుంది. టిక్కెట్ మరిచిపోతే ఉద్యోగం ఎక్కడ పోతుందోనన్న ఆందోళన ఉంటుందంటున్నారు. ప్రయాణికుడు టిక్కెట్ తీసుకోకపోయిన డ్రైవర్‌పై క్రమశిక్షణ చర్యలు తప్పవు. బస్సు ఎక్కడైనా మరమ్మతులకు గురైనా, పంక్చర్ పడ్డా డ్రైవర్ ఒక్కరే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. టిమ్ సర్వీసుతో డ్రైవింగ్‌పై ఏకాగ్రత కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రతకు గ్యారెంటీ ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కండక్టర్లు నిరుద్యోగులుగా మిగులుతారన్నారు. బస్సులో డ్రైవరు ఒక్కరే ఉండటం వల్ల లగేజి ఏమి వేస్తున్నారో చూసుకోవడం కష్టమని చెబుతున్నారు. ఇటీవల కాలంలో బస్సుల్లో పేలుడు పదార్థాలు, ఎలక్ట్రానిక్స్ గూడ్సు వంటి వాటిని సరఫరా చేస్తున్నారు. తనిఖీల్లో పట్టుబడితే డ్రైవర్‌ను బాధ్యుడ్ని చేసి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని వాపోతున్నారు. టిమ్ సర్వీస్‌ల కోసం ప్రత్యేక జీఓ ఆర్టీసీలో టిమ్ సర్వీస్‌లు ఎక్కువ మొత్తంలో తిప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓనం.8 విడుదల చేసింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం 72వ నిబంధనను మార్చుతూ 72ఏ కొత్త నిబంధనను ప్రవేశపెట్టారు. ఈ జీఓ ప్రకారం డ్రైవర్‌కు కండక్టర్ లెసైన్స్ లేకపోయిన 7వ తరగతి చదివి ఉంటే టిమ్ ద్వారా టిక్కెట్లు జారీ చేయవచ్చని పేర్కొన్నారు. సంబంధింత డ్రైవర్‌కు గుర్తింపుపొందిన సంస్థలో 3 రోజుల పాటు శిక్షణ పొందితే టిమ్ సర్వీస్‌కు అర్హత పొందవచ్చని తెలిపారు. టిమ్ సర్వీస్‌పై ఇప్పటికే పలువురు డ్రైవర్లు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం డ్రైవర్ కండక్టర్ విధులు నిర్వహించకూడదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం అప్పీలు చేసింది. రిక్రూట్ అయినా ఉద్యోగాలు నిల్... ఆర్టీసీ 2009లో జిల్లాలో 250 మందిని కండక్టర్ పోస్టు కోసం సెలెక్ట్ చేసింది. అయితే 2014లో 100 మందికి మాత్రమే ఉద్యోగావకాశం కల్పించారు. వారిలో కూడా అన్ సీజన్ పేరుతో ఈఏడాది ఆగస్టులో 62 మందిని విధుల నుంచి తొలగించారు. రాష్ట్రప్రభుత్వం భవిష్యత్తులో బస్సులకు కండక్టర్లు ఉండకూడదన్న ఉద్దేశంతోనే ప్రత్యేక జీవో జారీచేసింది. మోటారు వాహనాల చట్టానికి విరుద్ధంగా జీఓ ఉందని పలువురు యూనియన్ నేతలు చెబుతున్నారు. జీఓ విషయంపై ఆర్టీసీ ఆర్ఎం రవికుమార్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. చట్టవ్యతిరేకం: నారాయణ, ఈయూ ప్రధానకార్యదర్శి, నెల్లూరు టిమ్ డ్యూటీలు చేయించడం చట్టవిరుద్ధం. ఈ విషయంపై గతంలో ఆందోళనలు చేపట్టాం. డ్రైవర్లు రెండు రకాలు విధులు నిర్వహించడం ఒత్తిడితో కూడుకున్న పని. మానసిక ప్రశాంతత కోల్పోయి తప్పులు చేసే అవకాశం ఉంది. ఉద్యమాలు చేస్తాం : రామంజులు, ఎన్ఎంయూ అధ్యక్షుడు, నెల్లూరు టిమ్ సర్వీసుల విషయం కోర్టులో నడుస్తుంది. డ్రైవర్ రెండు రకాల విధులు నిర్వహించకూడదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా ప్రభుత్వం మనసు మార్చుకోలేదు. ఈ విషయంపై ఉద్యమాలు నిర్వహించి టిమ్ సర్వీసులు రద్దుచేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం. -
ఆర్టీసీ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
- రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ, కార్మిక నేతలు - నిరవధిక సమ్మెకు మద్దతు కాకినాడ సిటీ : ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వివిధ రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 11 నుంచి వివిధ డిమాండ్లపై రాష్ట్రంలోని 13 జిల్లాల్లో చేపట్టనున్న నిరవధిక సమ్మెకు సంఘీభావం కోరుతూ ఆదివారం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కాకినాడలోని ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్ భవనంలో రాజకీయ, కార్మిక సంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పెదిరెడ్డి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సబ్బతి ఫణీశ్వరరావు, ఏపీఎన్జీఓ సంఘ రాష్ట్ర కార్యదర్శి బూరిగ ఆశీర్వాదం, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు జె.వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎంఎల్) నాయకులు వి.రామయ్య, సీఐటీయూ నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, అజయ్‌కుమార్, ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు గుత్తుల ఈశ్వరరావు, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి.హనుమంతరావు పాల్గొని ప్రసంగించారు. ఆర్టీసీ పరిరక్షణ కోరుతూ చేపట్టనున్న నిరవధిక సమ్మెకు రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు తమ మద్దతును ప్రకటించారు. ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిన ఆర్టీసీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి డిమాండ్ల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టి సమ్మెను నివారించాలని కోరారు. ప్రభుత్వం వివిధ పద్ధుల కింద ఆర్టీసీకి బకాయిపడ్డ రూ.రెండు వేల కోట్లను తక్షణం విడుదల చేయాలని, ఆర్టీసీని ప్రైవేటీకరణ చర్యలు మానుకోవాలని, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి ఆర్టీసీ యాజమాన్యం చెల్లించాల్సిన సొమ్ము వెంటనే విడుదల చేయాలని, ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవడానికి మంత్రులు, అధికారులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని తదితర 11 డిమాండ్ల తీర్మానాలను చర్చించి సమావేశంలో ఆమోదించారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి పి.సత్యానందం, రీజనల్ అధ్యక్షుడు ప్రసాద్, కాకినాడ డిపో కార్యదర్శి ఆర్.ఇందేష్ తదితరులు పాల్గొన్నారు.