- రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ, కార్మిక నేతలు
- నిరవధిక సమ్మెకు మద్దతు
కాకినాడ సిటీ : ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వివిధ రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 11 నుంచి వివిధ డిమాండ్లపై రాష్ట్రంలోని 13 జిల్లాల్లో చేపట్టనున్న నిరవధిక సమ్మెకు సంఘీభావం కోరుతూ ఆదివారం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కాకినాడలోని ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్ భవనంలో రాజకీయ, కార్మిక సంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పెదిరెడ్డి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సబ్బతి ఫణీశ్వరరావు, ఏపీఎన్‌జీఓ సంఘ రాష్ట్ర కార్యదర్శి బూరిగ ఆశీర్వాదం, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు జె.వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎంఎల్) నాయకులు వి.రామయ్య, సీఐటీయూ నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, అజయ్‌కుమార్, ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు గుత్తుల ఈశ్వరరావు, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి.హనుమంతరావు పాల్గొని ప్రసంగించారు.
ఆర్టీసీ పరిరక్షణ కోరుతూ చేపట్టనున్న నిరవధిక సమ్మెకు రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు తమ మద్దతును ప్రకటించారు. ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిన ఆర్టీసీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి డిమాండ్ల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టి సమ్మెను నివారించాలని కోరారు. ప్రభుత్వం వివిధ పద్ధుల కింద ఆర్టీసీకి బకాయిపడ్డ రూ.రెండు వేల కోట్లను తక్షణం విడుదల చేయాలని, ఆర్టీసీని ప్రైవేటీకరణ చర్యలు మానుకోవాలని, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి ఆర్టీసీ యాజమాన్యం చెల్లించాల్సిన సొమ్ము వెంటనే విడుదల చేయాలని, ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవడానికి మంత్రులు, అధికారులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని తదితర 11 డిమాండ్ల తీర్మానాలను చర్చించి సమావేశంలో ఆమోదించారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి పి.సత్యానందం, రీజనల్ అధ్యక్షుడు ప్రసాద్, కాకినాడ డిపో కార్యదర్శి ఆర్.ఇందేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
Published Sun, Sep 7 2014 11:49 PM | Last Updated on Mon, Sep 17 2018 5:32 PM
Advertisement
Advertisement