కార్మిక నేతలతో ప్రధాని చాయ్ పే చర్చ
న్యూఢిల్లీ: 46వ భారత కార్మిక సదస్సు(ఐఎల్‌సీ) సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర కార్మిక సంఘ నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. కార్మిక చట్టాలు, ప్రభుత్వ ఆర్థిక విధానాలపై వారి అభిప్రాయాలను విన్నారు. భేటీ అనంతరం.. తమ డిమాండ్లకు సంబంధించి ప్రధాని నుంచి తమకెలాంటి హామీ లభించనందున, సెప్టెంబర్ 2న తాము తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె విషయంలో వెనక్కు తగ్గకూడదని నిర్ణయించినట్లు కార్మికసంఘాల నేతలు తెలిపారు. వీరితో చర్చలు జరిపేందుకు మోదీ మంత్రుల బృందా న్ని ఏర్పాటు చేశారు.
కార్మిక నేతలతో మోదీ జరిపిన తేనీటి భేటీలో ఆ బృందం సభ్యులైన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్, పీఎంఓ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ హాజరయ్యారు. ‘మేం చెప్పిందంతా విన్నారు. ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నారని మేం వారికి స్పష్టంగా చెప్పాం. ఏ విషయంలోనూ మాకెలాంటి హామీ ఇవ్వలేదు.
అందుకే సమ్మె విషయంలో ముందుకే వెళ్లాలని నిర్ణయించాం. ఈ విషయంలో కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా ఉన్నాయి’ అని ప్రధానితో భేటీ అనంతరం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి గురుదాస్ దాస్‌గుప్తా స్పష్టం చేశారు. ఈ భేటీలో సీఐటీ యూ, బీఎంఎస్, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎం ఎస్ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ఐఎల్‌సీని సోమవారం మోదీ ప్రారంభిస్తారు.
చర్చలు అసంపూర్ణం: ఆ తరువాత కేంద్ర కార్మిక సంఘాల నేతలు, కేంద్ర మంత్రుల బృందం మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. కాంట్రాక్ట్ కార్మికులు, కనీస వేతనం అంశాలు మినహా మిగిలిన అంశాలైన కార్మిక సంఘాల గుర్తింపు, బోనస్ చట్ట సవరణ, కార్మికులకు మరిన్ని సామాజిక భద్రత పథకాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైందని ప్రభుత్వం పేర్కొనగా.. ఏ అంశంపైనా ఏకాభిప్రాయం కుదరలేదని ఏఐటీయూసీ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 2న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెపై వెనక్కు తగ్గలేదని తేల్చి చెప్పింది.
ప్రధానమంత్రి మోదీతో కార్మిక సంఘాల తేనీటి భేటీ అనంతరం.. ఆదివారం కార్మిక సంఘాల ప్రతినిధులతో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, జితేంద్రసింగ్ పలు వివాదాస్పద అంశాలపై దాదాపు 3 గంటలపాటు చర్చలు జరిపారు. అనంతరం బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులు, కనీస వేతనం అంశాలకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయన్నారు. బోనస్ చట్టం, కార్మికుల సామాజిక భద్రతకు సంబంధించిన అంశాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు. భేటీలో ఆర్థికమంత్రి జైట్లీ సూచనలకు, పలు సమస్యలకు ఆయన చూపిన పరిష్కార మార్గాలకు కార్మిక సంఘాల నేతల నుంచి సానుకూలత వ్యక్తమైందన్నారు.