ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలి | PM Modi meets Ukraine President Zelensky in New York | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలి

Published Wed, Sep 25 2024 4:11 AM | Last Updated on Wed, Sep 25 2024 4:12 AM

PM Modi meets Ukraine President Zelensky in New York

ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష  

న్యూయార్క్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశం    

అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి పయనమైన మోదీ

న్యూయార్క్‌: ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణపై, సాధారణ ప్రజల మరణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ సాధ్యమైనంత త్వరగా యుద్ధం ముగిసిపోవాలని, శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. అమెరికాలోని న్యూయార్క్‌లో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై మూడు గంటలకుపైగా చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రధానంగా ఉక్రెయిన్‌లో సంక్షోభానికి త్వరగా తెరపడేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చక్కటి పరిష్కార మార్గం కోసం అంకితభావంతో ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

ఉక్రెయిన్‌ విజ్ఞప్తితోనే మోదీ–జెలెన్‌స్కీ మధ్య ఈ సమావేశం జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. జెలెన్‌స్కీతో భేటీ అనంతరం మోదీ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. భారత్‌–ఉక్రెయిన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం  కావడమే లక్ష్యంగా గత నెలలో జరిగిన పర్యటనలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని వివరించారు.

ఉక్రెయిన్‌లో సంక్షోభానికి తెరపడి, శాంతి, స్థిరత్వం నెలకొనాలని కోరుకుంటున్నామని, అందుకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. శాంతి కోసం దౌత్య మార్గాల్లో ప్రయత్నించాలన్నారు. ఉక్రెయిన్‌–రష్యా మధ్య శాంతి చర్చలు జరగాలని సూచించారు. తమ దేశ సార్వ¿ౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ప్రధాని మోదీకి ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలియజేశారు.  

ఆర్మేనియా ప్రధానితో భేటీ  
ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్‌లో ఆర్మేని యా ప్రధానమంత్రి నికోల్‌ పాషిన్యాన్‌తో భేటీ అయ్యారు. భారత్‌– ఆర్మేనియా మధ్య సంబంధాలపై చర్చించారు. నికోల్‌తో అద్భుతమైన చర్చ జరిగిందని మోదీ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. అలాగే వియత్నాం అధ్యక్షుడు టో లామ్‌ను సైతం మోదీ కలుసుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.   

సిక్కులతో మోదీ సమావేశం  
ప్రధాని మోదీ న్యూయార్క్‌లో పలువురు సిక్కు పెద్దలతో సమావేశమయ్యారు. భారత్‌ లో సిక్కు సామాజిక వర్గం అభ్యున్నతికోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారంటూ మోదీకి సిక్కులు కృతజ్ఞతలు తెలిపారు. 

ముగిసిన మూడు రోజుల పర్యటన  
ప్రధానమంత్రి మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం న్యూయార్క్‌ నుంచి భారత్‌కు తిరుగుపయనమయ్యారు.          

పశ్చిమాసియాలో కాల్పుల విరమణ పాటించాలి: మోదీ
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండడం, పెద్ద సంఖ్యలో జనం మరణిస్తుండడం పట్ల ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన న్యూయార్క్‌లో పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌తో భేటీ అయ్యారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరపడాలని, అన్ని పక్షాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని చెప్పారు. చెరలో ఉన్న ఇజ్రాయెల్‌ బందీలను విడుదల చేయాలని హమాస్‌కు మోదీ విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్‌–పాలస్తీనా మధ్య శాంతికి చర్చలే మార్గమని పునరుద్ఘాటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement