వృద్ధికి ఊతమిచ్చే చర్యలు అవసరం...
- మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలి
- బీ20-ఎల్20 సంయుక్త తీర్మానం
అంకారా (టర్కీ): వృద్ధికి ఊతమిచ్చే చర్యల అమలుకు పూర్తి సామర్థ్యం మేర పనిచేయాలని, మరిన్ని ఉద్యోగావకాశాల కల్పనపై దృష్టి పెట్టాలని భారత్ సహా జీ20 కూటమి సభ్య దేశాలకు అంతర్జాతీయ వ్యాపార, కార్మిక నేతలు సూచించారు. అలాగే 2025 నాటికి ఉద్యోగాల్లో మహిళలు, పురుషుల మధ్య వ్యత్యాసాన్ని 25 శాతం మేర తగ్గించాలని పేర్కొన్నారు. జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, గవర్నర్ల సదస్సు సందర్భంగా భేటీ అయిన అంతర్జాతీయ వ్యాపార, కార్మిక నేతల బృందాలు ఈ మేరకు బిజినెస్20-లేబర్ 20 సంయుక్త తీర్మానాన్ని విడుదల చేశాయి. ‘ఉద్యోగాలు, వృద్ధి, గౌరవప్రదమైన పని’ పేరిట రూపొందించిన అంకారా తీర్మానంలో.. వృద్ధికి, మరింత మందికి ఉపాధి కల్పించేందుకు, పనిచేసే చోట పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఈ మూడూ కీలకమని పేర్కొన్నాయి. కార్మిక రంగానికి సంబంధించి గతసంయుక్త తీర్మానాల అమలు పురోగతి అంతంత మాత్రంగానే ఉందని డిక్లరేషన్ పేర్కొంది. యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్మాణాత్మక చర్యలు అవసరమని పేర్కొంది.