సాక్షి, ఆచంట : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్నకొద్దీ ప్రధాన పార్టీల నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. నిన్నామొన్నటి వరకూ ధీమాగా ఉన్న నేతలకు సైతం కౌటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ కలవరం మొదలైంది. ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలు ఇంకా కూడికలు తీసివేతల్లోనే ఉన్నారు. పైకి ధీమాగా ఉన్నా లోలోపల మాత్రం ఒకింత కలవరపాటు తప్పడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆచంట నియోజకవర్గంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగాయి.
నియోజకవర్గంలో 1,74,229 మంది ఓటర్లు ఉండగా 1,41,921 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గం మొత్తం మీద 81.46 శాతంపోలింగ్ నమోదైంది. కొన్ని పోలింగ్ బూత్‌లలో రాత్రి పది గంటల వరకూ ఓటర్లు బారులు తీరి ఓటింగ్‌లో పాల్గొన్నారు. నియోజకవర్గం నుంచి మొత్తం 13 మంది అభ్యర్థులు పోటీ పడగా ప్రధాన పోటీ వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యే నెలకొంది. జనసేన పోటీలో ఉన్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ఉద్దండుల పోటీతో ఉత్కంఠ...
నియోజకవర్గం నుంచి ఈసారి ఉద్దండులైన ఇద్దరు బరిలోఉండడంతో ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైఎస్సార్ సీపీ నుంచి అత్తిలి మాజీ ఎమ్మెల్యే, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు పోటీ చేయగా, టీడపీ నుంచి ఆచంట నుంచి రెండు సార్లు, పెనుగొండ నుంచి ఒక సారి గెలుపొందిన రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయ పోటీ చేశారు. ఇరువురు నేతలు కాకలు తీరిన వారే. పోల్ మేనేజ్‌మెంటులో ఇద్దరిదీ ప్రత్యేక శైలి. ఇద్దరూ ఆర్థికంగా బలవంతులు.
ఈ నేపథ్యంలో జిల్లాలో ఆచంట సీట్ హాట్ సీట్‌గా మారింది. అందరి దృష్టి అచంట మీద పడింది. గెలుపు కోసం ఇరు పార్టీల నేతలు, కేడర్ హోరా హోరీగా తలపడ్డాయి. ఆయా పార్టీల నేతలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాతంగా ముగియడంతో ఇరువురు అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. గెలుపు తమదంటే తమదే అన్న ధీమా ఇరు పార్టీల్లోనూ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బూత్‌ల వారీగా సమీక్షలు నిర్వహించారు.
వైఎస్సార్‌సీపీ విజయంపై పందేల జోరు
పోలింగ్ అనంతరం ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థుల విజయంపై పందేలు జోరుగా సాగాయి. కౌంటింగ్ తేదీ దగ్గర పడడంతో వైఎస్సార్ సీపీ విజయం ఖాయం అంటూ జోరుగా పందేలు సాగుతున్నాయి. గెలుపు ఒక్కటే కాదు ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకూ మెజారిటీ అంటూ వైఎస్సార్ సీపీ నేతలు పందేలు ముందుకు దూకటం టీడీపీ శ్రేణులను కలవర పెడుతోంది. వైఎస్సార్‌సీపీ నేతల హడావుడితో టీడీపీ నేతలు ఒకటికి రెండు సార్లు బూత్‌ల వారీగా సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు.
అయితే అంతిమ విజయం తమదే అంటూ టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ క్యాడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రధాన పార్టీల పరిస్థితి ఈ విధంగా ఉంటే జనసేన చీల్చే ఓట్లపై కూడా పందేలు జోరుగా సాగుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో పోటీ చేసిన కుడిపూడి శ్రీనివాసరావు 16,770 ఓట్లు సాధించారు. గతంలో పీఆర్‌పీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు నేడు పోటీ చేసిన జనసేన అభ్యర్థికి రావని కొందరు, దాటతాయని మరి కొందరు పందేలు కాస్తున్నారు. మొత్తం మీద పందెం రాయుళ్ల హల్‌చల్‌తో ఆయా పార్టీ కేడర్‌లో గుబులు మొదలైంది. ఏది ఏమైనా ఆచంట ఫలితంపై జిల్లా అంతటా ఆసక్తి నెలకొంది. ఫలితాలు వెలువడే ఈనెల 23 వరకూ పార్టీ కేడర్‌కు టెన్షన్ తప్పదు మరి.
Comments
Please login to add a commentAdd a comment