టిప్పర్ తగిలి వాలిపోయిన విద్యుత్ స్తంభం, తీగలు
ఆత్మకూరు: రోడ్డు పనుల కోసం కంకర తీసుకెళుతున్న టిప్పర్ విద్యుత్ స్తంభం స్టే వైరును ఢీకొనడంతో రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడి ఘోర ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రామస్వామిపల్లి గ్రామం బీసీ కాలనీలో రెండురోజులుగా సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పనుల కోసం కంకరలోడు తీసుకెళుతున్న టిప్పర్ ఆ వీధిలోని విద్యుత్ స్తంభం స్టే వైరును ఢీకొంది.
దీంతో పెద్ద శబ్దంతో ఆ స్తంభంతోపాటు సమీపంలోని మరో స్తంభం, విద్యుత్ తీగలు నేలవాలాయి. ఆ సమయంలో వీధిలో ఎక్కువ జనసంచారం లేకపోవడం, ఢీకొన్న వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. దీనికితోడు కాలనీలోని పలు వీధుల్లో విద్యుత్ తీగలు కిందుగా వేలాడుతున్న విషయాన్ని ఏఈకి సమాచారం ఇచ్చినా పట్టించుకోవడంలేదని, రోడ్డు పనుల సమయంలోనూ చర్యలు తీసుకోవాలని కోరినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ స్తంభాల మధ్య నిడివి ఎక్కువ దూరంగా ఉండడంతో గ్రామస్తులే తాటిమొద్దును ఆసరగా నిలబెట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించినా వారు నింపాదిగా సాయంత్రం వచ్చారని చెబుతున్నారు. సరఫరా నిలిచిపోవడంతో పండగ రోజుల్లో పనులకు అంతరాయంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. విచారిస్తే అధికారులు ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లినట్లు సమాచారం తెలిసిందని గ్రామస్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment